శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 10)
శ్రీమద్రామాయణము యుద్ధకాండము పదవ సర్గ తాను ఎన్ని హితమైన వాక్యములు చెప్పినా ఏమీ మాట్లాడ కుండా వెళ్లిపోయిన రావణుని ప్రవర్తన చూచి కూడా తన పట్టు వీడలేదు విభీషణుడు. వ్యక్తిగత శ్రేయస్సుకన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని నమ్మిన విభీషణుడు మరలా తన ప్రయత్నాలను కొనసాగించాడు. మరునాడు ప్రాతః కాలమునందే లేచి రావణుని గృహమునకు వెళ్లాడు. రావణుని గృహములో వేదఘోషలు మిన్నుముడుతున్నాయి. రావణుని విజయాన్ని ఆకాంక్షిస్తూ పండితులు వేదములు పఠిస్తున్నారు. మరి కొందరు పుణ్యాహవచనములు చదువుతున్నారు. రాక్షసులతో పూజింపబడుతున్న రావణుని చూచి విభీషణుడు భక్తితో నమస్కరించాడు. రావణుడు విభీషణుని పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోమని సంజ్ఞచేసాడు. విభీషణుడు రావణుడు చూపిన ఆసనము మీద కూర్చున్నాడు. రావణుడు విభీషణుని చూచి ఎందుకు వచ్చావు అన్నట్టు చూచాడు. అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు. "ఓ రాక్షసరాజా! నీకు జయము కలుగుగాక! సీత లంకలో అడుగు పెట్టినది మొదలు అశుభశకునములు కనపడుతున్నాయి. తరచుగా పాలు విరిగిపోతున్నాయి. హోమాగ్ని ప్రకాశవంతంగా వెలగడం లేదు. గుర్రములు గాడిదలు ఏదో తెలియని రోగాలతో బాధపడుతున్నాయి. కాకులు గుంపులు గుంపులుగా ఇండ్ల మీద కూర...