శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 7)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఏడవ సర్గ
రాక్షస రాజు రావణుని మాటలు శ్రద్ధగా విన్నారు రావణుని మంత్రులు. బాగా ఆలోచించారు. వారికి తోచిన ఉపాయములను ఇలా చెప్పసాగారు. “రాక్షసేంద్రా! మన రాక్షస బలము తక్కువ కాదు. పరిఘలు, కత్తులు, పట్టిశములు మొదలగు మారణాయుధములను ధరించిన రాక్షససేన లెక్కకు మించి ఉంది. నీకు దిగులుపడాల్సిన పనిలేదు. ఇంక నీ బలపరాక్రమములు తక్కువేమీ కాదు. నీవు పాతాళములో ఉన్న భోగవతీ నగరమును జయించిన వీరుడివి. యక్షులను జయించి, యక్షరాజు, నీ సోదరుడు అయిన కుబేరుని ఓడించిన శూరుడవు. మహేశ్వరునకు సఖుడు అని చెప్పుకొనుచున్న కుబేరుని గర్వము అణిచిన మహాబలుడవు. కుబేరుని వద్దనుండి పుష్పకమును తీసుకొని వచ్చిన ధీరుడవు. దానవ రాజు మయుడు నీ బలపరాక్రమములకు భయపడి తన కుమార్తె మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేసాడు. నీతో బంధుత్వము కలుపుకున్నాడు. దానవ వీరుడు, నీ సోదరి కుంభీనసి భర్త అయిన మధువును ఓడించిన పరాక్రమశాలివి. నీవు రసాతలములో ఉన్న వాసుకి, తక్షకుడు, శంఖుడు మొదలగు నాగులను జయించి, నాగజాతిని వశం చేసుకున్నావు. నీవు ఒంటరిగానే కాలకేయులు అనే దానవులను జయించావు. వాళ్ల దగ్గర నుండి అనేక మాయలను గ్రహించావు. చతురంగ బలములు కలిగిన వరుణ పుత్రులను జయించిన మహా వీరుడవు నీవు. నీవు యమలోకమును జయించి యముని యమలోకము నుండి పారిపోయేట్టు చేసావు. నీవు ఈ భూలోకములో ఉన్న ఎంతో మంది క్షత్రియులను సంహరించావు. వారితో పోలిస్తే ఈ రాముడు ఎంత?మీరు దీని గురించి ఆలోచించడం అనవసరం. తమరి కుమారుడు ఇంద్రజిత్తు చాలు ఆ వానరులను తుదముట్టించడానికి ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు. మహేశ్వరునే మెప్పించి వరములను పొందిన వాడు. దేవతలను ఓడించి దేవేంద్రుని పట్టబంధించి తెచ్చిన ధీరుడు ఇంద్రజిత్తు. అంతలో బ్రహ్మదేవుడు జోక్యము చేసుకొని దేవేంద్రుని విడువమని ఇంద్రజిత్తును అర్ధించాడు. అప్పుడు ఇంద్రజిత్తు దేవేంద్రుని విడిచిపెట్టగా, దేవేంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్లాడు. అటువంటి పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తును పంపితే చాలు, ఆ వానరసైన్యమును రామునితో సహా సమూలంగా నాశనం చేస్తాడు.
ఓ రాక్షసేంద్రా! ఒక సామాన్యమానవుని వలన వచ్చిన ఈ ఆపదకు చింతించకు. రాముని నీవు వధిస్తావు. విజయము నీకు స్వంతమవుతుంది.” అని పలికారు రావణుని మంత్రులు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment