శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 54)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది నాలుగవ సర్గ

తన తోకకు నిప్పంటించి లంకా పట్టణము అంతా ఊరేగించి సంతోషించారు రాక్షసులు. మరి తను ఏమి చేస్తే వారు దు:ఖిస్తారో అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు. ఇప్పటి దాకా అశోక వనమును నాశనం చేసాడు. రాక్షసులను చంపాడు. చాలా భాగం రావణ సైన్యాన్ని నాశనం చేసాడు. సైన్యాధిపతులను, మంత్రి కుమారులను చంపాడు. దానికి ప్రతీకారంగా రాక్షసులు తన తోకకు నిప్పంటించారు కాబట్టి తాను కూడా లంకకు నిప్పంటిస్తే దెబ్బకు దెబ సరిపోతుంది కదా అని అనుకున్నాడు. అదీ కాకుండా తాను ఇప్పుడు లంకను నాశనం చేస్తే తరువాత రాముని పని సులభం అవుతుంది కదా అని ఆలోచించాడు హనుమంతుడు. అగ్ని దేవునికి నా తోకను కాల్చడంతో తృప్తి చెందినట్టు లేదు. ఈ లంకా నగరమును దహించి అగ్నిదేవునికి సంతర్పణ చేస్తే అగ్ని దేవుడు తృప్తి పడతాడు అని అనుకున్నాడు హనుమంతుడు.

అనుకోవడమే ఆలస్యం హనుమంతుడు లంకా నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల మీదికి ఉరికాడు. ఒక్కొక్క భవనానికి నిప్పు అంటించడం మొదలెట్టాడు. ఒక భవనం మీది నుండి మరొక భవనం మీదికి దూకుతూ అన్ని భవనములకు నిప్పంటిస్తున్నాడు. హనుమంతుడు దేనినీ వదిలిపెట్టలేదు. చిన్న, పెద్ద భవనములను అన్నిటినీ తగులబెట్టాడు. ఉద్యానవనములను అందులో భవనములను కూడా కాల్చాడు. దారిలో రావణుని మంత్రి ప్రహస్తుని గృహము కనపడింది. పనిలో పనిగా దానికి కూడా నిప్పు అంటించాడు. ఆ గృహము మీది నుండి మహాపార్శ్వుడి గృహము మీదికి దుమికాడు. దానికి కూడా నిప్పుపెట్టాడు. పక్కపక్కనే ఉన్న వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణుడు మొదలగు వారి గృహములకుకూడా నిప్పంటించాడు.

తరువాత హనుమంతుడు ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి గృహములను కూడా దహించాడు.
హనుమంతుడు ఒక్క విభీషణుని గృహమును మాత్రము వదిలిపెట్టాడు. మిగిలిన గృహములను అన్నిటినీ పరశురామ ప్రీతి చేసాడు. ఒకదాని నుండి మరొక దానికి అగ్ని పాకిపోతూ ఉంది. లంకానగరము అంతా తగలబడి పోతూ ఉంది. అందులో రశ్మికేతువు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, ధ్రంష్టుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, మొదలగు రాక్షసుల భవనములు అన్నిటినీ ఒక్కటీ వదలకుండా కాల్చాడు హనుమంతుడు. పొరపాటున ఏ ఒక్క భవనమునకు నిప్పు అంటుకోకున్నా, పనికట్టుకొని పోయి ఆ భవనమును కూడా కాల్చి వచ్చాడు హనుమంతుడు.

ఒక్క రాక్షస ప్రముఖుల గృహములే కాదు, లంకలో ఉన్న పురప్రముఖుల ఇండ్లు కూడా తగలబెట్టాడు హనుమంతుడు. లంకలో ఉన్న సంపన్నులగృహములలో ఉన్న సకల సంపదలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆఖరున హనుమంతుడు రావణుని గృహము చేరుకున్నాడు. అది ఒక్కటే మిగిలి ఉంది. హనుమంతుడు రత్నశోభితమైన రావణుని గృహమునకు కూడా నిప్పంటించాడు. అగ్నికి వాయువు కూడా తోడవడం వల్ల రావణుని గృహమును దహించు అగ్నికీలలు నలుదిక్కులకు తీవ్రంగా, అతి వేగంగా వ్యాపించాయి. రావణుని గృహముతో సహా లంక అంతా తగులబడి పోతూ ఉంది. హనుమంతుడు కొన్ని గృహములకు నిప్పంటిస్తే, గాలి బలంగా వీచడం వల్ల ఆ అగ్ని మిగిలిన గృహములకు కూడా వ్యాపించింది. ఛటఛటధ్వనులతో ఆ గృహములు కాలిపోతున్నాయి. ఎత్తైన భవనములు నిలువునా కూలిపోతున్నాయి. ఆ భవనముల నుండి వ్యాపించిన మంటలలో ఎగురుతున్న ద్వారములు, కిటికీలు దూరంగా పడుతున్నాయి. అవి పడ్డచోట కూడా మంటలు వ్యాపిస్తున్నాయి.

లంకానగర వాసులు తమ తమ విలువైన వస్తువులు కాపాడుకోడంలో సతమతమవుతున్నారు. అటుఇటు పరుగెడుతున్నారు. “ఈ వానరము ఎక్కడనుండో వచ్చి అగ్నిదేవుడి రూపంలో మన లంకను తగులబెట్టింది కదా! " అని వాపోతున్నారు. బిగ్గరగా ఏడుస్తున్నారు. తలలు బాదుకుంటున్నారు. కొందరు స్త్రీలు చంటి బిడ్డలను కాపాడుకుంటూ అటు ఇటు పరుగులెడుతున్నారు. కొందరు మేడల మీదినుండి కిందికి దుముకుతున్నారు. కాలి పోయిన
భవనముల నుండి ఆ భవనములకు పొదిగిన మణులు, బంగారము, కరిగి కారిపోతూ ఉంది. అలా లంకానగరమును దహిస్తూ హనుమంతుడు అపర రుద్రుని వలె ప్రకాశించాడు.

హనుమంతుడు అంటించిన అగ్ని పెద్ద పెట్టున లంకను దహిస్తూ, ఆ అగ్ని జ్వాలలు పైపైకి ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ అగ్ని జ్వాలలో పడి కాలిపోతున్న రాక్షసులు దేహముల నుండి స్రవించు ద్రవములు ఆజ్యము మాదిరి మంటలను ప్రజ్వరిల్లజేస్తున్నాయి. భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న ఛటఛటధ్వనులు పిడుగులు పడ్డట్టు ధ్వనిస్తున్నాయి. “వీడు సామాన్యవానరుడు కాడు. రావణుని మీద పగ తీర్చుకోడానికి వచ్చిన కుబేరుడో, యముడో, దేవేంద్రుడో, రుద్రుడో, సూర్యుడో, లేక సాక్షాత్తు కాలపురుషుడో అయి ఉంటాడు. లేకపోతే ఇంత విధ్వంసము ఎందుకు సృష్టిస్తాడు" అని పరి పరి విధములుగా అనుకుంటున్నారు లంకలో ఉన్న రాక్షసులు. 

మరి కొందరైతే “రావణునికి వరములు ఇచ్చిన బ్రహ్మదేవుడే రాక్షస సంహారమునకు ఈ వానర రూపంలో వచ్చాడా!" అని అనుకొన్నారు. 

“కాదు కాదు. ఇది విష్ణు తేజము. వానర రూపంలో వచ్చి లంకను నాశనం చేసింది. రాక్షసుల మీద పగ తీర్చుకొంది." అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

లంకానగరము అంతా దైన్యముతో శోకిస్తూ ఉంది. భయంతో వణికిపోతూ ఉంది. కొంత మంది తమ కుమారులను, కుమార్తెలను వెదుక్కుంటూ ఏడుస్తుంటే మరి కొందరు తమ తమ సోదరులను, బంధువులను, తల్లి తండ్రులను, మిత్రులను వెతుక్కుంటూ వారు కనపడకపోతే గుండెలు పగిలేట్టు ఏడుస్తున్నారు. అగ్నికి ఆహుతి అయిన లంకా నగరము ఎవరో ఒక మహాపురుషుని శాపము తగిలి నాశనం అయినట్టు కనపడుతూ ఉంది. హనుమంతుడు త్రికూట పర్వతము మీద నిలబడి తాను చేసిన నిర్వాహకమును పరిశీలిస్తున్నాడు. హనుమంతుని తోక ఇంకా మంటలు విరజిమ్ముతూనే ఉంది. హనుమంతునిచే దహింపబడిన లంకానగరమును చూచి దేవతలు, అసురులు, గంధర్వులు సంతోషించారు. తమ శత్రువుకు తగిన శాస్తి జరిగిందని
సంబరపడ్డారు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)