శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 64)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది నాలుగవ సర్గ
సుగ్రీవుని మాటలను సావధానంగా విన్నాడు దధిముఖుడు. అసలు విషయం అర్థం అయింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు నమస్కరించాడు. తనతో వచ్చిన వనపాలకులతో కలిసి వెంటనే మధువనమునకు ఎగిరిపోయాడు. అప్పటికే బాగా మధువును సేవించిన వానరులు మత్తులో తూలుతున్నారు. దధిముఖుడు చేతులు జోడించి నమస్కరిస్తూ యువరాజైన అంగదుని వద్దకు వెళ్లాడు.“యువరాజా! తమరు ఎవరో తెలియక మా వనరక్షకులు మీకు ఆటంకము కలిగించారు. మమ్ములను క్షమించండి. నీవు కిష్కింధకు యువరాజువు. నీకు ఈ మధువనము మీద సర్వాధికారములు కలవు. మా మూర్ఖత్వముచేత మీ గురించి తెలియక అపరాధము చేసినాము. మమ్ములను క్షమించండి. మీరు ఇక్కడకు వచ్చినట్టు నేను మీ పినతండ్రి సుగ్రీవుల వారికి
తెలియజేసాను. మీ రాకను గురించి విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. ఈ మధువనము ధ్వంసము అయిన దాని గురించి ఆయన విచారించలేదు. మీ అందరినీ తొందరగా రమ్మని చెప్పారు. మీ రాక కోసం రామలక్ష్మణులు, సుగ్రీవుడు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ వెంటనే సుగ్రీవుని వద్దకు పోవుట యుక్తము." అని దధిముఖుడు అంగదునితో చెప్పాడు.
దధిముఖుని మాటలు విన్న అంగదుడు హనుమంతుడు మొదలగు వానరులను చూచి ఇలా అన్నాడు. “మన గురించి, మన రాక గురించి రామునికి, సుగ్రీవునికి తెలిసిపోయింది. ఇంకా మనము ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇప్పటికే మన వాళ్లందరూ మధువు తృప్తిగా తాగి విశ్రాంతి తీసుకున్నారు. ఆడారు. పాడారు. ఇంక చాలు. ఇంక ఇక్కడ మనం చేసే పని ఏమీ లేదు. కాబట్టి మనం అందరం సుగ్రీవుని వద్దకు పోదాము. నేను యువరాజును, మీకు నాయకుడను అయినా మీరంతా నా కన్నా పెద్దవారు. అందుకని మిమ్ములను ఆజ్ఞాపించలేను. మీరంతా ఆలోచించి ఏది యుక్తము అని తోస్తే అది చేద్దాము.” అని అన్నాడు అంగదుడు.
అంగదుని మాటలు విన్న వానరులు చాలా సంతోషించారు. “యువరాజా! నీ మంచి మనస్సుకు మేము ఎంతో సంతోషించాము. రాజు అయిన వాడు, తనకున్న ఐశ్వర్యముతో మదించి, 'నేను' 'నేను' అంటూ 'మీరంతా నా మాట వినాలి' అంటూ గర్వంగా పలుకుతుంటాడు. ఎదుటి వారు చెప్పిన మంచి మాటలు కూడా పట్టించుకోడు. కాని నువ్వు యువరాజువైనా పెద్దలను గౌరవిస్తున్నావు. ఇది నీకే చెల్లింది. మరొక యువరాజు ఇలా మాట్లాడడు. నీలో ఉన్న
వినయము పెద్దల ఎడల విధేయత నిన్ను భావి మహారాజుగా తీర్చిదిద్దుతాయి. నీ మాట ప్రకారము మేము అందరమూ మన మహారాజు సుగ్రీవుల వారి యొద్దకు పోవుటకు వేచి ఉన్నాము. నీ ఆజ్ఞలేకుండా మేమందరమూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇది నిజము." అని ఆ వానరులందరూ ముక్తకంఠంతో పలికారు.
వారి మాటలకు సంతోషించాడు అంగదుడు. సుగ్రీవుని వద్దకు పోవుటకు ముందు తాను గాలిలోకి ఎగిరాడు. అంగదుని అనుసరించి మిగిలిన వానరులు అందరూ గాలిలోకి ఎగిరారు. అంగదుడు సుగ్రీవుని వద్దకు బయలుదేరిన సమయమున సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! ఇంక నీ శోకమును విడిచిపెట్టు. నీ భార్య సీత జాడతెలిసినది కదా! నేను వారికి ఇచ్చిన సమయము దాటి పోయినది. సీత జాడ తెలుసుకోకుండా వారు నా దగ్గరకు రాలేరు. వారందరూ మధువనములో మధువును సేవించి సంతోషముతో నా దగ్గరకు వస్తున్నారు అంటే వారు రామ కార్యమును సఫలముచేసుకొని వస్తున్నారు అని అనుకోవచ్చు. అంగదుడు మొదలగు వానరులు తమకు అప్పగించిన కార్యము సఫలము కానిచో మధువనములో అడుగు కూడా పెట్టేవారు కాదు. కాబట్టి వారందరూ సీతను చూచి ఆమె క్షేమములు తెలుసుకొని వస్తున్నారు. సంతోషకరమైన వార్త తీసుకొని వస్తున్నారు.
రామా! నీవు ఇంక ఊరడిల్లు. నేను దక్షిణదిక్కుకు పంపిన హనుమంతుడు కార్యదీక్ష, పట్టుదల కలవాడు. ఆతడు సూర్యుని తేజముతో సమానమైన తేజస్సు కలవాడు. అతడు నీ కార్యము
సఫలముచేసుకొని వస్తున్నాడు." అని రామునితో అంటూ ఉండగానే ఆకాశంలో వానరులు వస్తున్నట్టు వారు అరుస్తున్న అరుపులు, కేరింతలు వినబడ్డాయి. సుగ్రీవుడు తల ఎత్తి ఆకాశం వంక చూచాడు. ముందు అంగదుడు, తరువాత హనుమంతుడు, తరువాత జాంబవంతుడు, తరువాత మిగిలిన వానరులు వరుసగా వచ్చారు. అందరూ రాముడు సుగ్రీవుడి ఎదుట నిలబడ్డారు.
హనుమంతుడు రామునికి శిరస్సు వంచి ప్రణామం చేసి “సీతా దేవి క్షేమంగా ఉంది" అని తెలిపాడు.
హనుమంతుని నోటి వెంట సీత క్షేమంగా ఉంది అన్న వార్త విన్న రాముని సంతోషానికి అంతులేకుండా పోయింది. ఆమాట విని లక్షణుడు కూడా ఎంతో సంతోషించాడు. "సీతను చూచాను" అన్న హనుమంతుని వంక రాముడు ఆదరంతోనూ వాత్సల్యంతోనూ చూచాడు.
శ్రీమద్రామాయణము
సుందరకాండము అరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment