శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 68)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది ఎనిమిదవ సర్గ
"ఓ రామా! నేను బయలు దేరి వస్తుంటే సీతమ్మ నాతో ఇంకా ఈ విధంగా పలికింది.“హనుమా! ఇక్కడ జరుగుతున్న విషయములు యధాతథముగా రామునికి చెప్పి రాముని ఇక్కడకు తీసుకొని వచ్చి, రావణ సంహారము చేసి, నన్ను రక్షించునట్టు చెయ్యి. ఓ హనుమా! నీవు ఇక్కడ ఉన్నంత సేపూ నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నీవు వెళ్ళిపోతున్నావు, మరలా నా కష్టాలు మొదలవుతాయి. రాముడు తన సమగ్రసైన్యముతో వచ్చి, రావణుని జయించి నన్ను తీసుకొని వెళ్లడం రామునికి యశస్సు కలిగిస్తుంది. అంతేకానీ, రావణుడు నన్ను దొంగతనంగా తీసుకొని వచ్చినట్టు నీవు కూడా నన్ను దొంగతనంగా తీసుకొని వెళ్లడం మంచిది కాదు." అని పలికింది సీత.
ఆ మాటలకు నేను సీతాదేవితో ఇలా అన్నాను. “అమ్మా! సుగ్రీవుని వద్ద ఉన్న వానరులు సామాన్యులు కారు. ఆకాశంలో ఎగురుతూ భూమిని చుట్టిరాగల సమర్థులు. ఆ వానరసేన లంక మీద ఎగరడం, లంకను చుట్టుముట్టడం నీవు తొందరలోనే చూస్తావు. వారితో పాటు వచ్చిన రాముడు, శత్రు సంహారము చేసి, నిన్ను తీసుకొని అయోధ్యానగరము చేరి, అయోధ్యము పట్టాభిషిక్తుడవడం నీవు తొందరలోనే చూడగలవు." అని నేను సీతాదేవికి ధైర్యము చెప్పాను. సీతాదేవి నా మాటలతో మనస్సులో శాంతిని పొందింది." అని హనుమంతుడు రామునితో చెప్పాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము అరవైఎనిమిదవ సర్గ సంపూర్ణము
సుందర కాండము సర్వం సంపూర్ణం.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment