శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 3)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

మూడవ సర్గ

సుగ్రీవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సముద్రము మీద వారధి కట్టి సముద్రమును దాటాలి అన్న ఆలోచన రామునికి బాగా నచ్చింది. వెంటనే హనుమంతుని చూచి ఇలా అన్నాడు. 

“హనుమా! సముద్రమును దాటడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి తపశ్శక్తి. రెండు. సముద్రమును ఎండించి, అప్పుడు దాటడం. మూడవది సముద్రము మీద వారధి కట్టడం. ఈమూడు చేయడానికి నేను సమర్ధుడను. నీవు లంకను బాగా పరిశీలించావు కదా! లంకలో ఎన్ని దుర్గములు ఉన్నాయి? అవి ఎలా నిర్మింపబడ్డాయి. రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి. లంకలో ఎంత మంది సైనికులు ఉన్నారు. నగరంలో ప్రవేశించడానికి ద్వారములు ఎన్ని ఉన్నాయి. నగరం పరిమాణం ఎంత. నాకు సవిస్తరంగా చెప్పు." అని అడిగాడు.

రాముడికి నమస్కరించి హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. "ఓ రామా! నాకు తెలిసినంతవరకూ, లంకా నగరము గురించి, దుర్గ నిర్మాణము గురించి చెబుతాను. లంకలో లెక్కకు మించి ఏనుగులు, రథములు ఉన్నాయి. లంక చాలా విశాలమైన నగరము. అది ఒక పర్వతము మీద నిర్మింపబడి ఉంది. లంకా నగరమునకు నాలుగు పక్కలా నాలుగు ప్రధాన ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారములకు ధృడంగా, గట్టిగా నిర్మించ బడ్డ దుర్భేద్యమైన తలుపులు పెద్ద పెద్ద గడియలతో బంధింపబడి ఉన్నాయి. కోటలో నుండి పెద్ద పెద్ద బండ రాళ్లు, బాణములు శత్రువుల మీద ప్రయోగించడానికి రకరకాలైన యంత్రములు కోట గోడల మీద అమర్చబడి ఉన్నాయి. వాటి సాయంతో బయట నుండి వచ్చే శత్రు సైన్యములను అరికట్టవచ్చును. అవే కాకుండా వందల కొద్దీ శతఘ్నులు ఇనుముతో తయారు చేయబడినవి ద్వారముల వద్ద అమర్చబడి ఉన్నాయి. వాటిని ఏ క్షణంలో అయిన ఉపయోగించడానికి వందలకొద్దీ రాక్షసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు.
లంకా నగరమునకు అమర్చబడిన ద్వారములు అన్నీ బంగారుతో చేయబడి ఉన్నాయి. లంకా నగరము చుట్టు ఉన్న పరిఖలలో అంటే కందకములలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆ కందకములలో భయంకరమైన మొసళ్లు ఉన్నాయి. ఆ పరిఖల మీద నాలుగు ద్వారముల వద్ద నాలుగు వంతెనలు అమర్చబడి ఉన్నాయి. ఆ వంతెనల వద్ద కూడా పెద్ద పెద్ద యంత్రములు అమర్చబడి ఉన్నాయి. శత్రు సైన్యములు దాడి చేసినప్పుడు, రాక్షసులు ఆ యంత్రముల ద్వారా బాణములు, బండరాళ్లు విసిరి ఆ వంతెనలను కాపాడుతూ ఉంటారు.

రావణుడు కూడా ఎల్లప్పుడూ యుద్ధమునకు సిద్ధముగా ఉన్నాడు. చాలా అప్రమత్తంగా ఉన్నాడు. రావణుని సైన్యము కూడా ఏ క్షణంలో ఆపద వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది. ఆ లంకానగరము ఎత్తైన పర్వత శిఖరము మీద ఉండటం వలన, చుట్టూ పర్వతములు, దట్టమైన అరణ్యములు ఉండటం వలనా, లంకా నగరము చేరుకోడానికి తగిన ఆధారములు లేవు. మనము లంకకు చేరుకోడానికి నౌకా మార్గము లేదు. లంక నుండి వార్తలు కూడా బయటకు వెళ్లలేవు. ఆ లంకా నగరము చుట్టు ఎత్తైన గోడ, కందకములు, పెద్ద పెద్ద ద్వారములు, వాటిని రక్షించు శతఘ్నులు, యంత్రములు ఉండటం వలన లంకలో వానర సేన ప్రవేశించడం చాలా కష్టం.
లంక తూర్పుద్వారమును పదివేల మంది రాక్షనులు శూలములు, ఖడ్గములు ధరించి రక్షిస్తున్నారు. లంక దక్షిణ ద్వారము వద్ద లక్ష మంది సైనికులు కాపలాగా ఉన్నారు. పశ్చిమ ద్వారము వద్ద పది లక్షల మంది సేనలు ఉన్నాయి. అందరూ కత్తులు, డాలులు ధరించి ఉన్నారు. వారు అస్త్రవిద్యలో కూడా నిపుణులు. ఉత్తర ద్వారము వద్ద కోటి మంది సైనికులు కాపలాగా ఉన్నారు. వారందరూ రథములు, అశ్వములు వాహనములుగా ఉపయోగిస్తున్నారు. లంకా నగరము మధ్యలో ఉన్న సైనిక శిబిరములలో దాదాపు కోటికి మించిన రాక్షస వీరులు ఉన్నారు.

రామా! నేను లంకా దహనము చేసేటప్పుడు నాలుగు పక్కల ఉన్న వంతెనలను కూల్చివేసాను. ప్రాకారములు కూల్చాను. నా మీదికి యుద్ధమునకు వచ్చిన రాక్షస వీరులను చంపాను. రాక్షస సేనలను నాశనం చేసాను. రామా! ఇదీ లంకా నగరస్వరూపము. మనము సముద్రము దాటి లంకా నగరము చేరుకుంటాము. ఇది నిశ్చయము. ఇంక మన సేనల సంగతి. మనవారిలో అంగదుడు, ద్వివిదుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, అనలుడు, నీలుడు వీరు చాలు లంకను సర్వనాశనము చేసి, రావణుని చంపి సీతను తీసుకురావడానికి.

కాబట్టి లంక మీద దండయాత్ర చేయడానికి మంచి ముహూర్తము నిశ్చయించండి." అని పలికాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)