శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 2)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

రెండవ సర్గ

రాముడు పలికిన పలుకులు విన్న సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. 

“రామా! నీవు మహా వీరుడవు. ఈ చిన్నవిషయానికి సామాన్యుని వలె ఇంతగా చింతించవలెనా! 

ఓరామా! ఇప్పుడు మనకు సీత ఎక్కడ ఉందో తెలిసింది. ఆమెను ఎవరు అపహరించుకొని వెళ్లారో, శత్రువు ఎక్కడ ఉంటాడో తెలిసింది. ఇంక యుద్ధమే మిగిలింది. దీనికి దుఃఖించడం ఎందుకు?

రామా! నీవు బుద్ధిమంతుడవు. సకల శాస్త్ర పారంగతుడవు. మంచి ఆలోచనా శక్తి కలవాడవు. ఎంతటి క్లిష్ట సమయంలో కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోడంలో సమర్ధుడవు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం వదిలిపెట్టు. మనం అందరం అపారమైన వానరసేనతో సముద్రమును దాటి లంకకు వెళుతున్నాము. నీ శత్రువును సంహరిస్తున్నాము. సీతను అయోధ్యకు తీసుకొని వస్తున్నాము. 

ఓరామా! నిరుత్సాహంతో, బుద్ధిమందగించి, చేయబోయే కార్యమును గురించి దిగులు పడే వాడికి అతడు తలపెట్టిన కార్యములు నెరవేరవు. పైగా అన్నీ కష్టాలే కలుగుతాయి.

ఓ రామా! ఒక్కసారి ఈ వానర నాయకులను ఒక్కసారి చూడు. వీరు అత్యంత శూరులు. ఏ పని చెయ్యడానికైనా సమర్థులు. నీవు ఆజ్ఞాపిస్తే అగ్నిలో కూడా దూకడానికి వెనుకాడరు. వారి మొహాలలో తొణికిస లాడుతున్న సంతోషాన్ని గమనించు. కాబట్టి, లంకను ఎలా చేరుకోవాలా అనే సందేహమును వదిలిపెట్టి, రావణుని ఎలా జయించాలో, సీతను ఎలా తీసుకురావాలో ఆలోచించు. నూరు యోజనముల పొడవు ఉన్న సముద్రము మీద సేతువును ఎలా నిర్మించాలో ఆలోచించు. సముద్రము మీద సేతువును నిర్మించకుండా మనము సాగరమును దాటలేము. మనము సేతువును నిర్మించి, సముద్రము దాటి లంకను చేరితో చాలు, మన రాకను విని రావణుడు సగం చస్తాడు.

ఇదంతా జరగాలంటే ముందు నీ మనస్సులో మెదులుతున్న వైక్లబ్యాన్ని విడిచిపెట్టాలి. ధైర్యంగా ఆలోచించాలి. మనస్సు బలహీనమైతే, మనిషిలో ఉన్న శౌర్యము నశించిపోతుంది. నీ సహజ శౌర్యాన్ని, బలాన్ని ప్రదర్శించు. కార్య సాధనకు ఉపక్రమించు. అంతే గాని సముద్రము ఎలా దాటాలా అనే దాని గురించి ఆలోచిస్తూ దిగులుపడవద్దు. శోకము సకల కార్యములను నాశనం చేస్తుంది. నీకు సాయంగా నేను ఉన్నాను. ఈ వానర వీరులు ఉన్నారు. మనమంతా కలిసి శత్రువును జయిస్తాము. సందేహము లేదు.

రామా! నీవు ధనుస్సు చేత ధరించి, రణరంగములో నిలిస్తే, నీకు ఎదురు నిలిచేవాడు ఈ ముల్లోకములలో లేడు. అటువంటప్పుడు నీవు ఇలా శోకించడంలో అర్ధం లేదు. నీ శోకాన్ని వదిలి పెట్టు. మనమందరమూ సముద్రమును దాటి లంకను చేరి, సీతను చూస్తాము. ఇది నిజం. కాబట్టి మనం అందరం ఇప్పుడు సముద్రమును ఎలా దాటాలా అని ఆలోచించాలి. ఒక సారి సముద్రము దాటితే జయం మనదే అవుతుంది అనడంలో సందేహము లేదు. ఎందుకంటే ఈ వానరులు అందరూ పరాక్రమవంతులు. రాక్షసులను నాశనం చేయగల సమర్థులు. మనం అందరం ఏదో విధంగా సముద్రమును దాటగలమని అనుకుంటున్నాను. నాకు మంచి శకునములు కనపడుతున్నాయి. మనకు విజయం తథ్యం." అని ధైర్యవచనాలు పలికాడు సుగ్రీవుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)