శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 41)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబది ఒకటవ సర్గ
ఎప్పుడైతే రాముడు అంత:పురస్త్రీలకు అందరికీ నమస్కరించి బయటు దేరాడో, వారందరూ ఏడవడం మొదలుపెట్టారు.“ఇంత కాలమూ రాముడు మాకు రక్షకుడుగా ఉండేవాడు. ఆ రాముడు ఇప్పుడు ఏడీ!మనము ఎలా బతకాలి!" అని వాపోతున్నారు. రాముని మంచి గుణములను తలచుకుంటూ ఏడుస్తున్నారు.
“రాముడికి అసలు కోపమే రాదు. ఎవరి మీద కోపగించడు. ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించిన, తిరిగి వారి మీద కోపింపడు. అటువంటి ఉత్తముడు రాముడు. అందరి కష్టసుఖములు తనవిగా అనుకొని ఆదరించెడి వాడు రాముడు. రాముడు తన తల్లి కౌసల్యను ఏ మాదిరి ఆదరించేవాడో మా అందరిని కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు. ఈ నాడు ఈ కైకేయి వలన మాకు రాముని అండలేకుండా పోయింది. అయినా కైక వరాలు కోరిందే అనుకో. మహారాజుగారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపుచ్చవచ్చుకదా. ఆమె మాట విని రాముని వనములకు పంపాలా! బుద్ధిలేకపోతే సరి!” అని దశరథుని కూడా నిందిస్తున్నారు.
అసలే రాముడు అడవులకుపోయిన దుఃఖంతో ఉన్న దశరథునికి అంత:పుర స్త్రీల సూటిపోటీ మాటలు భరించరానివిగా ఉన్నాయి. కానీ ఏమీ అనలేడు. తను చేసిన పని అటువంటిది కదా!
రాముడు లేని అయోధ్యలో బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించలేదు. ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించలేదు. రాముడే లేని మాకు అన్నము ఎందుకు అని అనుకున్నారు ప్రజలు. వారి మూలపురుషుడైన సూర్యుడు కూడా మొహం చాటేసాడా అన్నట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఏనుగులు ఆహారం తీసుకోలేదు. ఆవులు తమ దూడలకు పాలు ఇవ్వలేదు.
అయోధ్యలో ఉన్న ప్రజలలో ఎవరి మొహంలోనూ సంతోషము ఆనందమూ కనపడలేదు. అందరూ రాముని గురించే ఆలోచిస్తున్నారు. అయోధ్యావాసులందరూ తమ తమ దైనందిన పనులు చెయ్యడంలో ఆసక్తి చూపడం లేదు. రామునికి ఏమవు తుందో ఏమో అని దిగులుతో ఉన్నారు. ఇంక రాముని స్నేహితులు అయితే ఏకంగా మంచానికి అతుక్కుపోయారు. లేవడానికి కూడా వారికి ఓపిక లేదు. రాముడు లేని అయోధ్య ప్రాణం లేని శరీరంలాగా తయారయింది. రాముని వియోగము భరించలేక అయోధ్యలోని ప్రజలేకాదు, పశువులు, ఏనుగులు, గుర్రములు, పక్షులు కూడా ఆహారం ముట్టకుండా విలపిస్తున్నాయి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment