శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 40)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబదవ సర్గ
సీతారామలక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధం అయింది. వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేసారు. సాష్టాంగ పడ్డారు. ఆయన పాదములు తాకారు. దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు. వనవాసానికి అనుమతి ఇచ్చాడు. తరువాత వారు కౌసల్యకు నమస్కరించారు. ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదముతీసుకున్నాడు. సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది.“నాయనా లక్ష్మణా! రాముడు నీ అన్న వనవాస సమయము లో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఎందుకంటే సుఖదుఃఖములలో రాముడే నీకు దిక్కు. రాముని నీ తండ్రి దశరథుని గా భావించు. ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు. నీ తల్లి తండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి. జాగ్రత్తగా వెళ్లిరా!" అనిపలికింది సుమిత్ర.
అందరూ రథము దగ్గరకు వచ్చారు. సుమంత్రుడు రథమువద్ద నిలబడి ఉన్నాడు. రాముని చూచి “రామా! రథము సిద్ధముగా ఉన్నది. మీరు రథము ఎక్కండి. మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకొని వెళుతాను.” అని అన్నాడు సుమంత్రుడు.
రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కారు. రథములో దశరథుని ఆదేశము మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు, ఆభరణములు పెట్టబడి ఉన్నాయి. రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు, కత్తులు, డాలులు మొదలగునవి రథములో పెట్టించాడు దశరథుడు.
రథము బయలు దేరింది. రాముడు అరణ్యములకో పోవడం చూచి అయోధ్యప్రజలు విలపిస్తున్నారు. అయోధ్య అంతా శోక సముద్రములో మునిగిపోయింది. అందరూ రాముని రథము వెంట పరుగెత్తుతున్నారు. వెనక నుండి అరుస్తున్నారు.
“ఓ సుమంత్రా! రథము కొంచెం నెమ్మదిగా పోనీయవయ్యా. మేము రాముని ఆఖరుసారిగా చూడాలి." అని అరుస్తున్నారు.
ఇంకొంతమంది అక్కడక్కడా నిలబడి "కన్నకొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌసల్య ఎలా భరించింది.” అని అనుకుంటున్నారు.
ఇంకొంత మంది “ఆహా! ఆ సీతది ఏమి అదృష్టము. రాముని వెన్నంటి అడవులకు వెళుతూ ఉంది. లక్ష్మణుడుకూడా ఎంత పుణ్యం చేసుకున్నాడో. ఈ పధ్నాలుగేళ్లు రాముని వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడు.” అని వారి అదృష్టానికి పొంగిపోతున్నారు.
ఆ ప్రకారంగా అయోధ్యా ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. భవనముల పైన ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముని చూచి "పట్టాభిషేకము చేసుకోవాల్సినవాడు, అడవులకు వెళుతున్నాడు. ఏం విచిత్రము" అని శోకిస్తున్నారు.
అయోధ్యావాసుల శోకమును చూడలేక రాముడు “సుమంత్రా! రథమును తొందరగా తోలు. వీరి బాధ చూడలేకున్నాను.” అని అన్నాడు. కాని వెనక నుండి పౌరులు రథము ఆపమని అరుస్తున్నారు. ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు. రథము వేగమును అందుకోలేక చాలా మంది కిందపడి పోయారు. కొంతమంది మూర్ఛపోయారు. ఇంకొంతమంది పట్టువిడవకుండా రథము వెంట పరుగెత్తుతున్నారు.
రాముడు రథము మీద పోతూ ఉంటే, దశరథుడు, కౌసల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రధము వెంట కొంత దూరం వచ్చారు. ఇంక ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు. తన రథము వెంట నడిచివస్తున్న వారిని చూచి రాముడు కళ్లనిండా నీళ్లు పెట్టుకున్నాడు. కాని బైటికి గంభీరంగా ఉన్నాడు. వారి బాధ చూడలేక రధమును తొందరగా పోనివ్వమన్నాడు.
కాని కౌసల్య మాత్రము రథము వెంట పరుగెత్తు తూనే ఉంది. “రామా రామా ఆగు రామా ఆగు” అంటూ అరుస్తూ ఉంది. రాముడు వెనక్కుతిరిగి తల్లిని చూచాడు. మనసు ఆగలేదు.కాని నిగ్రహించు కున్నాడు. వెనకనుండి కౌసల్యఅరుపులు సుమంత్రునికి వినిపిస్తున్నాయి. కాని రాముడు రథాన్ని ముందుకు పోనివ్వ మంటున్నాడు. సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు. రథం సాగిపోతూనే ఉంది. ఇంక రాముని వెంట నడవలేక, పరుగెత్తలేక కొంత మంది అయోధ్యా ప్రజలువెనుకకు తిరిగి వెళ్లిపోయారు. కాని మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండ బట్టలేక మరలా రథం వెంట నడుస్తున్నాడు. అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నాడు.
“మహారాజా! మనము ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటామో, వారిని ఎక్కువ దూరము సాగనంపకూడదు. కాబట్టి వెనకుకు పోదాముపదండి.” అని అన్నారు. మంత్రులమాటలను మన్నించాడు దశరథుడు. ఆగిపోయాడు. రాముడువెళ్లిన దారివెంట చూస్తున్నాడు. రథము ధూళి కనపడ్డమేరా చూస్తున్నాడు. రాముని రథము కనుచూపుమేర దాటిపోయింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment