శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 5)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఐదవ సర్గ

నీలుడు తన సేనలను సముద్రము ఉత్తరదిక్కుగా నిలిపాడు. మైందుడు, ద్వివిదుడు వానర సేనలు విడిది చేసిన ప్రాంతం అంతా సంచరిస్తూ, వారి రక్షణ గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్రమును చూస్తున్నరాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.

“లక్ష్మణా! రోజులు గడిచే కొద్దీ మనిషిలో ఉన్న శోకము తగ్గి పోతుంది అంటారు. కానీ సీత గురించి నేను పడుతున్న శోకము తగ్గకపోగా రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. 

లక్ష్మణా! ఈ గాలి ముందు నా సీత మీద ప్రసరించి, తరువాత నా మీద ప్రసరిస్తే నేను నా సీతను సృశించిన సుఖమును పొందుతాను. నా సీత ఇప్పుడు చంద్రుడిని చూస్తూ ఉంటుంది. నేను కూడా అదే చంద్రుడిని చూస్తున్నాను. అప్పుడు మా ఇరువుని చూపులు కలిసినట్టే కదా! నేను, సీత ఇదే భూమి మీద ఉన్నాము. అంటే నేను నా సీత దగ్గర దగ్గరగా ఉన్నట్టే కదా! నా సీతను రావణుడు తీసుకొని పోతుంటే నా సీత అరిచిన అరుపులు నాకు హృదయవిదారకంగా వినపడుతున్నాయి. నేను ఏమీ చేయలేని అసమర్ధుడిలా మిగిలిపోయాను.

సీత లేని తాపము నేను భరించలేను. ఈ సముద్రము జలములలో మునిగి నా తాపమును చల్లార్చుకుంటాను. నేను ఎన్నడు ఈ సముద్రమును దాటి, రావణుని చంపి, నా సీతను తిరిగి పొందుతానో కదా! ఆ రాక్షసుల మధ్య అనేక బాధలు పడుతూ ఉన్న నా సీత, నాధుడు కలిగి ఉండి కూడా అనాథగా విలపిస్తూ ఉంది కదా! పుట్టినప్పటి నుండీ జనక మహారాజు సంరక్షణలో ఎన్నోభోగాలు అనుభవించి, తరువాత దశరథమహారాజు ఇంటికి కోడలిగా వచ్చిన నా సీత ఆ క్రూరులైన రాక్షస స్త్రీల మధ్య ఎలా ఉందో కదా! నా మీద దిగులుతో సరిగా ఆహారం కూడా తీసుకోని సీత, ఎంతగా చిక్కిపోయిందో కదా! నేను ఆ రావణుని ఎప్పుడు చంపి నా సీతను పొందుతానో కదా!" అని తీవ్రంగా రాముడు విలపి స్తున్నాడు.

ఆప్రకారంగా విలపిస్తున్న రాముని లక్ష్మణుడు ఓదార్చాడు. తరువాత వారు సాయంసంధ్యలో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)