శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 37)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

ముప్పది ఏడవ సర్గ

సుమంత్రుడు, మంత్రి సిద్ధార్థుడు పలికినమాటలు అన్నీ విన్నాడు రాముడు. తరువాత వినయంగా దశరథునితో ఇలా అన్నాడు. “తండ్రిగారూ! తమరు ఏల శ్రమ తీసుకుంటారు. వనములో ఉంటూ కందమూలములు భుజిస్తూ భూమి మీద పడుకొనేవాళ్లము మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు. ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగును ఇచ్చిన తరువాత, దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టు ఉంది. రాజ్యమే పోయిన తరువాత పరివారము రాజలాంఛనాలు ఎందుకు చెప్పండి. మాకు ఏమీ అవసరము లేదు. ఆ రాజభోగములు అన్నీ భరతుని అనుభవించ మని చెప్పండి. మాకు కట్టుకోడానికి నారచీరలు తెప్పించండి. మేము రేపటి నుండి వనవాసము చేయబోతున్నాము. మాకు కావలసినవి నేల చదును చేసుకోడానికి ఒక గునపము, గంప. అంతే. అవి తీసుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి." అని అన్నాడురాముడు.

ఇంతలో కైక కలుగచేసుకొని "నారచీరలు సిద్ధంగా ఉ న్నాయి. మీరు కట్టుకోవడమే తరువాయి" అని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారచీరలు అక్కడకు తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారచీరలు కట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా నార చీరలు ధరించాడు.

కాని సీత మాత్రం ఆ నారచీరలు కట్టుకోడానికి చాలాఅవస్థ పడింది. ముందు ఆ నారచీరలను చూచి భయపడింది. పుట్టినప్పటి నుండి పట్టు వస్త్రములు తప్ప వేరు వస్త్రములు ధరించి ఎరుగదు. అసలు అప్పటిదాకా సీత నారచీరలను చూడనే లేదు. అందుకని కైక ఇచ్చిన నారచీరలు చూచి భయపడింది సీత. కళ్లనిండా నీళ్లు తిరిగాయి. రాముని వంక చూచింది.
 
“వనములలో నివసించే మునికాంతలు ఈ నారచీరలు ఎలా ధరిస్తాతో నాకు తెలియదు. నేను ఏమి చెయ్యాలి. ఎలా కట్టుకోవాలి" అని రాముని అడిగింది.

రాముడు కూడా అయోమయంగా చూస్తున్నాడు. సీత నారచీరలను చేతిలో పట్టుకొని సిగ్గుతో తలవంచుకొని నిలబడి ఉంది. ఇంక చేసేది లేక రాముడు స్వయంగా తానే సీతకు ఆమె కట్టుకున్న బట్టల మీదనే ఆనారచీరలు చుట్టబెట్టాడు.ఆ దృశ్యం చూచి అంత:పుర కాంతలు కన్నీరుమున్నీరుగా ఏడిచారు.

ఇంక తట్టుకోలేక వారందరూ రాముని వద్దకు వచ్చి “రామా! నిన్ను అడవులకు వెళ్లమన్నారు కానీ సీతను కాదు కదా! నీవు నీ తండ్రి మాటను కాదనలేక అడవులకు పోతున్నావు. నీతో కూడా సీత ఎందుకు. నీవు లక్ష్మణుడు అడవులకు వెళ్లండి. సీత సుకుమారి. ఈమె అడవులలో నివసించలేదు. కాబట్టి, మా ప్రార్థనను మన్నించి సీతను ఇక్కడనే వదిలిపెట్టు. మేము ఆమెను కంటికి రెప్పలాగా చూచుకుంటాము. నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్లు.” అని ముక్త కంఠంతో అన్నారు.

రాముడు వారి మాటలు వినీ విననట్టు సీతకు చీర కడుతున్నాడు. ఆ సమయంలో వసిష్ఠుడు కైకనుచూచి ఇలా అన్నాడు.

ఓ కైకా! నీవు మరీ మితిమీరుతున్నావు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నావు. నీ చర్యల వలన ఇక్ష్వాకు వంశమును అపవిత్రము చేస్తున్నావు. నీవు నీ భర్తను మోసం చేసావు. అంతటితో తృప్తి పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. రాజపురోహితునిగా ఆదేశిస్తున్నాను. సీత అడవులకు వెళ్ల వలసిన అవసరం లేదు. రాముని బదులు సీత సింహాసనము మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది. భర్తకు భార్య ఆత్మ వంటిది. కాబట్టి రాముని శరీరం అడవులకు వెళ్లినా రాముని ఆత్మఅయిన సీత రాజ్యపాలన చేస్తుంది.

అలా కాకుండా సీత కూడా అరణ్యములకు వెళితే మేముకూడా అరణ్యములకు వెళతాము. అయోధ్య సాంతం మమ్ములను అనుసరిస్తుంది. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. జనం అంతా అక్కడేఉంటారు. మంత్రులు, సేనానులు, రాజోద్యోగులు, జానపదులు అంతా రాముడి వెంట ఉంటారు. ఇంతమంది రాముని వెంట ఉంటే రాముడు అంటే ప్రాణంపెట్టే భరత శత్రుఘ్నులు అయోధ్యలో ఉంటారా! వారు కూడా నార చీరలు ధరించి రాముని వెంట
అరణ్యములలో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి! నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు. అది నీకు ఇష్టమా! రాముడు లేని అయోధ్య రాజధాని కాదు. రాముడు లేని రాజ్యము రాజ్యము కాదు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య. ఆ సంగతి తెలుసుకో!

మరొక విషయం గుర్తు పెట్టుకో. భరతుడు దశరథుని కుమారుడు. అందువలన తండ్రి ఇష్టపడి రాజ్యము ఇవ్వనిదే తాను రాజ్యము స్వీకరించడు. నీ మాట విని భరతుడు రాజ్యము స్వీకరిస్తే అతడు దశరథుని కుమారుడు కాజాలడు. నీవు భరతునికి రాజ్యాభిషేకము చేసి రాజమాతగా రాజభోగములు అనుభవించాలని ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నావు. కానీ రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు. రాముడు త్యజించిన రాజ్యమును స్వీకరించడు.

ఓ కైకా! వల్లమాలిన పుత్ర ప్రేమతో నీవు నీ కుమారునికి తీరని అపకారము చేస్తున్నావు. ఒక్క భరతుడే కాదు, రాముని మాట జవదాటే వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. రాముడు వనవాసమునకు వెళుతుంటే అయోధ్యలో ఉన్న ఏనుగులు, గుర్రములు, ఇతర జంతువులు, తుదకు పక్షులు, చెట్లు చేమలు కూడా రాముడు వెళ్లినవైపు చూస్తూ నిలుచుంటాయి. ఆ దృశ్యము ఇప్పుడే నీవు కనులారా చూడగలవు.

కాబట్టి నా మాటవిను. సీతకు ఇచ్చిన నారచీరను వెనక్కు తీసుకో. ఆమెకు పట్టు బట్టలు ఇవ్వు. ఆభరణాలు ఇవ్వు. ఎందుకంటే నీవు రాముని నారచీరలు కట్టుకొని అరణ్యవాసము చెయ్యమని కోరావు కానీ సీతను లక్ష్మణుని నారచీరలు కట్టుకొనమని కోరలేదుగా.” అని వసిష్ఠుడు సీతను చూచి
"సీతా! నీవు నారచీరలు కట్టుకోనవసరములేదు. నీవు మామూలుగానే నీవు రోజూ ధరించే వస్త్రములు, ఆభరణుములు ధరించు. సీత వెంట ఆమె పరివారము, ఆమెకు రోజూ కావలసిన వస్త్రములు, ఆభరణములు, వస్తువులు అశేషంగా పంపబడతాయి. ఓ కైకా! దీనికి నీవు అడ్డుపెట్టలేవు. ఎందుకంటే నీవు కోరిన కోరికలలో సీత కూడా అరణ్యవాసము చెయ్యాలి అని నీవు కోరలేదు. అది గుర్తుంచుకో!" అని వసిష్ఠుడు కైకతో కోపంగా పలికాడు.

ఆయన మాటలు విన్న తరువాత కూడా సీత, తన నిర్ణయం మార్చుకోలేదు. రాముని వెంట వనములకు వెళ్లడానికి సిద్ధం అయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)