శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 57)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది ఏడవ సర్గ

వాయుదేవుని పుత్రుడు అయిన హనుమంతుడు ఆ మహా సముద్రమును అవలీలగా దాటాడు. హనుమంతుడు ఆకాశంలో సముద్రము మీద ఎగురుతుంటే చూచేవాళ్లకు అతడు ఆకాశమును మింగుతున్నాడా అన్న అనుభూతి కలిగింది. ఆ ప్రకారంగా హనుమంతుడు మేఘముల పంక్తులను దాటుకుంటూ వెళుతున్నాడు. హనుమంతుడు కాసేపు మేఘాల చాటుకు వెళుతూ మరలా బయటకు వస్తూ వాయువేగంతో మేఘాల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రకారంగా ఎగురుతున్న హనుమంతుడు మేఘాల మధ్య దోబూచులాడే చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు మేఘాలను చీల్చుకుంటూ, పెద్దగా అరుస్తూ వెళు తుంటే, ఉరుముతున్న ఆకాశంలో గరుడుడు ఎగురుతూ వెళుతున్నాడా అన్నట్టు ఉంది.

హనుమంతుడు దారిలో తన కోసరము ఎదురుచూస్తున్న మైనాక పర్వత శిఖరమును తన చేతితో స్నేహపూర్వకముగా తాకి, మరలా విల్లు నుండి వెలువడిన బాణము వలే మహా వేగముతో తన ప్రయాణమును కొనసాగించాడు. అలా ఎగురుతూ హనుమంతుడు సముద్రమునకు ఆవల ఒడ్డున ఉన్న మహేంద్రగిరిని సమీపించాడు. తన వాళ్ల దగ్గరకు వచ్చాను అన్న సంతోషంతో హనుమంతుడు సింహనాదము చేసాడు. తన మిత్రులను చూడబోతున్నాను అన్న సంతోషంతో తన తోకను చిత్రవిచిత్రంగా తిప్పుతూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు.

హనుమంతుని అరుపులకు ఆకాశము బద్దలయిందా అన్నట్టుంది. హనుమంతుని రాకకోసరం అంగదుడు, జాంబవంతుడు మొదలగు వానరములు, భల్లూకములు ఎదురుచూస్తున్నాయి. వారికి ఒక్కసారిగా ఆకాశము బద్దలయిందా అన్నంత ధ్వని, గాలి వేగమునకు ఊగుతున్న చెట్లు హనుమంతుడు ఎగురుతుంటే వచ్చే భయంకర శబ్దము వినపడ్డాయి. తర్వాత హనుమంతుడు పెద్దగా అరుస్తున్న అరుపులు వినబడ్డాయి. అప్పటి దాకా వారికి హనుమంతుని గూర్చి వార్త ఏమీ తెలియలేదు. హనుమంతుడు లంకకు చేరాడా, సీతను చూచాడా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు.

ఇంతలో హనుమంతుని రాకకు గుర్తుగా గాలి వేగము, ఒత్తిడి, హనుమంతుని అరుపులు వినపడ్డాయి. అప్పుడు జాంబవంతుడు మిగిలిన వానరములను చూచి మిక్కిలి సంతోషముతో ఇలా అన్నాడు. “ఓ వానర శ్రేష్టులారా! హనుమంతుడు రామ కార్యము సఫలము చేసుకొని వస్తున్నాడు. హనుమంతుడు సీతను చూడనిచో ఇంత ఆనందంగా కేరింతలుకొట్టడు." అని అన్నాడు.

ఆ మాటలు విన్న వానరులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గంతులు వేసారు. హనుమంతుని చూడవలెనని కోరికతో కొంత మంది ఎత్తైన చెట్లనుఎక్కారు. మరి కొంత మంది కొండలను గుట్టలను ఎక్కారు. చెట్లమీద ఎక్కినవారు, ఆ సంతోషంలో చెట్లకొమ్మలను పట్టుకొని గబా గబా ఊపుతున్నారు. అప్పుడు ఆకాశంలో గంభీరమైన ధ్వని వినపడింది. నల్లని మేఘము కదిలి వస్తున్న చప్పుడు అయింది. హనుమంతుడు ఆకాశము నుండి కిందికి దిగి మహేంద్ర పర్వతము శిఖరము మీద దిగాడు. హనుమంతుని చూచి వానరులందరూ దోసిలి పట్టుకొని నిలబడ్డారు. హనుమంతుడు సీతను చూచిన సంతోషముతో ఆనందంతో పొంగిపోతున్నాడు.

హనుమంతుని కొరకు వేచి ఉన్న వానరులు గబా గబా హనుమంతుని చుట్టు చేరారు. హనుమంతుని చూచి వారందరూ ఆనందంతో గంతులు వేసారు. కొంత మంది ఫలములను, కంద మూలములను హనుమంతునికి ఇచ్చారు. హనుమంతుడు తన కన్నా పెద్ద వారైన జాంబవంతుడు మొదలగు వానరులకు, యువరాజు అంగదునకు నమస్కరించాడు.

అప్పుడు హనుమంతుడు వారితో ఒకే మాట అన్నాడు. "సీతచూడబడినది” (“దృష్టాసీతేతి".) ఆ మాట విన్న వానరులు ఆనందోత్సాహాలతో ఓలలాడారు. హనుమంతుడు అంగదుని చేయి పట్టుకొని ఒక రాతి మీద కూర్చున్నాడు. మిగిలిన వానరులు వాళ్ల చుట్టు నిలబడ్డారు. అప్పుడు హనుమంతుడు వారితో ఇలా అన్నాడు.

“అశోక వనములో ఉన్న జనకుని కూతురు అయిన సీతను నేను చూచాను. ఆమె కేశ సంస్కారము లేకుండా దీనంగా ఉంది. ఉపవాసములతో ఆమె శరీరం చిక్కిపోయింది. ఆమె మలినమైన వస్త్రములు ధరించి ఉంది. ఆమె చుట్టు రాక్షస స్త్రీలు కూర్చుని ఆమెకు కాపలాగా ఉన్నారు. సీత ఎప్పుడూ రాముని గురించి ఆలోచిస్తూ రాముని చూడవలెనని ఆతురతగా ఉంది." అని పలికాడు
హనుమంతుడు.

వానరులందరికీ “సీతను చూచాను" అన్న మాటలు కర్ణపేయంగా వినిపించాయి. కొందరు సింహనాదం చేసారు. మరి కొంత మంది గర్జించారు. మరి కొంత మంది కిచ కిచ మంటూ అరుస్తున్నారు. మరి కొందరు తమ తమ తోకలను పైకెత్తి ఆడిస్తున్నారు. మరి కొంత మంది అక్కడ ఉన్న కొండలను గుట్టలను ఎక్కి కిందికి దుముకుతున్నారు. వారి ఆనందాన్ని ఆ వానరులు రకరకాలుగా వ్యక్తపరుస్తున్నారు. సీతను చూచిన హనుమంతుని వారు అలా అలా తాకి ఆనందిస్తున్నారు. అప్పుడు అంగదుడు హనుమంతునితో ఇలా అన్నాడు.

"ఓ హనుమా! నీ వంటి బలవంతుడు, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు ముల్లోకములలో లేడు. నీవు కాబట్టి నూరు యోజనముల దూరముకల సముద్రమును దాటి లంకకు వెళ్లగలిగావు. నీ ప్రభుభక్తి ప్రశంసనీయము. నీ శక్తి అమోఘము. మా అందరి అదృష్టము కొద్దీ నీవు రాముని భార్య సీతను చూచావు. మా అందరి ప్రాణములను రక్షించావు. రాముని శోకమును పోగొట్టావు. అని అన్నాడు.

ఆ మాటలకు మిగిలిన వానరులు అందరూ వారి ఇద్దరి చుట్టుచేరి వారిని శ్లాఘించారు. వారందరూ హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుని చుట్టు కూర్చుని, హనుమంతుడు సముద్రమును ఎలా దాటాడు, లంకను ఎలా చేరాడు, లంకలో ఏమేమి చేసాడు అనే విషయములను వినడానికి చాలా కుతూహలంగా ఉన్నారు. వానరులందరూచుట్టు కూర్చుని ఉండగా అంగదుడు దేవతలు మధ్య ఉన్న ఇంద్రుని వలె ప్రకాశించాడు. హనుమంతుడు కూర్చుని ఉన్న ప్రదేశము కూడా అతని కీర్తితో ప్రకాశించింది.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)