శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 61)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

అరువది ఒకటవ సర్గ

పెద్దవాడు అయిన జాంబ వంతుని మాటలు అంగదునికి మిగిలిన వానరులకు బాగా నచ్చాయి. అందరూ జాంబవంతుడు ఎలా చెబితే అలా చేద్దాము అని అన్నారు. అందరూ కిష్కింధకు తిరిగి వెళ్లిపోదాము అని అనుకున్నారు. అందరూ హనుమంతుని ముందుంచుకొని మహేంద్ర పర్వతమును వదిలి పెట్టి ఆకాశంలో ఎగిరిపోయారు. అందరిలోనూ ఒకటే నిశ్చయము. రాముడికి సీత గురించి చెప్పడం, రావణుని చంపడం, సీతను తీసుకురావడం. ఎంత తొందరగా రాముడికి సీత గురించి చెబుదామా అని ఆతురతగా ఉన్నారు.

వారందరూ ఒక ఉద్యానవనమును చేరారు. దానిని సుగ్రీవుని మేనమామ మహా పరాక్రమ వంతుడు అయిన దధిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ వనము అంటే సుగ్రీవునికి ఎంతో ఇష్టం. అటువంటి వనములో మధువు బాగా దొరుకుతుంది. ఆ మధువును తాగాలని వానరులు అందరూ నిశ్చయించుకున్నారు. అందరూ ఆ మధువనములోకి ప్రవేశించారు. అసలే వానరులు. అందులోనూ సీతను చూచిన ఆనందంలో ఉన్నారు. వారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. వానరులు అందరూ ఆ మధువనములోని మధువును తాగడానికి అంగదుని అనుమతి కోరారు. అంగదుడు పెద్దవాడైన జాంబవతుని అనుమతి కోరాడు. వానరుల ఉత్సాహమును చూచి జాంబవంతుడు మధువనములో మధువును తాగడానికి వారికి అనుమతి ఇచ్చాడు. అంగదుడు వానరులకు మధువును తాగడానికి అనుమతి ఇచ్చాడు.

వానరుల సంతోషానికి అంతు లేదు. వానరులు నృత్యం చేసారు. గంతులు వేసారు. ఆడారు. పాడారు. కొందరు నవ్వుతున్నారు. కింద పడుతున్నారు. గెంతుతున్నారు. చెట్లు ఎక్కుతున్నారు. దూకుతున్నారు. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారు. కొట్టుకుంటున్నారు. ఆడుకుంటున్నారు. ఒక చెట్టు మీది నుండి మరొక చెట్టు మీదికి దూకుతున్నారు. ఉరుకుతున్నారు. నేల మీది నుండి మహావృక్షముల మీదికి దూకుతున్నారు. ఒకడు పాడుతుంటే మరొకడు వాడిని చూచి నవ్వుతున్నాడు. ఒకడు నవ్వుతుంటే మరొకడు వాడిని ఏడిపిస్తున్నాడు. వారందరూ అక్కడ ఉన్న మధువును పీకల దాకా తాగారు. వారికి మత్తుబాగా తలకెక్కింది.

వారికి ఏమి చేసినా తృప్తి కలగడం లేదు. ఆ వనమునకు కాపలాగా ఉన్న దధిముఖుడు
వానరములు వనము అంతా పాడుచేయడం చూచి వారిని అడ్డుకున్నాడు. వారి మీద కోపించాడు. వారిని భయపెట్టాడు. మత్తులో ఉన్న ఆ వానరులు ఊరుకోలేదు. ఇంకా రెచ్చిపోయారు. వనం అంతా ధ్వంసం చేస్తున్నారు. ఆ దధిముఖుడు కొంత మందిని తిట్టాడు. మరి కొంత మందిని అదిలించాడు. ఇంకొంత మందిని కొట్టాడు. కొంత మందిని అలా చెయ్యవద్దని బతిమాలాడు.
ఎవరూ అతని మాట వినలేదు. వారి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ దధిముఖుని పట్టుకొని లాగుతున్నారు. కొడుతున్నారు. గోళ్లతో రక్కుతున్నారు. కాళ్లతోనూ చేతులతోనూ తంతున్నారు. మధువనములో ఉన్న పదార్ధములనన్నిటినీ వానరులు చిందరవందర చేసారు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)