శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 52)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది రెండవ సర్గ

ముల్లోకములలో తనకు ఎదురు లేదు అన్న అహంకారం రావణునికి నరనరాల్లో పాకిపోయింది. అందుకని హనుమంతుడు చెప్పిన మాటలు రుచించలేదు. కనీసం వాటి గురించి ఆలోచించడానికి కూడా అతని మనసు ఒప్పుకోలేదు. పైగా రావణుని కోపం హద్దులు దాటింది.
రావణుని నోటి నుండి ఒకే మాట వెలువడింది. “ఈ వానరాన్ని చంపండి." అని ఆదేశించాడు.

రావణుని తమ్ముడు విభీషణుడు. ధర్మం తెలిసిన వాడు. రావణునికి కోపం వచ్చిందని, ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియడం లేదని అనుకున్నాడు. దూతను చంపడం ధర్మవిరుద్ధమని రావణునికి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచించాడు. రావణునితో ఇలా అన్నాడు.

"ఓ రాక్షస రాజా! నన్ను క్షమించు. నీ కోపము, రోషము విడిచిపెట్టు. నేను చెప్పే మాట విను. ఇతడు సుగ్రీవుడు పంపగా వచ్చిన దూత. దూతగా తన కర్తవ్యమును నిర్వర్తించాడు. ధర్మం తెలిసిన రాజులు దూతను చంపరు. అది ధర్మవిరుద్ధము. 

ఓ రాజా! నీకు తెలియని ధర్మము లేదు. నీకు సకల ధర్మములు తెలియును. ధర్మము తెలిసిన నీవు ఈ పని చేయకూడదు.

ఓరాజా! నీవు శాస్త్రములు చదువుకున్నావు. అందులో విషయములను ఆకళింపు చేసుకున్నావు. అన్నీ తెలిసిన నీవే కోపంలో ఇలా చేస్తే, ఇంక శాస్త్రములు చదివిన దానికి ఫలితం ఏముంటుంది, కేవలం శ్రమ తప్ప. నీవు శత్రువులను చంపవచ్చు. కానీ ఇతను నీకు శత్రువుకాడు. కేవలం దూత. ఇతను ఏమైనా తప్పుచేసి ఉంటే తగిన దండన విధించు. అంతేకాని చంపడం ఉచితం కాదు." అని అనునయంగా చెప్పాడు విభీషణుడు.

కానీ రావణుని కోపం చల్లారలేదు. కోపంతో ఇలా అన్నాడు. "విభీషణా! వీడు పాపం చేసాడు. పాపాత్ములకు సరైన శిక్ష మరణ దండన. వీడిని చంపినందువల్ల పాపం రాదు. అధర్మం అంతకంటే కాదు. కాబట్టి వీడిని వధిస్తాను." అని తన నిశ్చయాన్ని ప్రకటించాడు.

అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు. “ఓ రాజా! మరలా చెబుతున్నాను. సావధానంగా విను. ఏ కాలంలో కూడా, ఏరాజ్యంలో కూడా, సత్పురుషులు అయిన రాజులు తమ వద్దకు వచ్చిన దూతలను వధించరు. ఈ వానరుడు దూతగా వచ్చాడు. కానీ కొంచెం మితిమీరి ప్రవర్తించాడు. దానికి సరి అయిన దండన విధించు.

తప్పుచేసిన దూతలకు విధించవలసిన దండనలు చాలా ఉన్నాయి. వికలాంగుడిగా చెయ్యడం, కొరడాలతో కొట్టించడం, తల గొరిగించడం, చేసిన తప్పుకు గుర్తుగా ఒంటి మీద వాతలు పెట్టడం, ఇటువంటి దండనలు విధించవచ్చును. కానీ దూతలను చంపడం మనం ఎక్కడా వినలేదు.
నీవు రాక్షస రాజువు. ధర్మము బాగా తెలిసిన వాడవు. కానీ కోపానికి వశుడైనావు. ఆ కోపంలో అధర్మానికి పాల్పడుతున్నావు. నీవంటి బుద్ధి మంతులు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కదా! ధర్మాధర్మ విచక్షణలో కానీ, లోకాచారములను పాటించడంలో కానీ, శాస్త్రవిషయములను చర్చించడంలో కానీ, ఇతరుల మనోవృత్తులను అర్థంచేసుకోడంలో కానీ, నిన్ను మించిన వాడు దేవతలలో గానీ, అసురులలో గానీ లేడు.

ఓ రాజా! నీవు అజేయుడవు. దేవతలను అసురులను ఎన్నోమార్లు జయించావు. అటువంటి వాడికి ఈ వానరము ఒక లెక్కా! అసలు ఈ వానరమును కాదు చంపవలసినది. ఈ వానరమును నీ
వద్దకు పంపిన వారిని చంపాలి. వాళ్లు చేసిన తప్పుకు వాళ్లు పంపగా వచ్చిన దూతను చంపడం ధర్మవిరుద్ధము కదా!

ఓ రాజా! దూత మంచి వాడే కావచ్చు, చెడ్డ వాడే కావచ్చు. కాని అతడు ఇతరులు పంపగా వచ్చినవాడే కానీ, తనకు తానుగా నీవద్దకు రాలేదు కదా! దూతలకు తాము అనుకున్న విధంగా చెప్పడానికి స్వతంతము లేదు కదా! కేవలము తనను పంపిన వారు చెప్పమన్న మాటలు చెప్పిన ఈ దూతను చంపడం ధర్మం కాదు కదా! ఈ దూత నీ ప్రతాపమును చవిచూడ తగిన వాడు కాదు. నీ ప్రతాపము ఇంద్రుని మీద, దేవతల మీద, ఈ దూతను పంపిన వారి మీద చూపించు. వీడిని తగిన విధంగా దండించి వదిలిపెట్టు.

మరొక మాట! ఇప్పుడు నీవు వీడిని చంపితే, వీడు ఏమయ్యాడో అని వీడిని పంపిన వారికి తెలియదు. అప్పుడు వాళ్లు ఇక్కడకు వచ్చే అవకాశము లేదు. నీవు వాళ్లను చంపే అవకాశము లేదు. అందుకని వీడిని వదిలిపెడితే వీడు పోయి, వీడిని ఎవరైతే నీ వద్దకు పంపారో, వాళ్లను తీసుకొని వస్తాడు. అప్పుడు నీవు వారినందరినీ చంపవచ్చు.

ఓ రాక్షసరాజా! నీవు అజేయుడవు. నిన్ను యుద్ధంలో ఓడించగల వాడు ముల్లోకములలో లేడు. అటువంటప్పుడు, వీడిని చంపడం కన్నా, వీడిని పంపిన వాళ్లతో యుద్ధం చేసి ఓడించి చంపడం వీరత్వము కదా! అదే నీ వంటి వీరుడు చేయదగిన పని. కాబట్టి వీడిని వదిలిపెట్టి, వీడిని పంపిన వారు ఇక్కడకు రావడానికి మార్గము సుగమం చెయ్యి. నీ దగ్గర ఎంతో మంది రాక్షస వీరులు ఉన్నారు. వారిలో కొంత మందిని యుద్ధానికి పంపి ఆ రాజకుమారులను సంహరించు. వీడిని వదిలిపెట్టు." అని రావణునికి ప్రియం చేకూర్చేట్టు పలికాడు విభీషణుడు. విభీషణుని మాటలు రావణునికి నచ్చాయి.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)