శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - మొదటి సర్గ (Ramayanam - YuddhaKanda - Part 1)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
మొదటి సర్గ
శ్రీరాముడు హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు. చాలా సంతోషించాడు."హనుమా! ఇతరులకు దుర్లభమైన కార్యమును నువ్వు నెరవేర్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నూరు యోజనముల దూరము ఉన్న సముద్రమును వాయు దేవుడు, గరుడుడు, నీవు తప్ప తక్కిన వారు దాటలేరు. అంతే కాదు, దేవతలకు, దానవులకు, గంధర్వులకు, నాగులకు కూడా ప్రవేశించుటకు వీలుకాని లంకానగరములోకి ప్రవేశించి క్షేమంగా తిరిగి వచ్చావు. అది నీకే సాధ్యమయింది.
దీనిని బట్టి చూస్తే లంకా నగరములోకి హనుమంతుడు, అతనికి సమానమైన బలపరాక్రమములు కలవాడు తప్ప, ఇతరులు ప్రవేశించలేరు అని తేలింది. కేవలము హనుమంతుడే తన బలమును పరాక్రమమును ఉపయోగించి సుగ్రీవుని ఆజ్ఞను నెరవేర్చాడు. అది ఎంత కష్టమైన కార్యము అయినా, దానిని ఆసక్తితో, చాకచక్యముతో నెరవేర్చినవాడే భృత్యులలో ఉత్తముడు అని చెప్పబడతాడు. బుద్ధిముంతుడు, సమర్ధుడు అయి ఉండి కూడా, చెప్పిన పనిని ఎంత వరకు చెప్పాడో అంతవరకే చేసేవాడిని మధ్యముడు అని చెప్పబడతాడు. బుద్ధిమంతుడు, సమర్ధుడు అయి ఉండి కూడా, రాజు చెప్పిన కార్యమును శ్రద్ధతో చేయడో, అతడు అధముడుఅని చెప్పబడతాడు. హనుమంతుడు ఉత్తముడైన భృత్యుడు. సుగ్రీవుడు చెప్పినదాని కంటే ఎక్కువే చేసుకొచ్చాడు హనుమంతుడు. పైగా అత్యంత చాకచక్యంతో సమర్ధతతో చేసుకొచ్చాడు. సుగ్రీవునకూ, నాకూ సంతోషాన్ని కలిగించాడు. ఈ హనుమంతుడు లంకకు పోయి సీతను చూచి వచ్చి నన్ను, లక్ష్మణుని, రఘువంశమును రక్షించాడు. నాకు ఇంతటి ప్రియమును చేకూర్చిన హనుమంతునికి నేను ఏమీ ప్రత్యుపకారము చేయలేకున్నాను. నాకు చాలా బాధగా ఉంది. హనుమా! ఇటురా. ఈ ఆనంద సమయంలో నేను నీకు నా ఆలింగనము తప్ప వేరే ఏమీ ఇవ్వలేకున్నాను." అని పలికి రాముడు హనుమంతుని తన రెండు చేతులు చాచి గాఢంగా కౌగలించుకున్నాడు.
తరువాత రాముడు సుగ్రీవుని, దక్షిన దిక్కుకు వెళ్లిన వానరములను, వానర సైన్యాధిపతులను చూచి ఇలా అన్నాడు. “మీరందరూ సీతాన్వేషణమును విజయవంతంగా పూర్తిచేసారు. సీతను గురించిన సమాచారమును తీసుకొని వచ్చారు. కాని నూరు యోజనముల పొడవు ఉన్న సముద్రమును తలచుకుంటేనే భయంగా ఉంది. సీతను గురించి తెలిసినది కానీ, మన వానర సైన్యము ఆ సముద్రమును ఎలా దాటగలదో తెలియకుండా ఉంది.” అని చింతాక్రాంతుడయ్యాడు రాముడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము మొదటి సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment