శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 51)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఏబది ఒకటవ సర్గ
హనుమంతుడు రావణుని ఎదురుగా నిలబడి, రావణుని చూచి ఏ మాత్రమూ భయపడకుండా ఈ విధంగా పలికాడు. "ఓ రాక్షసేంద్రా! నేను కిష్కింధను పాలించే సుగ్రీవుని వద్దనుండి వచ్చాను. నేను ఆయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు నీ క్షేమములు కనుక్కోమన్నాడు. సుగ్రీవుడు నీకు ఒక సందేశము పంపాడు. దానిని సావధానంగా విను.ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు ఉన్నాడు. అతని పెద్ద కుమారుడు రాముడు. రాముడు తన తండ్రి దశరథుని ఆదేశము మేరకు తన భార్య సీతతోనూ, తమ్ముడు లక్ష్మణుని తోనూ దండకారణ్యమునకు వచ్చి వనవాసము చేస్తున్నాడు. రాముని భార్య సీత, విదేహ రాజపుత్రి. భర్తను అనుసరించి వనవాసమునకు వచ్చింది. కాని ఒక రోజు సీత అరణ్యములో కనపడకుండా
పోయింది. తన భార్య సీతను వెదుక్కుంటూ రాముడు, రాముని తమ్ముడు లక్ష్మణుడు ఋష్యమూక పర్వతము వద్దకు వచ్చారు. వారు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నారు. సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు, సుగ్రీవుడు కోల్పోయిన రాజ్యము తిరిగి అతనికి ఇప్పిస్తానని రాముడు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. తదుపరి రాముడు వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజ్యాభిషిక్తుని చేసాడు. వాలి గురించి నీకు నేను వేరుగా చెప్ప పని లేదు. అటువంటి వాలిని ఒకే ఒక్క బాణంతో రాముడు చంపాడు.
సుగ్రీవుడు కూడా తాను చేసిన ప్రతిజ్ఞలో భాగంగా సీతను వెదకడానికి వానరులను నలుదిక్కులకూ పంపాడు. దక్షిణ దిశగా పంపిన వారిలో నేను ఒకడిని. నా పేరు హనుమంతుడు. నేను వాయుదేవుని కుమారుడను. నేను సీత కోసరము నూరు యోజనముల సముద్రమును దాటి లంకకు వచ్చాను. సీత లంకలో ఉన్నదని కనుక్కున్నాను. నీవే సీతను అపహరించావు అని తెలిసింది.
ఓ లంకేశ్వరా! నీవు ధర్మాధర్మములను తెలిసినవాడవు. గొప్ప తపస్సంపన్నుడవు. ఇతరుల భార్యలను నీ ఇంటిలో ఉంచుకోవడం ధర్మం కాదు. నీ వంటి ధర్మాత్ములు, బుద్ధిమంతులు ఇటువంటి అధర్మమైన పనులుచేస్తారా! తన భార్యను తీసుకు వెళితే రామునికి కోపం రాదా! రాముని, అతని తమ్ముడు లక్ష్మణుని బాణములను ఎదుర్కొనడం ఇతరులకు సాధ్యమా! రామునికి కీడు చేసి ఈ ముల్లోకములలో ఎవడూ బతకలేడు! అందుకని నా మాట విను. సీతను రాముని వద్దకు పంపు. నీవు సుఖంగా ఉండు. నేను అశోకవనములో ఉన్న సీతను చూచాను. సీతమ్మ దర్శనం నాకు లభించింది. నేను వెళ్లి సీత లంకలో ఉన్న అశోకవనములో ఉన్నదని రామునికి చెబుతాను. తరువాత కధ రాముడే చూచుకుంటాడు.
ఓ రావణా! సీత మీద చెయ్యివేసి చాలా పొరపాటు చేసావు. రాబోయే ప్రమాదాన్ని గుర్తింలేకపోతున్నావు. దానికి ఫలితం అనుభవిస్తావు. సీతను నీ వద్ద ఉంచుకోవడం విషము కలిపిన అన్నము తినడం లాంటిది. తిని బతకడం కష్టం కదా! నీవు ఎంతో తపస్సు చేసి, అనంత ఐశ్వర్యాన్ని, దీర్ఘమైన ఆయుస్సు పొంది ఉన్నావు. దానిని నీ అధర్మ ప్రవర్తనతో నాశనం చేసుకోకు! నీవు తపస్సు చేసి దేవతల చేత, అసురుల చేతిలో మరణం లేకుండా వరం పొందాను అని అనుకుంటున్నావు. అది సరి కాదు. సుగ్రీవుడు దేవత కానీ, అసురుడు కానీ, గంధర్వుడు కానీ, యక్షుడు కానీ కాదు. కేవలం వానరుడు. నీవు నరుల చేతిలో కానీ, వానరుల చేతిలో చావు లేదని వరం కోరలేదు. మరి సుగ్రీవుని నుండి నీ ప్రాణాలు ఎలా రక్షించుకుంటావో
ఆలోచించు!
ఆలోచించు!
ఓ లంకేశ్వరా! నీవు ఆర్జించిన పుణ్యఫలము అనుభవించడం పూర్తి అయింది. ఇంక నీ పాపఫలము అనుభవంలోకి రానుంది. దానిని అనుభవించక తప్పదు.
ఓ రావణా! నీవు చేసిన పుణ్యం కొంచెమే. పాపం ఎక్కువ. నీ పుణ్యఫలానుభం పూర్తి అయింది. ఇంక నీ పాపాల ఫలితాలను అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మరొక్కమాట! జనస్థానములో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో రాముడు చంపడం గుర్తుకు తెచ్చుకో. మహా బలశాలి అయిన వాలిని రాముడు ఒకేఒక బాణంతో చంపడం మరిచిపోకు! సుగ్రీవుడు, రాముడు ఒకరికొకరు సాయం చేసుకోడానికి ప్రతిజ్ఞలు చేసుకున్నారు అని గుర్తుపెట్టుకో! తరువాత నీకు ఏది మంచిదో అది చెయ్యి.
ఇంక నా సంగతి. నేను లంకలో ఏమేమి చేసానో నీకు తెలుసు. జంబుమాలి, ఐదుగురు సేనాపతులు, ఏడుగురు మంత్రి పుత్రులు నాచేతిలో మరణించారు. ఇంక సైన్యం సంగతి చెప్పనక్కరలేదు. నేను తలచుకుంటే ఈ క్షణమే లంకను నాశనం చెయ్యగలను. కానీ, రాముడు నాకు ఆ పని అప్పగించలేదు. కాబట్టి చెయ్యను. ఎందుకంటే రాముడు అందరి ముందరా శత్రువులను నాశనం చేసి, సీతను తీసుకొని వస్తాను అని ప్రతిజ్ఞచేసాడు. రాముని ప్రతిజ్ఞను భంగం చేయడం నాకు ఇష్టం లేదు.
రామునితో విరోధము పెట్టుకొని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖంగా ఉండలేడు. ఇంక నీ సంగతి చెప్పాల్సిన పనిలేదు. నీవు సీతను సామాన్య స్త్రీ అనుకుంటున్నావు. కాలసర్పమును తెచ్చి లంకలో పెట్టుకున్నావు అని మర్చిపోతున్నావు. సీత రూపంలో ఉన్న కాలపాశమును నీ మెడలో తగిలించుకోకు. నీ మంత్రులతో ఆలోచించి ఏది మంచిదో అది చెయ్యి. నీవు నీ మొండి పట్టు వదలక పోతే భగభగమండే మంటలలో భస్మం అయ్యే లంకను చూస్తావు. నీ స్నేహితులు, మంత్రులు, నీ భార్యలు, అంతఃపుర స్త్రీలు, బంధువులు, నీ కుమారులు, సోదరులు అందరూ నాశనం కావడం కళ్లారా చూస్తావు.
ఓ రాక్షసరాజా! నేను రాముని దూతను. కేవలం దూతను. నాకు ఎవరి మీదా కోపము ద్వేషమూ లేవు. నీకు నాలుగు మంచి మాటలు చెబుతున్నాను. ఆలకించు. నేను సత్యమే చెబుతున్నాను. రాముడు సృష్టిస్థితి లయ కారకుడు. ఈ సృష్టిని అంతా నాశనం చేసి మరలా సృష్టించగల సమర్ధుడు. పరాక్రమములో రాముడు విష్ణువుతో సమానుడు. అటువంటి రాముని ఎదుట నిలిచి యుద్ధం చేసి గెలవగల సమర్ధుడు దేవతలలో కానీ, అసురులలోగానీ, గంధర్వులలోగానీ, విద్యాధరులలో గానీ, యక్షులలోగానీ, నాగులలో కానీ లేరు.
రాముని భార్యను అపహరించి తెచ్చి నీ ఇంట ఉంచుకున్న నీవు బతకడం చాలా కష్టం. రాముడు ఎవరినైనా చంపదలచుకుంటే వానిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కానీ, ఇంద్రుడు కానీ, ఎవరూ రక్షించలేరు. తరువాత నీ ఇష్టం." అని పలికాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment