శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 8)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఎనిమిదవ సర్గ
తరువాత ప్రహస్తుడు అనే రాక్షస సేనాధిపతి లేచి ఇలా అన్నాడు. “ఓ రాక్షసేంద్రా! నీవు యుద్ధములో దేవతలను, గంధర్వులను, దానవులను, నాగులను జయింప సమర్ధుడవు. ఇంక ఈ ఇద్దరు మానవులు నీముందు నిలువగలరా! హనుమంతుడు అనే వానరము వచ్చినప్పుడు మనమందరమూ అప్రత్తంగా, యుద్ధమునకు సిద్ధంగా లేము. అందువలన ఆ వానరము అంతటి దురాగతములు చేయగలిగాడు. లేనిఎడల, ఆ తుచ్ఛ వానరము లంకను దాటి పోగలడా! నీవు ఆజ్ఞాపిస్తే చాలు. ముల్లోకములలో వానరము అనే మాట వినపడకుండా చేస్తాము. వానర జాతిని సర్వనాశనము చేస్తాము. ఓ రాక్షసరాజా! మీరు సుగ్రీవుని విషయం నాకు విడిచిపెట్టండి. వాడిని నేను కట్టడి చేస్తాను. సీతను తీసుకు వచ్చినందుకు మీరేమీ చింతించకండి." అని పలికాడు ప్రహస్తుడు.తరువాత దుర్ముఖుడు అనే రాక్షసుడు లేచి ఇలా పలికాడు. “ఓ రాజా! ఆ వానరుడు మన లంకకు చేసిన అపకారము సహించరానిది. ఒక వానరుడు లంకాధిపతిని ఎదిరించడమా! అది మేము సహించడమా! నేను ఇప్పుడే పోయి ఆ వానర జాతిని వారు ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి సర్వనాశనము చేస్తాను." అని అన్నాడు.
తరువాత వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడు ఇలా అన్నాడు. “మనము ఆ వానరము హనుమంతుని గురించి ఆలోచించడం తగని పని. మన దృష్టి ఎప్పుడూ సుగ్రీవుడు, రాముని మీద ఉండాలి. వారిని చంపితే ఈ వానరుడు ఎంత! నాకు అనుమతి ఇస్తే వెంటనే పోయి ఆ రామలక్ష్మణులను, సుగ్రీవుని చంపి వస్తాను. ఎవడైతే సోమరి తనమును విడిచిపెట్టి ఉపాయములతో శత్రునాశనము చేస్తాడో, వాడికి విజయం దక్కుతుంది. మన దగ్గర కామరూపులైన రాక్షసులు ఎందరో ఉన్నారు. వారిచేత మానవ రూపములు ధరింపజేసి, రాముని వద్దకు పంపుదాము. వారు రామునితో ఇలా అంటారు. “ఓ రామా! మేము భరతుని వద్దనుండి వస్తున్నాము. మమ్ములను భరతుడు పంపాడు. భరతుడు తన సేనలతో తమరికి సాయంగా వస్తున్నాడు." అని అంటారు. అప్పుడు రామలక్ష్మణులు, వానర సేన, భరతుని సైన్యముల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు మనము హటాత్తుగా వారి మీద ఆకాశము నుండి దాడి చేద్దాము. వాళ్ల మీద రాళ్లవాన కురిపిద్దాము. వానర సైన్యమును సర్వనాశనము చేద్దాము. ఆ విధంగా మన వలలో చిక్కిన వానరులను రామలక్ష్మణులను చంపుదాము." అని అన్నాడు.
తరువాత కుంభకర్ణుని కుమారుడు నికుంభుడు అనువాడు లేచి ఇలా అన్నాడు. "మహారాజా! దీనికి ఇంత చర్చ అవసరమా! నన్ను పంపండి చాలు. రామలక్ష్మణులను, సుగ్రీవుని, వానరులను త్రుటిలో చంపి వస్తాను." అని అన్నాడు.
తరువాత వజ్రహనువు అనే రాక్షసుడు లేచి "మీరందరూ హాయిగా మద్యము సేవిస్తూ, మీ మీ ప్రియురాళ్లతో క్రీడించండి. ఆ వానర సైన్యమును నాకు వదిలిపెట్టండి. ఆ వానరులనంతా నేను ఒక్కడినే తినేస్తాను. నరులను వానరులను చంపుతాను." అని అన్నాడు.
తరువాత వజ్రహనువు అనే రాక్షసుడు లేచి "మీరందరూ హాయిగా మద్యము సేవిస్తూ, మీ మీ ప్రియురాళ్లతో క్రీడించండి. ఆ వానర సైన్యమును నాకు వదిలిపెట్టండి. ఆ వానరులనంతా నేను ఒక్కడినే తినేస్తాను. నరులను వానరులను చంపుతాను." అని అన్నాడు.
శ్రీమద్రామాయణము
యుద్దకాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment