శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 55)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఏబది ఐదవ సర్గ
తన కళ్లముందు సమూలంగా దహించుకు పోతున్న లంకానగరాన్ని చూచాడు హనుమంతుడు. హనుమంతునికి మనసులో ఒక ఆలోచన దానితో పాటు భయం మెదిలాయి. తనకు జరిగిన అవమానానికి లంకను, లంకలోని ప్రజలను నాశనం చెయ్యడం అవసరమా! రామ కార్యంలో అది భాగం కాదే! మరి తను ఎందుకు లంకను కాల్చినట్టు? తనలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంకానగరము బూడిద కుప్ప అయిపోవాలా! కోపాన్ని అణచుకున్న వాడే బుద్ధికలవాడు. ధన్యుడు. కోపంలో మనిషి ఎంతటి పాపకార్యమైనా చేస్తాడు. ఆఖరుకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపడానికి వెనుకాడడు. కోపావేశంలో నరులు ఎంతటి గొప్పవారినైనా పరుషమైన మాటలతో దూషిస్తారు. కోపం ఎక్కువ అయితే నోటికి ఏం మాట వస్తుందో తెలియదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాగుతారు. కోపంలో ఉన్న వాడికి చేయకూడని పని, అనకూడని మాట, అంటూ లేదు. అన్ని పనులు తగుదునమ్మా అని చేసేస్తాడు.సర్పము తన కుబుసమును విడిచిపెట్టినట్టు, మంచి వారు తమ కోపమును వెంటనే వదిలేస్తారు. ఎదుటి వారు ఏమన్నా ఓర్పుతో సహిస్తారు. ఆ ఓర్పు నాకు లేకుండా పోయింది. రాక్షసులు నా తోకకు నిప్పంటించినంత మాత్రాన నేను లంకను మొత్తం తగులబెట్టాలా! నా వంటి సిగ్గులేని వాడు, దుర్బుద్ధి కలవాడు మరొకడు ఉండడు. నేను నా ప్రభువు రామునికి ద్రోహం చేసాను. ఈ లంకలోనే సీత ఉన్నది అన్న విషయం మరిచి లంకను మొత్తం తగులబెట్టాను. లంక మొత్తం తగులబడి పోయిన తరువాత సీత మాత్రం బతికి ఉంటుందా! ఈ ఒక్క పనితో రామ కార్యము మొత్తం చెడిపోయింది. నా శ్రమ అంతా సర్వనాశనం అయింది. ఎవరి కోసరం నేను నూరు యోజనముల దూరం ఎగిరి వచ్చి నానా కష్టాలు పడి, తుదకు సీతను చూచానో, ఆ సీత నా కోపాగ్నికి ఆహుతి అయిపోయింది. నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. లంక తగులబడేటప్పుడు సీతను రక్షించాలి అన్న బుద్ధికూడా నాకు లేదు. నేను ఎంత
మందమతిని.
మందమతిని.
సీతను చూడ్డంతోనూ, సీత నుంచి చూడామణిని తీసుకోడంతోనూ నేను వచ్చిన కార్యము పూర్తి అయింది. బుద్ధిగా కిష్కింధకు తిరిగి వెళ్లకుండా, అశోకవనమును నాశనం చెయ్యడం ఎందుకు చేసినట్టు? రాక్షసులను చంపడం ఎందుకు? లంకను తగలబెట్టడం ఎందుకు? లంక అంతా పూర్తిగా కాలిపోయింది. ఇందరు మరణించినపుడు సీత మాత్రం ఎందుకు బతికిఉంటుంది. లంకలో సీత లేనపుడు నేను పోయి సీతను చూచాను అని రాముడికి చెప్పడం ఎందుకు? నేను కూడా ఇక్కడే ప్రాణాలు విడుస్తాను. నాకు ఇదే తగిన శిక్ష చావాలంటే ఏం చెయ్యాలి? లంకానగరాన్ని దహిస్తున్న మంటలలో దూకాలా? లేక సముద్రంలో దూకాలా? మొత్తం రామ కార్యమును నాశనం చేసిన తరువాత రామునికి సుగ్రీవునికి నా మొహం ఎలా చూపించాలి? ఏమని చెప్పాలి? నేను రామ కార్యము మీద వచ్చాను అన్న విషయం మరిచి వానరులకు సహజమైన చాపల్యంతో ప్రవర్తించాను. ఎప్పుడూ సత్త్వగుణంతో ఉండే నేను ఇలా రాజస గుణంతో ఎందుకు ప్రవర్తించాను. రాజసము మనసును అదుపులో ఉండనీయదు. చపలత్వమును కలుగజేస్తుంది. ఈ రాజస ప్రవృత్తి వల్లనే లంకను తగులపెట్టాను. కనీసం లంక తగల బటేటప్పుడన్నా సీతను రక్షించాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఇదంతా ఈ రాజస ప్రవృత్తి ప్రభావం కదా!
సీత ఈ లోకంలో లేది అని తెలిస్తే రాముడు మరణిస్తాడు. రాముడు లేనిదే లక్ష్మణుడు ప్రాణాలతో ఉండడు. వీరి మరణం చూచి సుగ్రీవుడుకూడా ప్రాణత్యాగము చేస్తాడు. ఈ వార్త విన్న భరత శత్రుఘ్నులు కూడా ఆ బాధను తట్టుకోలేక చనిపోతారు. రాజులేని అయోధ్య కిష్కింధ అనాధలవుతాయి. ఇంత వినాశనమునకు నేను కారణము. కేవలం నా లో ఉన్న కోపము, రోషము నా చేత ఇంతపని చేయించింది." అని శోకిస్తున్నాడు హనుమంతుడు.
ఇంతలో హనుమంతుని మనస్సులో ఒక ఊహ మెదిలింది. " నా పిచ్చి గానీ, సీత అయోనిజ. ఆమె అగ్ని స్వరూపము. అగ్నిని అగ్ని కాల్చగలదా? రాముని భార్య, మహా పతివ్రత అయిన సీతను కాల్చే ధైర్యము అగ్నికి ఉంటుందా! నా తోకకు అంటుకున్న అగ్ని నన్నే కాల్చలేదంటే అది అంతా రాముని ప్రభావము, సీత పాతివ్రత్య మహాత్మ్యము. నన్ను కాదు కదా, కనీసం నా తోకనే కాల్చలేని అగ్ని సీతను కాలుస్తుందా. మహాతపస్వి, సత్యవ్రతమును, పాతివ్రత్యమును పాటించు సీతను అగ్ని కాల్చలేదు. ఇది సత్యం."అని తనలో తాను ఊరట చెందుతున్నాడు హనుమంతుడు.
ఇంతలో ఈ లంకా దహనము కార్యక్రమమును పైనుండి చూస్తున్న చారణులు ఈ విధంగా అనుకోవడం హనుమంతుని చెవిని పడింది. "హనుమంతుని చేత దహింపబడిన లంక సర్వనాశనము అయింది కానీ సీత మాత్రం క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ!" అని తమలో తాము అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న హనుమంతుని మనస్సు ఊరట చెందింది. వెంటనే సీతను చూడ టానికి అశోకవనమునకు వెళ్లాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment