శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 56)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది ఆరవ సర్గ

అశోకవనములో శింశుపా వృక్షము కింద క్షేమంగా కూర్చుని ఉన్న సీతను చూచాడు హనుమంతుడు. సీతకు నమస్కరించి “అమ్మా! దైవవశాత్తు నీవు క్షేమంగా ఉన్నావు. నిన్ను ఏ అపాయమూ లేకుండా చూడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక నేను కిష్కింధకు వెళతాను." అని పలికాడు హనుమంతుడు.

సీత మరలా తాను హనుమంతుని చూడగలిగాను అన్న సంతోషంతో ఇలా పలికింది. “రామ కార్యమును సాధించడానికి నీవు ఒక్కడివే సమర్ధుడివి అన్న విషయం ఋజువు అయింది. నీ బలపరాక్రమములు మిక్కిలి ప్రశంసనీయములు. రాముడు ఇక్కడకు వచ్చి నన్ను తీసుకొని వెళితేనే బాగుంటుంది. రాముడు ఆ కార్యము నెరవేర్చుటకు నీవు తగినట్టు సాయము చేయుము." అని పలికింది సీత.

“అమ్మా! సీతాదేవీ! రాముడు వానర సేనలతో వచ్చి, రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్లేరోజు త్వరలోనే రానుంది. నీ శోకము తీరే సమయము ఆసన్నమయింది. ఇంక నేను వెళ్లి వస్తాను.” అని సీతకు నమస్కరించాడు.

అక్కడి నుండి బయలు దేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరమును ఎక్కాడు. తన దేహమును విపరీతంగా పెంచాడు. ఎదురుగా అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూచాడు. ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్కసారిగా తన శరీరాన్ని గాలిలోకి లేపాడు. రెండు చేతులు ముందుకు చాచి పైకి ఎగిరాడు. హనుమంతుడు తన పాదాలను ఆ పర్వతశిఖరము మీద తన్ని పెట్టి పైకి ఎగిరాడు.
హనుమంతుని పాదఘట్టనలకు పర్వతశిఖరము మీద ఉన్న పెద్ద పెద్ద రాళ్లు నుగ్గు నుగ్గు అయ్యాయి. వృక్షములు అటు ఇటా ఊగుతూ కూకటి వేళ్లతో సహా పెకలింపబడ్డాయి. ఆ పర్వతము మీద ఉన్న జంతువులు కకావికలై పరుగులెత్తాయి. ఆ పర్వతము మీద నివసించుచున్న పెద్ద పెద్ద సర్పములు హనుమంతుని పాదఘట్టనలకు జారిన, దొర్లిన రాళ్లు, బండలకింద పడి నలిగిపోయాయి. అంతకన్నా పెద్ద విచిత్రము ఏమంటే హనుమంతుడు ఎక్కిన పర్వతము హనుమంతుని పాదాల తాకిడికి తట్టుకోలేక భూమిలోకి కుంగి పోయింది. నేలమట్టము అయింది. అంతకు ముందు అక్కడ ఒక పెద్ద పర్వతము ఉన్నదా అనే సందేహము కలిగింది. ఆ ప్రకారంగా హనుమంతుడు సముద్రమును లంఘించడానికి పైకి ఎగిరాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)