శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 67)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది ఏడవ సర్గ
రాముని మాటలు విన్న హనుమంతుడు, రామునితో సీత గురించి ఇలా చెప్పసాగాడు. “ఓ రామా! చిత్రకూట పర్వతము మీద మీరూ, సీతాదేవి ఏకాంతముగా ఉన్న సమయంలో జరిగిన కాకి విషయం ఆనవాలుగా చెప్పమని నాతో చెప్పింది. ఎందుకంటే ఆ విషయము మీకు, సీతాదేవికి తప్ప మూడో వానికి తెలియదట.మీరు, సీతా దేవి చిత్రకూట పర్వతము మీద ఉన్నప్పుడు, మీరు ఇద్దరూ నిద్రపోతున్నారట. సీతాదేవి ముందే మేలుకొన్నదట. మీరు ఇంకా నిద్రపోతున్నారట. అప్పుడు ఒక కాకి వచ్చి సీతాదేవి స్తనముల మధ్య తన ముక్కుతో చీరినదట. అలా మాటి మాటికీ ఆ కాకి చీరుతూ ఉంటే సీతా దేవి శరీరమునుండి రక్తము వచ్చినదట. ఆ రక్తము నీ శరీరమును తడుపగా నీవు మేల్కొన్నావట. నిద్రలోనుండి మేల్కొన్న నీవు, గాయపడిన సీతను, చూచి కోపంతో ఊగిపోయావట. "సీతా! నిన్ను ఎవరు గాయపరిచారు. చెప్పు" అని అడిగావట. అప్పుడు సీత ఆ కాకిని చూపినదట. నీవు రక్తముతో తడిసిన గోళ్లతో ఉన్న కాకిని చూచావట. నీవు ఒక దర్భను తీసుకొని మంత్రించి ఆ కాకి మీదికి విసిరావట. అప్పుడు ఆ దర్భ మండుతూ, ఆ కాకిని దహించడానికి ఆ కాకిని తరుముతూ వెళ్లిందట. ఆ కాకి తన తండ్రి అయిన దేవేంద్రుని వద్దకు వెళ్లినదట. దేవేంద్రుడు తన నిస్సహాయతను వ్యక్తం చేయడంతో, ఆ కాకి ముల్లోకములు తిరిగి తిరిగి ఆఖరుకు నీ వద్దకు వచ్చి శరణు వేడినదట. నీవు ఆ కాకిని దయతో రక్షించావట. నీవు ప్రయోగించిన అస్త్రము వృధా కారాదని, ఆ మండుతున్న దర్భతో ఆ కాకి కుడి కన్నును పొడిచావట. బతుకుజీవుడా అంటూ ఆ కాకి నీకు, సీతకు నమస్కరించి వెళ్లిపోయినదట.
రామా! ఇంకా సీత నాతో ఇలా చెప్పింది. “కాకి మీదనే బ్రహ్మాస్త్రము ప్రయోగించిన నా రాముడు ఈ రాక్షసులను ఎందుకు ఉపేక్షిస్తున్నాడు. దేవ,దానవ, గంధర్వ, యక్షులు యుద్ధములో రాముని ముందు నిలువలేరు అని నాకు తెలుసు. ఇంక ఈ రావణుడు, ఈ రాక్షసులు ఎంత? కాని ఎందుకో రామలక్ష్మణులు నన్ను రక్షించడానికి రావడం లేదు?" అని సీతాదేవి దీనంగా పలికింది.
ఆ మాటలు విన్న నేను సీతాదేవితో ఇలా అన్నాను. “అమ్మా సీతా దేవీ! రాముడు అతి త్వరలో వానర సైన్యముతో లంకకు వచ్చి రావణుని చంపి నిన్ను రక్షిస్తాడు. అయోధ్యకు తీసుకొని వెళతాడు." అని ఆమెను ఊరడించాను. తమరికి ఆనవాలుగా చూపించడానికి ఏదైనా
ఆనవాలు ఇమ్మని అడిగాను. అప్పుడు సీతా దేవి తాను ధరించిన వస్త్రములో మూట కట్టబడి ఉన్న ఈ చూడామణిని తీసి నాకు ఇచ్చింది. నేను ఆ మణిని భక్తితో స్వీకరించి, వెనక్కు వస్తూ ఉండగా సీతాదేవి నాతో ఇలా అంది.
"ఓ హనుమా! రాముని లక్ష్మణుని, నీ రాజు సుగ్రీవుని కుశలము అడిగానని చెప్పు." అని చెప్పింది.
ఓ రామా! నేను సీతను చూచాను. సీత చెప్పమన్న మాటలు నీతో చెప్పాను. నన్ను నమ్మండి." అని పలికాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువది ఏడవసర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment