శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 66)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది ఆరవ సర్గ
హనుమంతుడు ఇచ్చిన చూడామణిని చూడగానే రామునికి సీతను చూచినట్టు అనిపించింది. రామునికి దు:ఖము పొర్లుకొచ్చింది. మాటి మాటికీ చూడామణిని చూస్తూ రాముడు ఏడుస్తున్నాడు. రాముడు తన మిత్రుడు సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు.'సుగ్రీవా! ఈ చూడామణి మా వివాహ సమయములో నా మామ గారు అయిన జనక మహారాజు సీత శిరస్సున ధరించడానికి ఆమెకు ఇచ్చారు. ఈ మణి జలములో నుండి పుట్టింది. ఈ మణి తొలుత దేవేంద్రుని వద్ద ఉండేది. జనక మహారాజు ఒక యజ్ఞము చేసినప్పుడు, దేవేంద్రుడు సంతోషించి ఈ మణిని జనకమహారాజుకు ఇచ్చాడు. జనకుడు ఈ మణిని తన కుమార్తె సీతకు ఇచ్చాడు. ఈ మణిని చూస్తుంటే నాకు నా తండ్రి దశరథుడు, నా మామగారు జనక మహారాజు గుర్తుకు వస్తున్నారు. సీత ఎల్లప్పుడూ ఈ మణిని తన శిరస్సున ధరించేది. ఈ మణిని చూస్తుంటే నాకు సీతను చూస్తున్నట్టు ఉంది.
లక్ష్మణా! చూచావా! సీత నా దగ్గర లేదు. కానీ సీత ధరించిన మణి నా దగ్గర ఉంది. లక్ష్మణా! సీత ఇంక ఒక మాసము రోజులు మాత్రమే జీవించి ఉండునట! సీత లేనిదే నాకు జీవితము లేదు. నన్ను వెంటనే సీత ఎక్కడ ఉందో అక్కడకు తీసుకొని వెళ్లండి. సీతను చూడకుండా నేను క్షణకాలం కూడా ఉండలేను. సీత ఎక్కడ ఉన్నదో తెలిసి కూడా నేను ఇక్కడ ఉండలేను. ఆ రాక్షసులు నా సీతను ఎన్నిబాధలు పెడుతున్నారో ఏమో! ఎల్లప్పుడు చంద్ర బింబము మాదిరి ప్రకాశించే నాసీత ముఖం ఆ రాక్షసులు అనే మబ్బులతో కప్పబడి ఉంది. ఓ హనుమంతుడా! ఇంకా నా సీత ఏమేమి చెప్పింది. వివరంగా చెప్పు. సీత మాటలు వింటూ నేను ఊరటపొందుతాను.” అని అడిగాడు రాముడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment