శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 53)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది మూడవ సర్గ

రావణుడు తనలో చెలరేగుతున్న కోపం,రోషం,కసిని కొంచెం తగ్గించుకున్నాడు. విభీషణుని మాటలు సావధానంగా విన్నాడు. కోపంలో తాను ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడో అర్ధం చేసుకున్నాడు.

“విభీషణా! నీవు చెప్పినది ధర్మయుక్తంగా సమంజసంగా ఉంది. దూతగా వచ్చిన వాడిని చంపడం పాపము. కానీ వీడిని వదల కూడదు. తీవ్రంగా దండించాలి. ఇతను చేసిన అపరాథములకు తగిన దండన విధించాలి. ఇతను వానరుడు. వానరులకు తోక అలంకారము. ఆ తోకను కత్తిరిస్తే వికలాంగుడు అవుతాడు. ఇతని తోకకు నిప్పు అంటించి కాల్చండి. కాలి పోయిన తోకతో ఇతనిని తరిమెయ్యండి. లంకకు వచ్చి తోక పోగొట్టుకున్న ఇతనిని ఇతని బంధువులు, మిత్రులు అవహేళన చేస్తారు. ఆ దండన చాలు. లంకలో ఉన్న వారందరికీ తెలిసే లాగ మీరు ఈ వానరం తోకకు నిప్పు అంటించి, వీధులలో ఊరేగించండి. లంక వాసులు అందరూ ఇతనిని చూచి
నవ్వుకోవాలి." అని అన్నాడు రావణుడు.

వెంటనే రాక్షసులు పాత వస్త్రములు తీసుకొని వచ్చారు. హనుమంతుని తోకకు చుట్టారు. హనుమంతుడు వాళ్లవంక అదోరకంగా చూస్తున్నాడు. హనుమంతుని తోకకు పూర్తిగా వస్త్రములు చుట్టిన తరువాత, నూనె పోసారు. హనుమంతుని తోక పూర్తిగా నూనెతోతడిసి పోయింది. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించారు. హనుమంతుని తోక మొత్తం నిప్పంటుకుంది. దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. రాక్షసులు హనుమంతుని వీధుల వెంట తిప్పుతున్నారు.
తోకకు నిప్పంటుకున్న హనుమంతుని చూడడానికి లంకలో ఉన్న బాలురు, వృద్ధులు, స్త్రీలు బారులు తీర్చి మార్గమునకు ఇరువైపులా నిలబడ్డారు. హనుమంతునికి పట్టరాని కోపం వచ్చింది. తన చుట్టు ఉన్న రాక్షసుల నందరినీ కింద పడేసాడు. రాక్షసులు ఊరుకోలేదు. మరలా హనుమంతుని మీద పడి బంధించారు. హనుమంతుడు ఇలా ఆలోచించాడు.

"వీరి నందరినీ చంపడం పెద్ద సమస్య కాదు. వీరుకట్టిన కట్లు నన్ను ఆపలేవు. నేను ఈ కట్లు తెంచుకొని, ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరి వీళ్ల మీదికి దూకి చంపగలను. నేను ఎలాగైతే రాముని ఆజ్ఞమేరకు ప్రవర్తిస్తున్నానో, వీళ్లు కూడా రావణుని ఆజ్ఞమేరకు ఇదంతా చేస్తున్నారు. వీళ్లదేం తప్పులేదు. వీళ్లు చేస్తున్న దానికి నేను చింతించవలసిన పని లేదు. వీళ్లు నన్ను లంక అంతా తిప్పేట్టు ఉన్నారు. మొన్న రాత్రిపూట లంక అంతా తిరిగాను. లంకలో ఉన్న భవనముల సౌందర్యమును సరిగా చూడలేదు. ఈ వంకతోనైనా మరలా ఒకసారి లంక అంతా ఒకసారి చూస్తాను. తరువాత నేను చేసేది ఏదో నేను చేస్తాను. ఈ కాసేపు ఈ బంధనాలను, ఈ అగ్నిని సహించాలి తప్పదు.” అని అనుకున్నాడు హనుమంతుడు. కాని తన మనసులో భావాలను బయటకు తెలియనీయకుండా వారిని కోపంతో చూస్తున్నాడు.

వారు కూడా హనుమంతుడు తమకు పట్టుబడ్డాడు అని సంతోషిస్తూ, మరలా హనుమంతుని తోకకు గుడ్డలు చుట్టి నిప్పు అంటించారు. ముందు భేరీలు, శంఖములు మోగించుకుంటూ హనుమంతుని లంక అంతా ఊరేగిస్తున్నారు. లంకలో ఉన్నవారు హనుమంతుని వింతగా చూస్తున్నారు, అశోక వనము నాశనం చేసిన వాడికి తగిన శాస్తి జరిగిందని ఆనందిస్తున్నారు. హనుమంతుడు కూడా బుద్ధిమంతుడి మాదిరి వాళ్ల వెంట లంక అంతా తిరుగుతున్నాడు. హనుమంతుడు లంక అంతా తిరుగుతూ, గొప్ప గొప్ప భవనములను, భూగృహములను, ఎత్తైన విమానములను, విశాలమైన వీధులను, ఇరుకుగా ఉన్న సందులను, గొందులను, పెద్దపెద్ద రాజమార్గములను, చిన్న చిన్న మార్గములను, చిన్న చిన్న ఇళ్లను పెద్ద పెద్ద భవంతులను ఆసక్తిగా చూచాడు.

రాక్షసులు నాలుగు మార్గముల కూడలిలో హనుమంతుని నిలబెట్టి “ఇతను ఒక శత్రుగూఢచారి. రావణుడు ఇతనికి దండన విధించాడు. ఇతని తోకకు గుడ్డటు చుట్టి, నూనె పోసి నిప్పంటించ బడింది. ఇతని తోక ఎలా కాలుతూ ఉందో చూడండి" అని పెద్దగా అరుస్తూ తెలియజేస్తున్నారు.

రాక్షసులు అరుస్తున్న అరుపులు సీత చెవిన కూడా పడ్డాయి. సీత మనస్సు క్షోభించింది. తన వలన హనుమంతునికి ఇన్ని కష్టాలు వచ్చాయి కదా అని ఆమె మనసు ఆందోళన చెందింది. తాను ఉపాశించే అగ్నిని మనసులోనే ఆవాహన చేసుకుంది. చిన్న చిన్న పుల్లలను సేకరించి అగ్నిని వేల్చింది. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హనుమంతుని క్షేమం కోరుతూ సీత నిర్మలమైన మనస్సుతో అగ్నిని ప్రార్థించింది.

“ఓ అగ్నిదేవా! నీకు నమస్కారము. నేను త్రికరణ శుద్ధిగా నా పతికి అనునిత్యమూ సేవ చేసిన దానను అయితే, నేను పతివ్రతను అయితే, నేను ఏమైనా తపస్సు చేసి ఉంటే, వాటి మహిమ వలన హనుమంతునికి నీ వేడి సోకనీయకు. హనుమంతుని చల్లగా కరుణించు. త్రిలోక పూజ్యుడు దయామయుడు అయిన రామునకు నా మీద కరుణ దయ ఉంటే, హనుమంతుని తోకకు అంటించిన అగ్ని చల్లగా తగులుతుంది. నేను సత్ప్రవర్తనతో నా రాముని చూడడానికి కలవడానికి ఉత్సాహపడుతున్నాను అని రాముడు విశ్వసిస్తే, హనుమంతుని దేహమునకు సోకిన అగ్ని అతనిని కాల్చకుండుగాక! ఓ అగ్నీ! నీవు హనుమంతునికి ఏ హానీ చెయ్యకు. " అని మనస్ఫూర్తిగా
వేడుకుంది.

అగ్నిదేవుడు సీత చేసిన ప్రార్ధనను మన్నించాడు అన్న విషయం తెలుపడానికే అన్నట్టు సీత వేల్చిన అగ్ని జ్వాలలు సీతతో పాటు ఆమెను తాకుతున్నట్టు ప్రదక్షిన పూర్వకంగా తిరిగాయి. హనుమంతుని తండ్రి వాయుదేవుడు కూడా, తన కుమారునికి ఏ హానీ జరగకుండా అగ్నికి తోడైనాడు. చల్లగా వీస్తున్నాడు. అక్కడ హనుమంతునికి తోక భగభగ మండుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు.

“ఏమిటి ఇది! నా తోక ఇలా కాలుతున్నా నాకు అగ్ని సెగ కూడా తగలడం లేదు! ఇది ఏమి విచిత్రము. అగ్ని జ్వాలలు మాత్రము భయంకరంగా ప్రజ్వరిల్లుతున్నాయి. కాని నా తోక మీద మంచు ముద్దలుపెట్టినట్టు చల్లగా ఉంది. నేను సముద్రమును దాటుతున్నప్పుడు రాముని మీద ఉన్న గౌరవం వలన సముద్రుడు, మైనాకుడు నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు కదా! ఇప్పుడు అగ్ని కూడా రాముని మీద ఉన్న గౌరవంతో నాకు సాయం చేస్తున్నాడేమో! అందుకే నాకు అగ్ని వలన పుట్టే వేడి సోకడం లేదు. అంతే కాదు, సీతాదేవి పాతివ్రత్య మహిమ వలననూ, రాముని తేజస్సుచేతనూ, నా తండ్రి వాయుదేవునితో అగ్నికి ఉన్న స్నేహము చేతనూ, అగ్ని నన్ను చల్లగా చూస్తున్నాడు. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చెయ్యవచ్చు." అని మనసులో అనుకున్నాడు.

అప్పటికి హనుమంతుని ఊరేగింపు నగర ద్వారము వద్దకు చేరుకుంది. అనుకున్నదే తడవుగా హనుమంతుడు ఆ రాక్షసుల మధ్యలో నుండి పైకి ఎగిరాడు. పెద్దగా అరిచాడు. నగర ద్వారము ఎక్కి కూర్చున్నాడు. ఒక్కసారిగా చిన్నవాడుగా మారాడు. అప్పుడు హనుమంతునికి కట్లు అన్నీ వదులు అయ్యాయి. వాటిని విదిల్చుకున్నాడు. మరలా తన శరీరమును పెంచాడు. నగర ద్వారమునకు అమర్చిన పరిఘను ఊడపీకాడు. దానిని చేతిలో పట్టుకొని రాక్షసుల మధ్యకు దూకాడు. ఆ పరిఘతో వాళ్లను చితకబాదాడు. మండుతున్న తోకతో హనుమంతుడు మరలా లంక
వైపుకు వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)