శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 6)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఆరవ సర్గ
ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ లంకాపురిలో రావణుడు చింత్రాక్రాంతుడయి ఉన్నాడు. ఒక కోతి వచ్చి లంకను దహనం చేసింది. తన కుమారుని చంపింది. వేలకొద్దీ రాక్షస వీరులను హతమార్చింది. రావణుని మనసంతా కలత చెందింది. తన మంత్రులతో సమావేశము ఏర్పాటు చేసాడు."ఒక వానరము శత్రుదుర్భేధ్యమైన లంకా నగరంలో ప్రవేశించి అశోక వనములో ఉన్న సీతను చూడగలిగాడు. అంతే కాకుండా అశోక వనములో ఉన్న చైత్యప్రాసాదమును నాశనం చేసాడు. ఎందరో రాక్షసులను చంపాడు. లంకను కాల్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది. మీకు తోచిన విధంగా నాకు సలహాలు ఇవ్వండి. ఈ సమయములో నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇదంతా రాముని వలన జరిగింది. రాముని విషయంలో మనం ఏం చెయ్యాలి.
లోకంలో మూడు రకాలైన మనుషులు ఉంటారు. వారు ఉత్తములు, మధ్యములు, అధములు. రాజు హితము కోరేవారు, మంత్రాంగములో సమర్ధులు, హితులతోనూ, బంధువులతోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొనే వాళ్లు, దైవానుకూలము కొరకు ప్రయత్నము చేసేవారు ఉత్తములు అని పిలువబడుతారు. ఇతరుల ప్రమేయం లేకుండా, ఇతరులతో ఆలోచించకుండా, సొంత నిర్ణయాలు తీసుకొనే వాడు, ఇతరుల సాయం లేకుండా ఒంటరి గానే పనులు చేసేవాడు, మధ్యముడు అని పిలువబడతాడు. పురుష ప్రయత్నం లేకుండా, కేవలం దైవము మీదనే ఆధారపడేవాడు అధముడు అని పిలువబడతాడు.
అలాగే మంత్రాంగములో కూడా ఉత్తమము, మధ్యమము, అధమము అని ఉన్నాయి. శాస్త్రములలో చెప్పిన మాదిరి, మంత్రులతో కలిసి చేసే ఆలోచన ఉత్తమమైన ఆలోచన. మంత్రులతో చర్చించినపుడు బేధాభిప్రాయాలు వచ్చినా, తుదకు చేసే ఏకాభిప్రాయము, సమిష్టినిర్ణయం మధ్యమము అని చెప్పబడుతుంది. అలా కాకుండా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ, ఒకరితో ఒకరు విభేదిస్తూ, ఎంతకూ ఏకాభిప్రాయానికి రాని మంత్రాంగము అధమము అని చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి ఒక అభిప్రాయమునకు రండి. దానిని రాజుగా నేను అమలుపరుస్తాను.
అదీ కాకుండా, నాకు అందిన సమాచారము ప్రకారము రాముడు అసంఖ్యాకమైన వానర సేనలతో లంకా నగరము మీదికి దండెత్తి వస్తున్నాడు అని నాకు తెలిసింది. వారంతా సాగరమును దాటి లంకను చేరుకోగలరు అని నేను అనుకుంటున్నాను. రాముడు తన బలపరాక్రమ ములతో సముద్రమును ఎండింపచేయగలడు. లేక మరే ఉపాయము చేతనైనా సముద్రమును దాటవచ్చును. కాబట్టి ఈ క్లిష్ట సమయములో మీరు బాగా ఆలోచించి నాకు ఉత్తమమైన సలహా ఇవ్వండి." అని ముగించాడు రావణుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment