శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 43)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబది మూడవ సర్గ
వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే కౌసల్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆమె కూడా రాముని విడిచి ఉండలేక మనసులోనే కుమిలిపోతూ ఉంది. దశరథుని చూచి ఇలా అంది:"మహారాజా! మన జీవితములలో కైక విషము చిలకరించినది. ఇప్పుడు కుముసము విడిచిన పాము వలె నిగ నిగ లాడుతూ మెరిసిపోతూ ఉంది. మనకు దుఃఖంతో కుమిలిపోతున్నాము. ఓ మహారాజా! రాముని అయోధ్యనుండి వెడలగొట్టిన కైక నన్నుకూడా విడిచిపెట్టదు. నన్ను వెంటాడి వేధిస్తుంది. పాము వలె కాటేస్తుంది. కనీసము కైక రాముని అరణ్యములకు పంపకుండా తన వద్ద దాసునిగా నియమించుకొనినా కూడా ఎంతో బాగుండేది. నాకళ్ల ఎదుట నా కుమారుడు ఉండే వాడు. నాలుగు ఇళ్లలో బిక్ష తీసుకొని వచ్చి నన్ను పోషించేవాడు.
ఓ మహారాజా! నీవు మాత్రము తక్కువ చేసావా! దేవతలకు ఇవ్వవలసిన హవిస్సులను రాక్షసులకు ఇచ్చినట్టు, రామునికి ఇవ్వవలసిన రాజ్యమును భరతునికి ఇచ్చావు. ఓ మహారాజా! ఈ పాటికి నా రాముడు అడవిలోకి ప్రవేశించి ఉంటాడంటావా! సీత, లక్ష్మణుడు వెంటరాగా అడవులలో దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడంటావా! ఎన్నడూ కష్టములు అంటే తెలియని రాముని, సీతను లక్ష్మణుని, ఆ కైక మాటవిని అడవులకు పంపావు. వాళ్లు ఎన్ని కష్టాలు పడుతున్నారో! ఏమో! ఈ వయసులో వారు సుఖాలు అనుభవిం చాల్సింది పోయి, అరణ్యములలో అష్టకష్టాలు పడుతున్నారు. పంభక్ష్య పరమాన్నములు తినడానికి అలవాటు పడ్డవాళ్లు ఆ అడవిలో దిక్కులేని వాళ్లమాదిరి కందమూలములు ఎలా తింటున్నారో కదా!
ఓ మహారాజా! రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ అయోధ్యకు వచ్చినపుడు చూడటానికి నేను బతికి ఉంటానా! ఆ మంగళకరమైన దృశ్యము కళ్లారా చూడగలనా! రామలక్ష్మణులు తిరిగి రాగానే అయోధ్య అంతా పౌర్ణమి నాటి సముద్రము మాదిరి ఎంత ఉప్పొంగిపోతుందోకదా! రాముడు సీతను రథము మీద తన పక్కన కూర్చుండపెట్టుకొని ఎప్పుడు అయోధ్యలో ప్రవేశిస్తాడో కదా! సీతారామలక్ష్మణులు అయోధ్యలోకి ప్రవేశిస్తుంటే అయోధ్యా ప్రజలు వారి మీద పూలు, లాజలు, చల్లే దృశ్యము ఎప్పుడు కనపడుతుందోకదా! అయోధ్యలోకి ప్రవేశించేముందు సీతారాములు అయోధ్య పట్టణమునకు ప్రదక్షిణము చేస్తూ కన్యలకు, బ్రాహ్మణులకు కానుకలు ఇచ్చే దృశ్యము ఎన్నడు చూస్తానో కదా!
ఓ మహారాజా! రాముడు ఈ పధ్నాలుగుసంవత్సరములు అరణ్యములలో మునుల వద్ద ఉండి ఎన్నో ధర్మములు,శాస్త్రములు నేర్చుకొని బుద్ధి పరిణతిచెంది వస్తాడేమో కాని నా రాముడు నాకు
మాత్రం ఆడుకునే మూడేళ్ల చంటి వాడి మాదిరి గానే ఉంటాడు. రాముడు రాగానే నేను వాడితో ఆడుకుంటాను. మీరు కాదనకూడదు.
మాత్రం ఆడుకునే మూడేళ్ల చంటి వాడి మాదిరి గానే ఉంటాడు. రాముడు రాగానే నేను వాడితో ఆడుకుంటాను. మీరు కాదనకూడదు.
అసలు నాకు ఈ పుత్రవియోగము కలగడానికి కారణం నేను ఏజన్మలోనో పాలు తాగే దూడలు వాటి తల్లుల వద్ద పాలుతాగడానికి పోయినపుడు నేను ఆ ఆవుల స్తన్యములను కోసివేసి ఉంటాను. అందుకనే నాకు ఇలాంటి దుర్గతి కలిగింది.
ఓ మహారాజా! నేను గోవునైతే నా రాముడు గోవత్సము. అట్టి మా ఇద్దరినీ సింహము వంటి కైక వేరు చేసినది. ఆ పాపము ఊరికే పోదు. ఓ మహారాజా! నా రాముని విడిచి నేను జీవించడం కల్ల. ఇంక ఒక్కరోజుకూడా రాముని లేకుండా నేను జీవించడం నా వల్ల కాదు. ఆ శక్తి నాకు లేదు. ఎందు కంటే దావానలము అరణ్యమును కాల్చివేసి నట్టు, పుత్రశోకము అనే అగ్ని నన్ను అనునిత్యమూ దహించి వేస్తూ ఉంది. ఆ అగ్నిలో నేను కాలి బూడిద అవడం తథ్యం." అని భోరు భోరున ఏడుస్తూ ఉంది కౌసల్య.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment