శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 45)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబది ఐదవ సర్గ
అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ రాముడు రథము మీద అరణ్యములకు వెళుతున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్యాపౌరులు రాముని అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయ లేక పోయింది. తన తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు, రామునికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్లకూడదు అని వారు అనుకున్నట్టు న్నారు.తన వెంటవచ్చు అయోధ్యాపౌరులను చూచి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూచి ఇలా అన్నాడు. “ఓ అయోధ్యా ప్రజలారా! మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానములకు నాకు
ఎంతో ఆనందంగా ఉంది. కాని నాది ఒక కోరిక. నా మీద మీరు చూపుతున్న ప్రేమాభిమానములు ఇదేరీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది.
భరతుడు నా తమ్ముడు. సద్గుణవంతుడు. నా కాన్న బాగుగా రాజ్యమును పరిపాలించగలడు. నా తమ్ముడు భరతుడు వయసులో నా కన్నా చిన్న వాడయినా జ్ఞానములో నా కన్నా పెద్దవాడు. నా కంటే పరాక్రమ వంతుడు. అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్నివిధములా రాజు కాదగినవాడు.
మనందరికీ ప్రభువు దశరథమహారాజు. ఆయన తన కుమారుడు భరతుని యువరాజుగా ప్రకటించాడు. మనకు మన మహారాజు మాటలను మన్నించాలి. నేను సంతోషంగా అడవులకు వెళ్లాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంటనీరు పెట్టకుండా చూచుకోవాలి. కాబట్టి మీరందరూ వెనుకకు మరలండి.” అని అన్నాడు రాముడు.
కాని వారు రాముని మాట వినలేదు. మౌనంగా ఉన్నారు. కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముని చూచి ఇలాఅన్నారు. “రామా! నీవు అరణ్యములకు వెళ్లవద్దు. రాముని రథమునకు కట్టిన
ఓ హయములారా! మీరు ముందుకు సాగకండి. మన రాముని తిరిగి అయోధ్యకు తీసుకొని రండి. ధర్మాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముని మీరు అయోధ్యకు తీసుకొని రావలెనే గానీ, అడవులకు తీసుకొని వెళ్లకూడదు." అని దీనంగా పలికారు.
వారి దీనాలాపములను విన్న రాముడు రథం దిగాడు. సీతను, లక్ష్మణుని కూడా రథం దిగమన్నాడు. నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు. అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచివెళుతున్నారు. వారు రామునితో ఇలా అన్నారు.
“ఓ రామా! మేమంతా బ్రాహ్మణులము. నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందకని మేమంతా నీ వెంట వచ్చుచున్నాము. మేము ప్రతిరోజూ అర్చించే అగ్నులను మా వెంట మోసుకొని వస్తున్నాము. మేము వాజపేయము చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు(ఛత్రములు) కూడా మా వెంట వస్తున్నాయి. ప్రస్తుతము నీకు ఛత్రము లేదు. నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో.
మాకు వేదాధ్యయనము, వేద పఠనము తప్ప మరోవ్యాపకము లేదు. ప్రస్తుతము నీ వెంటవచ్చుటయే మాకు వ్యాపకము. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. మా వెంట వేదములు ఉంటాయి. మా భార్యలు మమ్ములను తలుచుకుంటూ అయోధ్యలో ఉండగలరు. నీవు అయోధ్యకు తిరిగి రావలెనని మా నిర్ణయము. మా నిర్ణయము ధర్మసమ్మతము. ధర్మసమ్మతమైన మా నిర్ణయమును ధర్మాత్ముడవైన నీవే మన్నించకపోతే వేరు వాళ్లు ఎవరు వేరువాళ్లు మన్నిస్తారు. మేమందరమూ వృద్ధులము. మా వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి. మా ఆశలు కూడా తెల్లబడనీయకు. అయోధ్యకు మరలిరా!
నీ వెంబడి వచ్చుచున్న బ్రాహ్మణులు చాలామంది ఎన్నో యజ్ఞములు మొదలు పెట్టారు. వారందరూ తమ తమ యజ్ఞములను వదిలి వచ్చారు. వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములు పూర్చిచేయాలంటే నీవు అయోధ్యకు తిరిగిరావాలి. వారు నీ వెంట అడవులకు వస్తే, వారు తాము మొదలు పెట్టిన యజ్ఞములను ఎలా పూర్తి చేస్తారు.
ఓ రామా! మేమే కాదు. అయోధ్యలో ఉన్న చరాచరములు, సకల జీవరాసులు అన్నీ నీ రాక కొరకు ఎదురుచూస్తున్నాయి.
రామా! ఆ వృక్షములను చూడు. అవి కూడా నీ వెంట అడవులకు రావలెనని ఎంతో కుతూహలముగా ఉన్నాయి కాని వాటి వేళ్లు భూమిలో పాతుకొని పోవడం వల్ల కదలలేక, నీకోసం విలపిస్తున్నాయి. ఆ వృక్షములే కాదు, ఆ వృక్షముల మీద గూళ్లు కట్టుకొని నవసిస్తున్న పక్షలు కూడా ఆహారము మాని నీ కోసం జాలిగా ఎదురు చూస్తున్నాయి. నిన్ను వెనుకకు మరలమని వేడుకుంటున్నాయి."అని ఆ బ్రాహ్మణులు రాముని వెంట నడుస్తున్నారు.
రాముడు అడవులకు వెళ్లడం తనకు కూడా ఇష్టంలేదు అన్నట్టు తమసానది వాళ్లకు అడ్డంగా వచ్చింది. అందరూ తమసా నదీ తీరము చేరుకున్నారు. సుమంత్రుడు రథమునకు కట్టిన గుర్రములను విప్పి వాటికి స్నానం చేయించి నీరు త్రాగించాడు. వాటికి తిండి పెట్టాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment