శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబదియవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 50)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబదియవ సర్గ

రావణుడు కూడా హనుమంతుని చూచి తన మనసులో ఇలా అనుకున్నాడు. "వీడా! ఈ వానరమా తనను ఇంతకాలమూ ముప్పు తిప్పలు పెట్టింది. ఇంత మంది రాక్షస వీరులను చంపింది ఈ వానరమా! పూర్వము నేను కైలాస పర్వతమును ఎత్తినపుడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో రాలేదు కదా! లేక వీడు వానర రూపంలో ఉన్న బాణాసురుడు కాదు కదా! లేక పోతే వీడికి ఇంత బలము పరాక్రమము ఎలా వచ్చాయి." అని మనసులో అనుకున్నాడు.

ప్రహస్తుని చూచి ఇలా అన్నాడు. " ప్రహస్తా! వీడు ఎవరు? ఎక్కడినుండి వచ్చాడు? ఇక్కడకు ఎందుకు వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? అశోక వనమును ఎందుకు పాడు చేసాడు? రాక్షసులను ఎందుకు చంపాడు? లంకానగరానికి ఎందుకు వచ్చాడు? రాక్షసులతో ఎందుకు యుద్ధం చేసాడు? వివరంగా అడగండి." అని ఆదేశించాడు.

అప్పుడు ప్రహస్తుడు హనుమంతునితో ఇలా అన్నాడు. "ఓ వానరుడా! నీవు భయపడవద్దు. నీకు ఏమీ అపకారము చెయ్యము. నిన్ను ఇక్కడకు ఎవరు పంపారు? ఇంద్రుడు పంపించాడా? నిజం చెప్పు. నిన్ను ఏమీ చెయ్యము. విడచి పెడతాము. ఇంద్రుడు కాకపోతే వరుణుడు పంపించాడా? నువ్వు ఎవరి గూఢచారివి? నిగూఢంగా ఎందుకు లంకలో ప్రవేశించావు? పోనీ కుబేరుడు పంపాడా?
యముడు పంపాడా? ఎవరు పంపారు? నిజం చెప్పు. లేకపోతే విష్ణువు నిన్ను తన దూతగా పంపాడా!

నీ రూపము వానర రూపము. కానీ నీ ముఖంలో వింత అయిన తేజస్సు కనబడుతూ ఉంది. నీవు సామాన్య వానరము కావు. అందుకని ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పు. వెంటనే నిన్ను విడిచి పెడతాము. అలా కాకుండా అసత్యము పలికావో నీవు జీవించడం కష్టము. అది సరే! పోనీ నిన్ను ఎవరూ పంపలేదు అనుకుందాము. నీ అంతట నీవే వచ్చావా? ఎందుకు వచ్చావు? నీకు లంకలో ఏమి పని? రావణుని గృహంలోకి ఎందుకు ప్రవేశించావు? " అని అడిగాడు ప్రహస్తుడు.

అప్పుడు హనుమంతుడు ప్రహస్తునితో ఇలా అన్నాడు. "మీరు చెప్పినట్టు నేను ఇంద్రునికి కానీ, యమునికి కానీ, వరుణునికి కానీ, విష్ణువుకు కానీ లేక కుబేరునికి కానీ దూతను కాను. నన్ను వారు ఎవరూ పంపలేదు. వారికీ నాకూ ఎలాంటి సంబంధము లేదు. పైగా మీరు అన్నట్టు నేను ఏ మారు రూపములో రాలేదు. నేను వానరుడను. నాది వానరజాతి. నేను వానర రూపంలోనే వచ్చాను. నా అంతట నేను వచ్చాను. రావణుని చూడాలని అనుకున్నాను. రావణుని దర్శనము అంత సులభంగా లభించదు కదా! అందుకని అశోకవనమును నాశనం చేసాను. రాక్షసులు నాతో యుద్ధం చేసారు. నన్ను నేను రక్షించుకోడానికి నేనూ వారితో యుద్ధం చేసాను. వాళ్లు చచ్చారు. నన్ను ఎవరూ ఏ అస్త్రముతో బంధించలేరు. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరము. కాని బ్రహ్మాస్త్రమును గౌరవించి పట్టుబడ్డాను. అందువలన నన్ను పట్టుకోగలిగారు. రావణుని వద్దకు తీసుకొని వచ్చారు.

నేను ఒక రాచకార్యము మీద రావణుని వద్దకు వచ్చాను.

ఓ రావణా! నేను రాముని దూతను. నీకు నాలుగు మంచి మాటలు చెబుదామని వచ్చాను." అని అన్నాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబదియవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)