శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 65)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది ఐదవ సర్గ
అంగదుడు మొదలగు వానరులు రామునితో, తాము సీతను చూచామనీ, సీత లంకలో క్షేమంగా ఉందనీ, ఆమె రావణుని అంత:పురములో బందీగా ఉందనీ, రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారనీ, సీత ఎల్లప్పుడూ రాముని తలచుకుంటూ ఉందనీ, రావణుడు ఆమెకు రెండు మాసముల గడువు ఇచ్చాడనీ, గబాగబా, గాభరాగా, కలగా పులగంగా చెప్పసాగారు. రాముడు వారిని ఆపి, వారితో ఇలా అన్నాడు.“ఓ వానరులారా! సీత ఎక్కడ ఉంది? నా గురించి ఏమని అనుకుంటూ ఉంది? సీతను ఎవరు చూచారు. ఆ విషయములు అన్నీ నాకు వివరంగా చెప్పండి." అని అడిగాడు.
అప్పుడు ఆ వానరులు అందరూ సీతను చూచిన హనుమంతుని ముందుకు తోసారు. అప్పుడు హనుమంతుడు తన ఎదురుగా ఉన్న రామునికి, లంక వైపు తిరిగి లంకలో ఉన్న సీతకు నమస్కరించి, సీతను తను ఎలా చూచింది, సీత లంకలో ఎలా ఉ న్నదీ, రాముని గురించి ఏమనుకుంటూ ఉన్నదీ చెప్పనారంభించాడు.
“ఓ రామా! నేను నూరు యోజనముల దూరము ఉన్న సముద్రమును దాటి లంకకు చేరుకున్నాను. లంకలో సీత కోసరం అన్ని చోట్లా వెదికాను. రావణుని అంతఃపురములో నేను సీతను చూచాను. సీత తన ప్రాణములు అన్నీ నీ మీదనే పెట్టుకొని జీవిస్తూ ఉంది. ఆమెకు కాపలాగా వికృతాకారులైన రాక్షస స్త్రీలు ఆమె చుట్టు ఉన్నారు. రావణుని వరించమని సీతను భయపెడుతున్నారు. రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీతను నేను చూచాను. నీ భార్య సీత, నీతో ఉన్నప్పుడు సకల భోగములు అనుభవించిన సీత, ఇప్పుడు కష్టములు అనుభవిస్తూ ఉంది. ఆమె దీనంగా ఉంది. ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంది. నువ్వు ఎప్పుడు వచ్చి తనను ఆ రాక్షసుని చెరనుండి విడిపిస్తావా అని ఎదురు చూస్తూ ఉంది. ఆమె మరణించడానికి సిద్ధంగా ఉంది. అటువంటి సీతను నేను చూచాను.
సీతతో ఎలా మాట్లాడో తెలియక, ఇక్ష్వాకు వంశమును, మీ చరిత్రను ఆమె వినేటట్టు వర్ణించాను. అప్పుడు సీత నన్ను చూచింది. నేను నా గురించి మీ గురించి తెలిపాను. నీకు సుగ్రీవునికీ స్నేహము కుదిరినది అనీ, సుగ్రీవుడు పంపగా నేను వచ్చాను అని చెప్పాను. నా మాటలు విని సంతోషించిన సీతను నేను చూచాను. ఆమె నాతో చాలా విషయాలు మాట్లాడింది. నీవు, సీత చిత్రకూట పర్వతము మీద ఉండగా జరిగిన కాకి వృత్తాంతము నాకు ఆనవాలుగా చెప్పింది.
ఆమె నాతో ఇలా అంది. "ఓ హనుమా! నీవు ఇక్కడ చూచిన విషయాలు చూచినట్టు రామునితో, సుగ్రీవునితో చెప్పు. నన్ను చూచి నట్టు ఆనవాలుగా ఈ చూడామణిని రామునికి ఇవ్వు. రామునితో ఇంకా నామాటగా ఇలా చెప్పు. “ఓ రామా! నేను ఇంక ఒక్క మాసము మాత్రమే జీవిస్తాను. ఆ తరువాత నేను జీవించుట దుర్లభము." అని సీత నీతో చెప్పమని నాతో చెప్పింది " అని హనుమంతుడు రామునితో సీత గురించి చెప్పాడు. సీత తనకు ఆనవాలుగా ఇచ్చిన చూడామణిని రామునికి ఇచ్చాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment