శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 39)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ముప్పది తొమ్మిదవ సర్గ

దశరథుడు రాముని వంక చూచాడు. అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. ముని కుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకము చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముని నార చీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కుకున్నాడు. దు:ఖంతో తలవంచుకొని కూర్చున్నాడు.

“పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లి తండ్రుల వద్దనుండి విడదీసిఉంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి. రాముని మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈ నాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్యా ప్రజలందరూ బాధపడు తున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా!" అని తనలో తనే కుమిలిపోతున్నాడు.

ఇంకతప్పదని సుమంత్రుని చూచి "సుమంతా! రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముని అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యములో విడిచిపెట్టు. సుమంత్రా! మనిషి మంచివాడుగా ఉండవచ్చు కానీ అతి మంచి వాడు కాకూడదు. రాముని అతి మంచితనమే అతనికి చేటు తెచ్చింది. ఏమి చేస్తాం. నేను నా భార్య మాట విన్నాను. రాముడు నా మాట విన్నాడు. అయోధ్య కష్టాల పాలయింది”అన్నాడు దశరథుడు.

రాజు ఆజ్ఞమేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకొని వచ్చి రాజమందిర ద్వారము దగ్గర నిలిపాడు. “రామా! రథము సిద్ధము ఉంది" అని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు. దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు.
"సీత అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఉండవలెనో, అన్ని సంవత్సరములకూ సరిపడా అమూల్యమైన దుస్తులు, అలంకారములు, ఆభరణములు తీసుకొనిరా. " అని ఆదేశించాడు. కోశాధికారి అదే ప్రకారము దుస్తులు ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు. సీత మారు మాటాడకుంటా పూర్వము మాదిరి విలువైన దుస్తులు, ఆభరణములు అలంకరించుకొంది. సాక్షాత్తు లక్ష్మీదేవి లాగా ప్రకాశిస్తూ ఉంది. లక్ష్మీకళ ఉట్టిపడుతున్న కోడలిని చూచి కౌసల్య ఆమెను గట్టిగా కౌగలించుకొంది.

“అమ్మా! సీతా! సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు. నీచ స్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు. భర్తపట్ల ఏ మాత్రం గౌరవము చూపరు. అవకాశం వస్తే మొగుడిని వదిలేస్తారు. అది ఆడువారి స్వభావము. ఎప్పుడూ చెడ్డ ఆలోచనలు కలవారికి శీలము ఉండదు. అటువంటివారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరుక్షణంలో వారిని ద్వేషిస్తారు. వారు చాలా చంచలంగా ఉంటారు. స్థిరమైన బుద్ధి ఉండదు.
కాని శీలవంతులూ, సత్యవ్రతులూ, స్థిరమైన బుద్ధి కలవారు మాత్రము తమ భర్త ఏ పరిస్థితిలో ఉన్నా వారిని ఆదరిస్తారు, గౌరవిస్తారు. నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు. ప్రస్తుతము అడవులలో ఉన్నాడని రాముని అగౌరవంగా చూడకు. ధనము లేదని రాముని నిందించకు. భర్తయే పతికి దైవము. నీవు రాముని దైవసమానుడిగా భావించాలి." అని పలికింది కౌసల్య.

అత్తగారి మాటలలో ఆంతర్యం గ్రహించింది సీత. అత్తగారితో ఇలా అంది. “అత్తగారూ! నన్ను సాధారణ స్త్రీ అనీ, దుష్టస్వభావము కల స్త్రీ అనీ ఎందుకు అనుకుంటున్నారు. నేను అలాంటి దానిని కాను. కష్టసుఖములలో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను, విన్నాను. భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు. తల్లిగానీ, తండ్రి గానీ, కుమారుడు కానీ, కుమార్తె గానీ స్త్రీకి పరిమితమైన సుఖము, ఆనందము కలిగించగలరు. కానీ భర్త మాత్రము జీవితాంతము భార్యకు సుఖాన్ని ఆనందాన్ని పంచి ఇస్తాడు. అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు? గౌరవించదు? స్త్రీలకు భర్తయే దైవము. ఆవిషయం నాకు బాగా తెలుసు. అట్టి దైవాన్ని నేను ఎందుకు అవమానిస్తాను? ఆ విషయంలో మీరు ఎలాంటి చింతా పెట్టుకోవద్దు." అని వినయంగా పలికింది సీత. సీత మాటలు విన్న కౌసల్యమ మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టు మాయం అయింది. సీతను ఆదరంగా దగ్గరకు తీసుకొంది.

రాముడు తల్లి కౌసల్యకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! నీవు ఎంత మాత్రమూ దుఃఖపడవద్దు. నేను అతి త్వరలో వనవాసము ముగించుకొని నీ ముందు నిలబడతాను. నీవు మాత్రము తండ్రి గారిని జాగ్రత్తగా చూచుకో. అమ్మా! పద్నాలుగు సంవత్సరాలు అంటే ఎంతసేపు. ఇట్టే గడిచిపోతుంది. నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసము ముగించుకొని నీ కళ్లముందు ఉంటాను.” అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు.

తరువాత అక్కడే ఉన్న తన 350 మంది తల్లుల వంకా చూచాడు. వారందరికీ భక్తి నమస్కరించాడు. “తల్లులారా! నాకు మీతో ఉన్న పరిచయం చేత గానీ, లేక నా అవివేకము వలన గానీ తెలిసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. నేను మీ అందరి దగ్గరా సెలవు తీసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించడి.” అని అందరికీ నమస్కరించాడు. రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోదించారు. అలాగే రాముని ఆశీర్వదించారు. ఎల్లప్పుడూ మంగళవాద్యములతోనూ వేద మంత్రములతోనూ మార్మోగే దశరథుని గృహము ఇప్పుడు రోదనలతో నిండిపోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)