శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 62)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
అరువది రెండవ సర్గ
దదిముఖుడు వానరములను అడ్డుకోవడం చూచి అందరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.“హనుమా! మేము ఈ వనములో మధువును సేవించడానికి ప్రయత్నిస్తుంటే ఈ దధిముఖుడు అడ్డుకుంటున్నాడు." అని అన్నారు.
హనుమంతుడు వానరములను చూచి ఇలా అన్నాడు.
“మీరు ఎవరికీ భయపడకండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ మధు వనములో మధువు సేవించండి. మీకు ఎవరైనా అడ్డుచెబితే నేను వాళ్లను అదుపు చేస్తాను." అని అన్నాడు.
ఆ మాటలు విన్న అంగదుడు చాలా సంతోషించాడు. “మీరందరూ ఈ మధువనములో సేకరింపబడిన మధువును తనివిదీరా తాగండి. మన హనుమంతుడు మనము చేయలేని
కార్యమును సాధించుకొని వచ్చాడు. ఈ సంతోష సమయంలో మీరు ఏమి చేసినా ఏమీ అనను. ఇక్కడ మధువును తాగడం మనము చేయకూడని పని అయినా, హనుమంతుడు చెప్పాడు కాబట్టి మనం చేద్దాము." అని అనుజ్ఞ ఇచ్చాడు.
కార్యమును సాధించుకొని వచ్చాడు. ఈ సంతోష సమయంలో మీరు ఏమి చేసినా ఏమీ అనను. ఇక్కడ మధువును తాగడం మనము చేయకూడని పని అయినా, హనుమంతుడు చెప్పాడు కాబట్టి మనం చేద్దాము." అని అనుజ్ఞ ఇచ్చాడు.
ఆ మాటలు విన్న వానరములు అంగదుని అభినందించారు. అందరూ మధువనములో ఉన్న మధువును తాగడానికి ఉద్యమించారు యధేచ్ఛగా మధువును సేవించారు. ఫలములను తిన్నారు. అడ్డం వచ్చిన వనపాలకులను చావ చితకా కొట్టారు. కుండలతో మధువును సేవించారు. అందరూ మత్తులో తూలుతున్నారు. అసలే వానరులు. పైగా మధువు సేవించారు. తాగినంత తాగి మిగిలింది పారబోస్తున్నారు.
కొందరు పాన పాత్రలను చేత బట్టుకొని తాగుతూ మధువును ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నారు. అందరికీ మత్తు బాగా తలకెక్కింది. మత్తులో తూలుతున్నారు. కొందరు చెట్ల కింద పడుకున్నారు. మరికొందరు చెట్ల మొదళ్లలో కూర్చుని మత్తులో జోగుతున్నారు. కొంత మంది ఒకరిని ఒకరు తోసుకుంటూ నడుస్తున్నారు. కొందరు పెద్దగా అరుస్తున్నారు. కొంతమంది ఈలలు వేస్తున్నారు. మరి కొంతమంది అలాగే ఎక్కడ అంటే అక్కడ నేల మీద పడిపోయి జోగుతున్నారు. మరి కొందరు తాము వనపాలకులను ఎలా కొట్టిందీ ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. కొంత మంది మత్తులో ఏమి చేస్తున్నారో తెలియ కుండా వికృతమైన పనులు చేస్తున్నారు.
వానరులు ఇలా మధువనమును ధ్వంసము చేస్తుంటే వానరముల ఆగడాలు భరించలేక వన పాలకులు తలొక దిక్కు పారిపోయారు. ఈ వానరులు వాళ్లను తరిమి పట్టుకొని కొట్టి, ఈడ్చి
మూల మూలలకు తోసేసారు. ఆ వనపాలకులు అందరూ దధిముఖుని వద్దకు పోయి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వానరముల ఆగడములు అన్నీ వివరంగా చెప్పారు. “హనుమంతుని అనుమతితో వానరములు మధువనమును పాడుచేసారు. అడ్డం వెళ్లిన మా అందరినీ తన్నారు. కొట్టారు. నేల మీద పడేసి ఈడ్చారు.” దధిముఖునితో మొరపెట్టుకున్నారు.
అప్పటికే వానరులతో తన్నులు తిన్న దధిముఖుడు వారిని ఓదార్చాడు. ఈ సారి అందరూ మూకుమ్మడిగా పోయి వానరములను అడ్డుకుందాము అని అనుకున్నారు. అందరూ మరలా మధు వనమునకు వెళ్లారు. వారందరూ చేతికి అందిన తాటిచెట్లను, మద్దిచెట్లను, వాటి కొమ్మలను, రాళ్లను పట్టుకొని హనుమంతుడు మొదలగు వానరుల దగ్గరకు వెళ్లారు. (దధిముఖుడు, అతని వనపాలకులు కూడా వానరులే). దధిముఖుడు, వనపాలకులు అందరూ హనుమంతుడు మొదలగు వానరములను చుట్టుముట్టారు. హనుమంతుడు మొదలగు వానరములు దధిముఖుడు మొదలగు వనపాలకులను ఎదిరించడానికి సిద్ధం అయ్యారు. ఆ దధిముఖుడు సుగ్రీవునికి మేనమామ. అయినా లెక్కచెయ్యకుండా అంగదుడు దధిముఖుని తన అరిచేత్తో కొట్టాడు. బాగా మధువు తాగి మత్తులో ఉన్న అంగదుడు దధిముఖుని నేల మీద పడేసి ఈడ్చాడు. అంగదుడు కొట్టిన దెబ్బలకు దధిముఖునికి ఎముకలు అన్నీ విరిగిపోయాయి. శరీరం అంతా రక్తంతో తడసిపోయింది. దధిముఖుడు మూర్ఛపోయాడు. కాని వెంటనే తేరుకున్నాడు. ఇప్పటి దాకా అంగదుడు యువరాజు అని ఉపేక్షించాడు దధిముఖుడు. ఇంక తప్పలేదు. అక్కడి నుండి తప్పించుకొని ఒక రహస్య ప్రదేశమునకు తన వన పాలకులతో వెళ్లాడు. వారితో ఇలా అన్నాడు.
“ఈ వానరులను మనము ఏమీ చేయలేము. వీరిని ఇలాగే ఉండనీ. మనము అందరూ సుగ్రీవుని వద్దకు పోదాము. అంగదుని నాయకత్వములో ఈ వానరములు చేసిన ఆగడములు అన్నీ సుగ్రీవునికి చెపుదాము. అప్పుడు సుగ్రీవుడు కోపించి అందరికీ మరణ దండన విధిస్తాడు. ఎందుకంటే సుగ్రీవునకు ఈ మధువనము అంటే ఎంతో ఇష్టము. ఈ మధువనము సుగ్రీవునికి తన తాత తండ్రుల నుండి సంక్రమించినది. దీనిని ఎవరు పాడు చేసినా సహించలేడు. ఈ మధువనమును పాడు చేస్తున్న వానరులకు ఆయువు మూడింది. సుగ్రీవుని చేతిలో వీరందరికీ మరణ దండన తప్పదు. అప్పుడు మన కోపము చల్లారుతుంది." అని పలికాడు దధిముఖుడు.
తరువాత దదిముఖుడు ఆకాశంలో ఎగురుతూ సుగ్రీవుడు ఉండే చోటికి వెళ్లాడు. అక్కడ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు కూర్చుని ఉన్నారు. దధిముఖుడు వారి ముందు వాలాడు. వారికి నమస్కారము చేసాడు. సుగ్రీవుని పాదాలపై పడ్డాడు. సాష్టాంగ నమస్కారము చేసాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment