శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నాల్గవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 4)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నాలుగవ సర్గ
హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. రామునిలోని శౌర్యము, ప్రతాపము ఉప్పొంగింది.“మనమందరము లంకకు చేరుకొని దానిని నాశనం చేద్దాము. సుగ్రీవా! వెంటనే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించు. వానర సేనలను సర్వసన్నద్ధము కావించు. నా సీతను అపహరించిన ఆ రావణుడు నన్ను తప్పించుకొని ఎక్కడకు పోగలడు? సుగ్రీవా! నేడు ఉత్తరఫల్గునీ నక్షత్రము. రేపు చంద్రుడు హస్తా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అంతే కాకుండా శుభశకునములు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయాణమునకు ఇదే మంచి ముహూర్తము. మనకు విజయము తథ్యము. సుగ్రీవా! సైన్యములను బయలుదేరమని ఆజ్ఞాపించు.” అని అన్నాడు రాముడు.
సుగ్రీవుడు, లక్ష్మణుడు రాముని ఆదేశములను శిరసావహించారు. తరువాత రాముడు వానర సేనాపతులకు ఈ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు.
“నీలుడు లక్షమంది సైనికులను తీసుకొని మార్గమును సరి చూచుకుంటూ ముందు వెళతాడు. మన సైనికులు వెనక వస్తారు. నీలుడు మార్గమధ్యంలో ఫలములు, దుంపలు, చల్లని నీడనిచ్చే అడవులు, నీరు, తేనె ఉన్న మార్గములను ఎంచుకొని ఆ దారిలో ప్రయాణిస్తూ మనకు మార్గము చూపుతాడు.
ఓ నీలుడా! మనము సైన్యముతో వస్తున్నామని తెలిసి రాక్షసులు దారిలో కాపు కాచి మనకు ఆహారము దొరకకుండా చేసే అవకాశము ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మన సైనికులకు సమృద్ధిగా ఆహారము సమకూర్చే బాధ్యత నీది. నీ సైనికులు మార్గ మధ్యంలో ఉన్న పల్లపు ప్రాంతములు, కొండలు గుట్టలు అన్నీ గాలిస్తూ, రాక్షసులు ఎక్కడన్నా దాక్కుని ఉంటారేమో అని చూడవలెను.
తరువాత, కిష్కింధా నగర రక్షణ కొరకు కొంత మంది సైన్యమును ఇక్కడే ఉంచండి. మిగిలిన సైన్యము గుంపులు గుంపులుగా ఏర్పడి వారి వారి నాయకుల ఆజ్ఞానుసారము ముందుకు నడవాలి. మహాబలవంతులైన గజుడు, గవయుడు, గవాక్షుడు సైన్యము ముందు నడుస్తారు. ఋషభుడు వానర సైన్యమునకు కుడి పక్కన రక్షణగా నడుస్తాడు. మహావీరుడైన గంధమాధనుడు సైన్యము ఎడమ పక్కన రక్షకుడిగా నడుస్తాడు. నేను హనుమంతుడు మీద ఎక్కి సైన్యము మధ్యలో నడుస్తాను. లక్ష్మణుడు అంగదుని మీద ఎక్కి నడుస్తాడు. జాంబవంతుడు, సుషేణుడు, వేగవంతుడు సేనలకు మధ్యలో నడుస్తారు." అని సైన్యములకు ఆదేశాలు ఇచ్చాడు రాముడు.
వెంటనే సుగ్రీవుడు వానర సేనలకు రాముడు చెప్పినట్టు చేయమని ఆజ్ఞాపించాడు. సుగ్రీవుని ఆజ్ఞ వినగానే వానరులంతా ఒక్కుమ్మడిగా పైకి లేచారు. అంతా దక్షిణదిక్కుగా ప్రయాణమయ్యారు. రాముడు, హనుమంతుడు ముందు నడుస్తుంటే వానర సేనలు వారిని అనుసరించి వెళ్లాయి. వానరులంతా గాలిలో ఎగురుతూ వెళుతున్నారు. దారిలో కనపడ్డ ఫలములను తింటూ తేనెను తాగుతూ ఆకలి తీర్చుకుంటూ ప్రయాణము చేస్తున్నారు. ఆ వానర సేనలు దారిలో ఆటాడుకుంటూ ఒకరిని ఒకరు తోసుకుంటూ నెట్టుకుంటూ రాక్షసులను ఎలా చంపాలో ముందుగా చూసుకుంటున్నారు.
రాముడి ఆదేశము ప్రకారము నీలుడు, ఋషభుడు, కుముదుడు ముందు నడుస్తూ సైన్యము ప్రయాణించే మార్గమును సరిచూస్తున్నారు. వానర రాజు సుగ్రీవుడు, రామలక్ష్మణులు, సేనలకు మధ్యలో నడుస్తున్నారు. దాదాపు పదికోట్ల మంది వానర సైన్యమునకు శతబలి అనే వానరుడు సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. నూరు కోట్ల వానరములకు కేసరి, పనసుడు, గజుడు ఆధిపత్యము వహిస్తున్నారు. సుషేణుడు, జాంబవంతుడు, సైన్యమునకు వెనక భాగమును రక్షిస్తున్నారు. వానర వీరుడు నీలుడు సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. వలీముఖుడు, ప్రజంఘుడు, జంభుడు, రభసుడు సైన్యము నాలుగుపక్కలా తిరుగుతూ తొందరగా నడవండని ఉత్సాహపరుస్తున్నారు. కోట్ల కొలది వానర సేన పర్వతములు, కొండలు, గుట్టలు అరణ్యములు దాటుకుంటూ ప్రయాణము చేస్తున్నారు.
కొంతమంది వానరులు గాలిలో ఎగురుతుంటే మరి కొంతమంది దుముకుతూ, మరి కొంతమంది నడుస్తూ ప్రయాణిస్తున్నారు. వారి మధ్యలో ఉన్న రాముడు, లక్ష్మణుడు, సూర్యచంద్రుల మాదిరి వెలిగి పోతున్నారు. రాముడు ఎక్కడ శోకసముద్రంలో మునిగిపోతాడో అని లక్ష్మణుడు రాముని చక్కని మాటలతో ఉత్తేజపరుస్తున్నాడు.
“రామా! మనమందరము శీఘ్రమే లంకకు చేరి, రావణుని చంపి, సీతను తీసుకొని వస్తాము. అందరమూ అయోధ్యకు వెళదాము. మనకు అన్నీ శుభ శకునములు కనపడుతున్నాయి. వాయువు మనకు అనుకూలంగా వీస్తున్నాడు. ఈ సమయములో శుక్రుడు నీకు అనుకూలంగా ఉన్నాడు. (శుక్రమహర్దశ) విశాఖ నక్షత్రము వేరే దుష్టగ్రహములతో కలవకుండా నిర్మలంగా ఉంది. విశాఖ నక్షత్రము మన ఇక్ష్వాకు వంశీయుల నక్షత్రము. రాక్షస నక్షత్రమైన మూలా నక్షత్రమునకు అధిదేవత నిరృతి. ఆ మూలా నక్షత్రమును తోకచుక్క ఆవహించింది. అది రాక్షసులకు అనర్ధహేతువు. రాక్షసులకు మృత్యువు ఆసన్నమయింది అనడానికి ఇదే సంకేతము. కాబట్టి రామా! ఈ శుభశకునములను చూచి నీవు సంతోషించాలి.” అని పలికాడు లక్ష్మణుడు.
ఆ వానరసేనలు ప్రయాణిస్తుంటే వానరులతో భూమి అంతా కప్పబడి పోయిందా అన్నట్టు కనపడుతూ ఉంది. ఆ వానర సేనలు ఎక్కడా నిలువ కుండా నిరంతరాయంగా ప్రయాణం సాగిస్తున్నాయి. వానర సేనలు సహ్య, మలయ పర్వతములను అధిగమించి ముందుకు సాగుతున్నారు. ఆ పర్వతముల మీద ఉన్న చెట్ల నుండిఫలములను కోసి తింటూ, తేనెను తాగుతూ, చెట్లను కింద పడవేస్తూ, ఆడుతూ పాడుతూ గెంతుతూ, ప్రయాణిస్తున్నారు. వారందరూ సహ్యపర్వతమును, మలయ పర్వతమును దాటి సముద్ర తీరము చేరుకున్నారు.
రాముడు మహేంద్ర పర్వత శిఖరము మీద నిలబడి సముద్ర మును చూచాడు. ఇలా అన్నాడు.
“సుగ్రీవా! మనము మొదట్లో అనుకున్న చింత మరలా మొదలయింది. ఇంత విశాలమైన సముద్రమును, అలలతో భయంకరంగా ఉన్న సముద్రమును ఎలా దాటడమా అని ఆలోచిస్తున్నాను. ఈ సముద్రమునకు ఆవల గట్టు కనిపించడం లేదు. దీనిని ఏదో ఒక ఉపాయమే చేత దాటాలి కానీ మరొక విధంగా దాటలేము. కాబట్టి సుగ్రీవా! మన సైన్యమును ఇక్కడే ఉండమని చెప్పు. మనము ఈ సముద్రమును ఎలా దాటాలో ఆలోచిద్దాము." అని అన్నాడు రాముడు.
రాముని ఆదేశము మేరకు సుగ్రీవుడు వానర సేనను అక్కడ ఆగమని ఆజ్ఞాపించాడు. అందరూ అక్కడ ఉన్న చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరి అధీనములో ఉన్న సేనలను వారు ఆజ్ఞాపిస్తున్నారు. వానర సేన అరిచే అరుపులు, పెట్టే కేకలు, చేసే ధ్వనులు సాగర ఘోషను మించిపోయాయి. అప్పటికి సాయంకాలము అయింది. చంద్రుడు ఉదయిస్తున్నాడు. చంద్రోదయ కాలంలో సాగరము ఉధృతంగా ఉప్పొంగుతూ ఉంది. పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతూ తీరాన్ని తాకుతూ ఉన్నాయి. చూచే వారికి ఆకాశము సముద్రము కలిసిపోయాయా అన్నట్టు కనపడుతూ ఉంది. రెండూ నీలి రంగులో ఉండటం వలన ఆకాశానికి సముద్రానికి భేదం తెలియకుండా ఉంది. సముద్రము ఒడ్డున కూర్చుని ఉన్న వానర ప్రముఖులు అనంతమైన ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నారు. ఆమహాసముద్రమును ఎలాదాటాలా అని ఆలోచిస్తున్నారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment