శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 38)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ముప్పది ఎనిమిదవ సర్గ
వసిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంత:పుర స్త్రీలు నార చీర కట్టుకోడానికి రాక అవస్థలుపడుతున్న సీతను చూచి, కైకను దశరథుని మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గహించాడు దశరథుడు.దశరథుడు కైక వంక చూచి "ఓ కైకా! వసిష్ఠుల వారి మాటలు విన్నావు కదా! వారు చెప్పినది యదార్థము. సీత నారచీరలు ధరించనవసరము లేదు. సీత సుకుమారి. వయసులో చిన్నది. పుట్టినప్పటినుండి రాజభోగాలలో మునిగితేలింది. సీతకు వనవాసము సరికాదు. అని వసిష్ఠులవారు చెప్పినది అక్షరాలా సత్యము. జనకమహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించనవసరం లేదు.
ఓ కైకా! సీత నీకు ఏమి అపకారము చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు. నేను నీకు, 'సీత కూడా నార చీరలు ధరించి అడవులకు వెళుతుంది' అని వరం ఇచ్చానా! మరి సీతకు ఎందుకు ఇచ్చావు నారచీరలు? ఆమె ఎవరో తెలుసా! జనకమహారాజు కూతురు. ఆమె నారచీరలు ధరించాలా! కాబట్టి, ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతే కాదు ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను.
నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున్నాడు అడవులకు వెళుతున్నాడు. వింతగా ఉంది కదూ! కాని నేను నీకు ఇచ్చిన వరాలతో, నేను నీకు ఇచ్చిన మాటతో సీతకు ఎలాంటి సంబంధము లేదు. రాముడు నీకేమైనా అపకారము చేస్తాడని అడవులకు వెళ్లగొడుతున్నావు. అలాంటి అపకారము సీత వలన కలగదుకదా! మరి ఆమె ఎందుకు అడవులకు వెళ్లాలి? వెళ్లినా ఎందుకు నారచీరలు ధరించాలి? నీ పట్ల ఆమె ఏమి అపరాధము చేసింది?
ఓ కైకా! నీవు రాముని అడవులకు పంపుతూ మహాపాపము చేస్తున్నావు. అది చాలదన్నట్టు వాళ్లకు నారచీరలు ఇచ్చి ఘోరమైన అపరాధము చేస్తున్నావు. నరకానికిపోతావు. నరకానికి పోతావు" అని వలా వలా ఏడిచాడు దశరథుడు.
ఏడుస్తున్న తండ్రిని చూచి రాముడు ఆయన దగ్గరగా వెళ్లాడు. దశరథుని దగ్గర కూర్చుని ఇలా అన్నాడు. “ఓ మహారాజా! నా తల్లి కౌసల్య వృధ్యాప్యములో ఉంది. ఆమెకు ఏ పాపమూ తెలియదు. నేను వనములకు వెళ్లడం చూచి ఆమెకూడా మీ మాదిరి శోక సముద్రంలో మునిగి పోయింది. మీరు కూడా ఇలా శోకిస్తూ ఉంటే ఆమెను ఎవరు ఓదారుస్తారు. నా తల్లి కౌసల్యను ఆదరంతో చూడండి. ఆమెను నిరాదరించకండి. నా మీద ప్రేమతో నా తల్లి కౌసల్య ప్రాణ త్యాగము చేసుకోకుండా చూడండి. అదే మీరు నాకు ఇచ్చే వరము. ఈ ఒక్కవరాన్ని నాకు ప్రసాదించండి. నాకు వనములకు పోవుటకు అనుమతి ఇవ్వండి." అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment