శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 63)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది మూడవ సర్గ
సుగ్రీవుడు దధిముఖుని బుజాలు పట్టుకొని లేవ నెత్తాడు. “ఏమయింది దధిముఖా! నీకు నీ వారికి క్షేమమే కదా! ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు. ఏం జరిగింది. వివరంగా చెప్పు" అని అడిగాడు సుగ్రీవుడు.“ఓ మహారాజా! మధువనము నీకు చెందినది. నీ తండ్రి గానీ, నీవు గానీ, నీ అన్న వాలి గానీ, ఆ మధువనమును ఎవరికీ అనుభవించమని ఇవ్వలేదు. ఆ మధువనమునకు మమ్ములను రక్షకులుగా నియమించావు. కాని ఈ రోజు కొంత మంది వానరులు వచ్చి ఆ మధువనమును ఆక్రమించుకొని, మధువును తాగి. నానా అల్లరీ చేసారు. మా అందరినీ కొట్టారు. వన రక్షకులు అడ్డుకోగా వారిని కూడా లెక్క చేయలేదు. అందరినీ కొట్టారు. వారు మధువును తాగుతూ మిగిలింది పారబోస్తూ అదేమని అడిగితే కళ్లెర్ర చేస్తున్నారు. మేము మరలా మరలా వారిని అలా చేయవద్దు అని వారింపగా మా అందరినీ అక్కడి నుండి తరిమివేసారు. మా అందరినీ కొట్టి, తన్ని ఈడ్చి, మారు మూల ప్రదేశాలకు తరిమేసారు. మీరు మాకు రాజుగా ఉండి కూడా, ఆ వానరులు ఇంతటి దురాగతానికి పాలుబడ్డారు. మధువనమును పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీరు వారిని కఠినంగా శిక్షించాలి." అని విన్నవించుకున్నాడు దధిముఖుడు.
ఈ మాటలు అన్నీ విన్న లక్ష్మణుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! అతను దేని గురించి ఎవరి గురించి చెబుతున్నాడు?" అని అడిగాడు.
"లక్ష్మణా! ఈ దధిముఖుడు మధువనమునకు రక్షకుడు. కొందరు వానరులు మధువనమును పాడుచేసారు అని అంటున్నాడు. మనము దక్షిణ దిక్కుకు పంపిన వానరులు తిరిగి వచ్చి, దారిలో ఉన్న ఆ మధువనమును పాడుచేస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. ఇక్కడ ఉన్న వానరులకు అంత ధైర్యము లేదు. వారు నిశ్చయంగా అంగదుడు, హనుమంతుడు అయి ఉంటారు. వారు వెళ్లిన కార్యము సిద్ధించనిచో వారు అలా ప్రవర్తించరు. కాబట్టి అంగదుడు,
హనుమంతుడు, జాంబవంతుడు ఈ కార్యము సాధించి ఉంటారని అనుకుంటున్నాను. హనుమంతుడు సీతా దేవిని చూచి ఉంటాడు. ఆ ఆనందములో వారంతా ఇలా విచ్చలవిడిగా మధువును తాగుతూ ఉండి ఉంటారు. హనుమంతుడు మంచి జ్ఞాని, బుద్దిమంతుడు. వివేచనా పరుడు. అతనే సీతను చూచి ఉంటాడు. హనుమంతుడు, జాంబవంతుడు నాయకత్వం వహించే వానరులకు విజయం తప్పదు. ఈ దధిముఖుడు ఆ విషయం చెప్పడానికే ఇక్కడకు వచ్చాడు.
హనుమంతుడు, జాంబవంతుడు ఈ కార్యము సాధించి ఉంటారని అనుకుంటున్నాను. హనుమంతుడు సీతా దేవిని చూచి ఉంటాడు. ఆ ఆనందములో వారంతా ఇలా విచ్చలవిడిగా మధువును తాగుతూ ఉండి ఉంటారు. హనుమంతుడు మంచి జ్ఞాని, బుద్దిమంతుడు. వివేచనా పరుడు. అతనే సీతను చూచి ఉంటాడు. హనుమంతుడు, జాంబవంతుడు నాయకత్వం వహించే వానరులకు విజయం తప్పదు. ఈ దధిముఖుడు ఆ విషయం చెప్పడానికే ఇక్కడకు వచ్చాడు.
ఓ లక్ష్మణా! రామ కార్యము సఫలమైనది. సీత జాడ తెలిసింది. అందుకే మనము పంపిన వానరులు అంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. మధువు తాగుతున్నారు. ఎందుకంటే, హనుమంతుడు సీతను చూడకపోయి ఉంటే, ఆ వానరులు ఇంత సాహసం చెయ్యరు. నాకు చెందిన మధువనములోకి ప్రవేశిస్తే మరణదండన తప్పదని అందరికీ తెలుసు." అని అన్నాడు సుగ్రీవుడు.
ఆ మాటలు విన్న రాముడు, లక్ష్మణుడు ఎంతో సంతోషించారు. అప్పుడు సుగ్రీవుడు దధిముఖునితో ఇలా అన్నాడు. “ఓ దధిముఖా! వారు ఎవరో కాదు. సీతను వెదకడానికి దక్షిణదిక్కుగా వెళ్లిన వానర వీరులు. వారు తమ పని పూర్తి చేసుకొని ఉల్లాసంగా ఉన్నారు. వారిని నేను క్షమించాను. అంత మహత్కార్యమును చేసుకొని వచ్చిన వారికి ఆ మాత్రం మధువు గ్రోలే అధికారం ఉంది. అది క్షమించరాని తప్పుకాదు కదా! నీవు పోయి వారందరినీ వెంటనే ఇక్కడకు తీసుకొని రా! నేను, రామలక్ష్మణులు వారి కోసరము వేచి ఉన్నాము అని వారికి తెలియజెయ్యి" అని అన్నాడు సుగ్రీవుడు.
రామలక్ష్మణులు హనుమంతుని రాక కోసరం, అతడు సీత గురించి చెప్పబోయే విషయాల కోసరం ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment