శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 58)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది ఎనిమిదవ సర్గ

వారందరిలోకీ పెద్దవాడు అయిన జాంబవంతుడు లేచి హనుమతో ఇలా అన్నాడు. “హనుమా! నీవు సీతను వెదుకుతూ బయలు దేరావు కదా! అప్పటి నుండి ఇప్పటి దాకా ఏమేమి జరిగిందో విపులంగా చెప్పు. నీవు సీతాదేవిని ఎలా చూచావు? సీత లంకలో ఎక్కడ ఉంది? ఎలా ఉంది? రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ విషయములు అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. తరువాత మనము ఏమి చెయ్యాలో నిర్ణయించుకుందాము. మనము కిష్కింధకు వెళ్లిన తరువాత సుగ్రీవునికి ఏయే విషయాలు చెప్పాలి. ఏయే విషయాలు దాచి పెట్టాలి అన్న విషయం కూడా బుద్ధిమంతుడివి అయిన నీవు మాకు తెలియజేయాలి. " అని అన్నాడు జాంబవంతుడు.
ఆ మాటలు విన్న హనుమంతుడి ఒళ్లు పులకరించింది. తన మనసులోనే రామునికి సీతకు నమస్కరించాడు. వారందరితో ఇలా అన్నాడు.

“నేను మహేంద్రపర్వతము మీది నుండి మీ అందరి ఎదుటనే ఆకాశంలోకి ఎగిరాను కదా! నాకు దారిలో ఒక ఆటంకము ఏర్పడింది. సముద్రము లోనుండి ఒక పర్వత శిఖరము పైకి లేచింది. నాకు అడ్డుగా వచ్చిన ఆ పర్వత శిఖరమును నేను బద్దలు కొట్టాలి అని అనుకున్నాను. నేను నా తోకతో ఆ పర్వత శిఖరమును కొట్టాను. ఆ పర్వత శిఖరము ముక్కలైపోయింది. ఆ పర్వతము మానవ వాక్కులతో ఇలా అంది.

"పుత్రా! నా పేరు మైనాకుడు. నేను నీ తండ్రి వాయుదేవునికి స్నేహితుడను. నేను నీ తండ్రికి సోదరుడి వంటి వాడిని. నేను సముద్రగర్భంలో ఉంటాను. ఇంతకు ముందు భూమి మీద ఉన్న పర్వతములకు రెక్కలు ఉండేవి. ఆ పర్వతములు ఆకాశంలో ఎగురుతూ ఉంటే, అవి ఎక్కడ తమ మీద పడతాయో అని ప్రజలు తల్లడిల్లిపోయేవారు. అందుకని ఇంద్రుడు తన వజ్రాయుధములో పర్వతముల రెక్కలను ఖండించాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న నన్ను నీ తండ్రి వాయుదేవుడు ఎగురగొట్టి ఈ సముద్ర గర్భంలో పడేశాడు. అందుకని ఇంద్రుడు నా రెక్కలు ఖండించలేక పోయాడు. అలా నేను రక్షింపబడ్డాను. నీవు రామ కార్యము మీద వెళు తున్నావు. నేను కూడా రామునికి సాయం చెయ్యాలని అనుకుంటున్నాను. రామ కార్యము మీద వెళ్లే నీవు నా శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకొని నా ఆతిథ్యము స్వీకరించి వెళ్లు." అని పలికాడు.

నేను మైనాకునితో రామకార్యము గురించి తెలిపి అతనిని ఒప్పించి, మైనాకుని అనుమతి తీసుకొని అక్కడ నిలువ కుండా లంకకు వెళ్లాను. తరువాత మైనాకుడు సముద్రములో మునిగిపోయాడు.
నేను అలా ఎగురుతూ వెళుతుంటే, దారి మధ్యలో దేవతలు పంపిన సురస అనే దేవతాస్త్రీని చూచాను. 

“ఓ వానరుడా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు. నేను నిన్ను భక్షిస్తాను." అని నామీదికి రాబోయింది సురస. నాకు భయం వేసింది. నేను ఆమెకు నమస్కరించి ఇలా అన్నాను.
 
“సురసాదేవీ! నేను రామ కార్యము మీద వెళుతున్నాను. దశరథుని కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా దండకారణ్యంలో ఉంటూ ఉండగా, రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. రాముని ఆదేశము మేరకు నేను రావణుని వద్దకు దూతగా వెళుతున్నాను. నా మార్గమునకు అడ్డురాకు. నీవు కూడా రాముని పాలనలో ఉన్న ప్రదేశములో నివసిస్తున్నావు కదా! అందుకని నీవు కూడా రామునికి సాయం చెయ్యాలి. అది నీ బాధ్యత. నేను లంకకు పోయి సీతను చూచి, ఆ విషయమును రామునికి చెప్పి తరువాత నీకు ఆహారంగా నీ నోట్లో ప్రవేశిస్తాను. ఇది నిజము.” అని అన్నాను.

నా మాటలు సురస వినలేదు. "నన్ను దాటి ఎవరూ పోకూడదు అని నాకు వరము ఉంది. అందుకని నీవు నన్ను దాటి పోలేవు." అని పలికింది సురస. నేను పదియోజనముల పొడవు ఉన్న నా శరీరాన్ని అందులో సగం అనగా పదిహేను యోజనముల పొడవు పెంచాను. అది చూచి సురస తన నోటిని నా పొడుగు సరిపోయేట్టు తెరిచింది. నేను వెంటనే నా దేహమును కుచింప జేసి బొటనవేలి ప్రమాణం అయ్యాను. సురస నాకోసం వెదుకుతూ ఉంది. నేను వెంటనే సురస నోట్లోకి దూరాను. వెంటనే బయటకు వచ్చాను. 

అప్పుడు సురస నాతో ఇలా అంది. “ఓ వానరోత్తమా! నీ తెలివికి సంతోషించాను. రామ కార్యము నెరవేర్చుటకు నీవు వెళ్లు. సీతను రామునితో కలుపు. నీకు శుభం కలుగు గాక" అని దీవించింది సురస.

నేను మరలా ఆకాశంలోకి ఎగిరాను. నేను సముద్రం మీద ఆకాశంలో ఎగురుతుంటే నా నీడ సముద్రము నీటి మీద తేలుతూ ఉంది. ఎవరో నా నీడను పట్టుకున్నారు. ఆకాశంలో ఉన్న నేను కదలలేక పోయాను. నేను చుట్టు చూచాను. ఎవరూ కనపడలేదు. నా వేగానికి అంతరాయము కలిగించిన వాళ్లు ఎవరా అని సముద్రము నీటి వంక చూచాను. సముద్రము నీళ్లలో దాగి ఉన్న ఒక భయంకర రాక్షసిని చూచాను. ఆ రాక్షసి భయంకరంగా అరుస్తూ నాతో ఇలా అంది. 

"ఓ వానరుడా!ఇంత పెద్ద శరీరంతో ఎక్కడకు వెళుతున్నావు. నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్ను ఆహారంగా తింటాను. నీవు నాకు ఇష్టమైన ఆహారము." అని నన్ను తినబోయింది. నేను ఆమె మాటలకు తల ఊపి “అలాగే నన్ను తినెయ్యి" అని అన్నాను. నేను నా శరీరాన్ని ఆమె ముఖం కన్నా రెట్టింపు పరిమాణానికి పెంచాను. నన్ను తినడానికి వీలుగా ఆ రాక్షసి కూడా తన నోటి పరిమాణాన్ని పెంచింది. మరుక్షణంలో నేను నా రూపాన్ని చిన్నదిగా చేసి దాని నోటిగుండా శరీరంలోకి ప్రవేశించాను. దాని గుండెను చీల్చాను. మరలా ఆకాశంలోకి ఎగిరాను. నేను దాని గుండెలు చీల్చడంతో ఆ రాక్షసి సముద్రంలో పడిపోయింది. ఆకాశంలో ఉన్న సిద్దులు, చారణులు అందరూ "ఆహా! హనుమంతుడు సింహికను చంపేసాడు" అని అనుకోవడం నేను విన్నాను.

తరువాత నేను ఎగురుతూ వెళ్లి లంకానగరము దక్షిణ తీరాన్ని చేరుకున్నాను. సూర్యుడు అస్తమించేవరకూ బయటనే ఉండి చీకటి పడగానే లంకానగరంలోకి ప్రవేశించాను. నేను నగరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే భయంకరాకారం కల స్త్రీ ఒకత్తి నా ఎదురుగా నిలిచింది. ఆమె నన్ను చంపడానికి ప్రయత్నించింది. కానీ నేను ఆమెను ఎడమ చేతితో ఒక గుద్దు గుద్దాను. అప్పుడు ఆ రాక్షసి నాతో ఇలా అంది. 

"ఓ వానరుడా! నేను లంక దేవతను. ఈ లంకను రక్షిస్తుంటాను. ఇన్నాళ్లకు నువ్వు నన్ను జయించావు. ఇంక నీకు లంకలో ఎదురు లేదు. రాక్షసులందరినీ జయిస్తావు." అని పలికి నాకు దోవ ఇచ్చింది.

నేను ఆ రాత్రి లంకా నగరము అంతా వెతికాను. రావణుని అంత:పురము ప్రవేశించాను. అంతఃపురము అంతా వెతికాను. ఎంత వెతికినా నాకు సీత కనపడలేదు. నేను నిరాశ చెందాను. నూరు యోజనముల సముద్రము లంఘించిన నేను శోకసముద్రములో మునిగిపోయాను. అప్పుడు నాకు రావణుని భవనమునకు ఎదురుగా ఉన్న ఒక వనము కనపడింది. దాని పేరు అశోక వనము. నేను అశోకవనములోకి ప్రవేశించాను. ఆ వనములో వెతుకుతుంటే ఒక శింశుపా వృక్షము కనపడింది. నేను ఆ శింశుపా వృక్షము ఎక్కాను. చుట్టూ చూచాను. ఆ శింశుపా వృక్షము దగ్గరలోనే నేను మాసిన వస్త్రములు కట్టుకొని నిరంతర ఉపవాసములతో చిక్కి ఉన్న ఒక ఉత్తమురాలైన స్త్రీని చూచాను. ఆమె చుట్టు వికృతాకారులైన రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు.

ఆమెను సీతగా పోల్చుకున్నాను. ఆమె నిరంతరమూ తన భర్త రాముని తలచుకుంటూ ఉంది. ఆ రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారు. ఆ బాధలు తట్టకోలేక ఆమె మరణించడానికి ఉద్యుక్తురాలయింది. ఆ పరిస్థితులలో ఉన్న సీతను నేను చూచాను. నేను నా రూపమును చిన్నదిగా చేసుకొని ఆ శింశుపావృక్షము మీదనే ఆమెకు కనపడకుండా ఉండిపోయాను. ఇంతలో నాకు కోలాహలము వినపడింది. రావణుడు తన భార్యలతో పరివారముతో సీత వద్దకు వచ్చాడు. రావణుని చూచిన సీత భయంతో వణికిపోతూ తన అవయవములను దగ్గరగా చేర్చుకొని కూర్చుంది. రావణుడు ఆమెను “నన్ను వరించు. నన్ను భర్తగా స్వీకరించు. నీకు ఇంక రెండు మాసముల గడువుమిగిలి ఉంది. ఆ లోపల నన్ను భర్తగా అంగీకరించకపోతే నిన్ను చంపి నీ రక్తము తాగుతాను" అని బెదిరించాడు.

రావణుని మాటలకు సీత కోపించింది. ఆ కోపంలో ఇలా పలికింది. “ఓ రాక్షసుడా! నేను ఇక్ష్వాకు వంశములో పుట్టిన దశరథుని కోడలిని. రాముని భార్యను. నా గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్న నీ నాలుక ఇంకా ఎందుకు తెగి పడలేదు? నా భర్త ఇంట లేని సమయమున నన్ను అపహరించి తెచ్చావు? నీది కూడా ఒక పరాక్రమమా! నీవు ఒక వీరుడవా! నీకూ రామునికి సామ్యమే లేదు. రాముడు రారాజు. నీవు రామునికి దాసునిగా కూడా పనికిరావు. రాముని కీర్తి ముల్లోకములు ప్రకాశిస్తూ ఉంది.” అని పలికింది.

ఆ మాటలకు రావణుడు కోపంతో మండి పడ్డాడు. తన కళ్లు ఇంతింత చేసుకొని చూచాడు. తన పిడికిలి బిగించి సీతను చంపడానికి తన చెయ్యి పైకి ఎత్తాడు. రావణుని కోపావేశము చూచి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు హాహాకారాలు చేసారు. అప్పుడు రావణుని భార్య అయిన మండోదరి వచ్చి రావణుని చెయ్యిపట్టుకొని వారించింది. 

“నాధా! నీ పరాక్రమము ముల్లోకములలో కూడా ప్రశంసనీయము. అటువంటి నీకు ఈ మాసిన వస్త్రములతో అంద వికారముగా ఉన్న స్త్రీతో ఏమి పని. నీవు దేవకన్యలతోనూ, గంధర్వకన్యలతోనూ యక్షకన్యలతోనూ క్రీడించడానికి తగినవాడవు కానీ ఈ మామూలు మానవ స్త్రీతో కాదు." అని బతిమాలి రావణుని భార్యలందరూ, అతనిని తమ గృహమునకు తీసుకొని వెళ్లారు.

రావణుడు వెళ్లిపోయిన తరువాత సీత చుట్టు ఉన్న రాక్షస స్త్రీలు సీతను నానా రకాలుగా భయపెట్టారు. కాని సీత వారి మాటలను లెక్కచెయ్యలేదు. తాము ఎంత బతిమాలినా, భయపెట్టినా సీత లొంగలేదని, ఈ విషయం రావణునికి తెలియచెయ్యడానికి కొంతమంది రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వెళ్లారు. మిగిలిన స్త్రీలు సీతను ఇంక భయపెట్టి లాభం లేదని, ఆమె చుట్టు పడుకొని నిద్రించారు. రాక్షస స్త్రీలు నిద్రించిన తరువాత, సీత రాముని తలచుకొని తన దుస్థితికి ఏడుస్తూ ఉంది.

పడుకొని ఉన్న రాక్షస స్త్రీలలో త్రిజట అనే వృద్ధరాక్షసి కూడా ఉంది. ఆమె నిద్ర నుండి లేచి పక్కన ఉన్న రాక్షస స్త్రీలతో ఇలా అంది. “ఈమె సామాన్యురాలు కాదు. జనకుని కూతురు, దశరధుని కోడలు. రాముని భార్య. ఈమెను మీరు చంపలేరు. మీరందరూ చచ్చినా, ఈమె మాత్రము బతికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో లంకలో ఉన్న రాక్షసులు అందరూ నాశనం అయినట్టు రాముడు విజయోత్సాహంతో ఉన్నట్టు నాకు కనపడింది. అంతే కాకుండా ఎవరైనా స్త్రీ ఆపదలో ఉంటే, అదే స్త్రీ సుఖంగా ఉన్నట్టు మనకు కలలో కనబడితే, ఆమె దు:ఖములు అన్నీ పోయి సుఖిస్తుంది అని పెద్దలు చెబుతారు. కాబట్టి మనలను అందరినీ కాపాడమని సీతను ప్రార్థిద్దాము అంతకన్నా మనకు వేరు మార్గము లేదు. మనము సీతకు నమస్కారం చేస్తే చాలు ఈమె చాలా సంతోషిస్తుంది." అని త్రిజట ఆ రాక్షస స్త్రీలకు చెప్పింది.

నేను శింశుపా వృక్షము మీద కూర్చుని ఇదంతా చూస్తూ ఉన్నాను. సీత దు:ఖిస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చెయ్యలేకపోయాను. సీతతో ఎలా మాట్లాడాలా అని ఆలోచించి, తుదకు నేను ఆకుల మాటున కూర్చుని సీతకు కనపడకుండా రామ చరితమును వల్లించాను. నేను చెబుతున్న రాముని చరితమును విని సీతకు ఆశ్చర్యము కలిగింది. తల పైకి ఎత్తి చూచింది. నేను ఆమెకు నమస్కరించాను. ఆమె నన్ను చూచి “నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు?" అని ఆతురతగా అడిగింది.

అప్పుడు నేను సీతతో ఇలా అన్నాను. “ఓసీతాదేవీ! నీ భర్త రామునికి మా వానర రాజు సుగ్రీవునికీ మైత్రి కుదిరింది. నేను ఆ సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. నీవు ఎక్కడ ఉన్నావో వెదకడానికి రాముడు, సుగ్రీవుడు నన్ను పంపారు. నీవు కనపడితే నీకు ఆనవాలుగా చూపమని రాముడు ఈ ఉంగరమును నాకు ఇచ్చాడు. వారి ఆదేశానుసారము నేను లంకకు వచ్చాను. నిన్ను చూచాను. నువ్వు నాతో వస్తాను అంటే నేను నిన్ను రామలక్ష్మణుల వద్దకు తీసుకొని వెళతాను. మీ ఆజ్ఞకొరకు వేచి ఉన్నాను.” అని పలికి రాముడు ఇచ్చిన ఉంగరమును సీతకు ఇచ్చాను. 

అప్పుడు సీత నాతో ఇలా పలికింది. 

“రాముడు లంకకు వచ్చి రావణుని ఓడించి నన్ను తీసుకొని వెళ్లాలి. అంతే కానీ నేను నీతో రాను" అన్నది సీత. ఆమె మాటలకు సంతోషించిన నేను రామునికి చూపుటకు ఆనవాలుగా ఏదైనా గుర్తు ఇమ్మని అడిగాను. సీత తన చూడామణిని తీసి నాకు ఇచ్చింది. దీనిని రామునికి చూపిస్తే రాముడు నమ్ముతాడు అని చెప్పింది. ఆమె రామునితో చెప్పమని నాకు తన సందేశమును కూడా వినిపించింది. తరువాత నేను సీతకు ప్రదక్షిణము చేసి నమస్కరించాను. నేను వెళ్లబోతుంటే సీత నాతో ఇలా అంది.

“ఓ హనుమా! నా రామునికి ఇక్కడ ఉన్న పరిస్థితులను అన్నీ వివరించు. నేను పడుతున్న కష్టములు అన్నీ చెప్పు. నీవు పోయి రాముని, లక్ష్మణుని, నీ రాజు సుగ్రీవుని ఇక్కడకు వచ్చేట్టు చెయ్యి. నేను ఇంక రెండు మాసములు మాత్రమే జీవిస్తాను. రెండు మాసముల తరువాత రాముడు ఇక్కడకు వచ్చినా నన్ను చూడలేడు. ఎందుకంటే అప్పటికి నేను ఒక అనాధ వలె మరణిస్తాను." అని దీనంగా పలికింది సీత. ఆమె మాటలు విని నాకు రావణుని మీద కోపం వచ్చింది. నా శరీరమును విపరీతంగా పెంచాను. ఆ అశోకవనమును సర్వనాశనం చేసాను. నిద్రపోతున్న రాక్షస స్త్రీలందరూ లేచారు. విరిగిన లతలు, కూలిన చెట్లు, ధ్వంసము చేయబడ్డ సరోవరములు చూచారు. వనమును నాశనం చేస్తున్న నన్ను చూచారు. వెంటనే పోయి రావణునికి నా గురించి చెప్పారు. 

"ఓ రాక్షసరాజా! అశోక వనమును ఒక కోతి నాశనం చేస్తూ ఉంది. దానిని చంపడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్ధించారు. వెంటనే రావణుడు కింకరులు అనే పేరుగల రాక్షస మూకను పంపాడు. వాళ్లను చూచి నేను ఒక పరిఘను తీసుకున్నాను. ఎనభయి వేలమంది కింకరులు అనే రాక్షసులను ఆ పరిఘతో సంహరించాను. చావగా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున పోయి రావణునితో కింకరులు అందరూ మరణించారు అన్న వార్త చెప్పారు. తరువాత నేను అశోక వనములో ఉన్న చైత్య ప్రాసాదము అనే పెద్ద భవనమును సమూలంగా కూల్చివేసాను. రావణుడు ప్రహస్తుని కుమారుడు అయిన జంబుమాలిని కొంత సైన్యముతో నా మీదికి పంపాడు. నేను జంబుమాలిని, అతని సైన్యమును నా చేతిలో ఉన్న పరిఘతో కొట్టి చంపాను. జంబుమాలి మరణించాడు అన్న వార్త విన్న రావణుడు మంత్రి కుమారులను నా మీదికి పంపాడు. నేను ఆ మంత్రి కుమారులను కూడా పరిఘతో కొట్టి చంపాను. తరువాత రావణుడు ఐదుగురు సేనానాయకులను సైన్యంతోసహా నా మీదికి పంపాడు. నేను ఆ ఐదుగురు సేనానాయకులను కూడా సంహరించాను. తరువాత రావణుడు తన కుమారుడు అయిన అక్షకుమారుని నా మీదికి యుద్ధానికి పంపాడు. అక్షకుమారుడు నన్ను చంపడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు నేను అతని పాదములు పట్టుకొని గిరా గిరా తిప్పి నేలకేసి మోది చంపాను. అక్షకుమారుడు మరణించాడు అన్న వార్త విన్న రావణుడు క్రుద్ధుడై తన కుమారుడు ఇంద్రజిత్తును నా మీదికి పంపాడు. నేను ఇంద్ర జిత్తు వెంట వచ్చిన సైన్యమును పూర్తిగా చంపాను.

అప్పుడు ఇంద్రజిత్తు నా మీద బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. నేను బ్రహ్మాస్త్రమును గౌరవించి బంధింపబడ్డాను. తరువాత రాక్షసులు నన్ను తాళ్లతో కట్టి రావణుని ముందు నిలబెట్టారు. రావణుడు నన్ను చూచి “నీవు ఎవరు? లంకకు ఎందుకు వచ్చావు? రాక్షసులను ఎందుకు చంపావు?" అని అడిగాడు. అప్పుడు నేను రావణునితో ఇలా అన్నాను. “నేను సీతను చూడటానికి లంకకు వచ్చాను. సీతను చూచాను. నేను వాయుదేవుని ఔరస పుత్రుడను. నా పేరు హనుమంతుడు. నేను వానరుడను. నేను వానర రాజు వాలి సోదరుడు అయిన సుగ్రీవుని మంత్రిని. రాముని దూతగా లంకకు వచ్చాను. సుగ్రీవుడు నిన్ను క్షేమము అడగమని చెప్పాడు. నీకు కొన్ని హితవచనములు తన మాటలుగా నీకు చెప్పమని చెప్పాడు.

"ఓ రావణా! నేను ఋష్యమూక పర్వతము మీద ఉన్నప్పుడు రాముడు నాకు మిత్రుడు అయ్యాడు. తన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడనీ, తన భార్యను వెదకడంలో తనకు సాయం చెయ్యమనీ రాముడు నన్ను అడిగాడు. నేను కూడా వాలి నా రాజ్యమును, నా భార్యను నా నుంచి బలవంతంగా లాక్కున్నాడు అని చెప్పి నాకు సాయం చెయ్యమని రాముని కోరాను. నేను, రాముడు అగ్నిసాక్షిగా స్నేహితులము అయ్యాము. ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలని ప్రతిజ్ఞలు చేసుకున్నాము. రాముడు నాకు ఇచ్చిన మాట ప్రకారము వాలిని వధించి నన్ను కిష్కింధకు రాజును చేసాడు. నా భార్యను తిరిగి నా వద్దకు వచ్చేట్టు చేసాడు. దానికి ప్రతిఫలంగా నేను సీతను వెదకడానికి రామునికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాను. అందుకని నా మంత్రి హనుమంతుని నీ వద్దకు పంపుతున్నాను. నేను వానరసైన్యముతో లంకకు వచ్చి నిన్ను చంపక ముందే నీవు సీతను తీసుకొని వచ్చి రామునికి అప్పగించు. నీకు వానరముల శక్తి సామర్థ్యములు పరాక్రమము తెలియనిది కాదు." అని సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు. తరువాత నీ ఇష్టం.” అని ఊరుకున్నాను.

నా మాటలు విన్న రావణుని కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో ఊగిపోయాడు. వెంటనే నన్ను చంపమని ఆదేశాలు ఇచ్చాడు. ఇంతలో రావణుని సోదరుడు అయిన విభీషణుడు నా గురించి రావణుని ప్రార్ధించాడు. “ఓ రాక్షస రాజా! దూతను చంపడం రాజ ధర్మమునకు విరుద్ధము. దూత ఎంత తప్పు చేసినా అవయవములు ఛేదించడం మంచిది కానీ చంపడం శాస్త్ర విరుద్ధము.” అని రావణునికి హితము చెప్పాడు. విభీషణుని మాటలు విన్నాడు రావణుడు. నా తోకకు నిప్పు అంటించి కాల్చమని ఆజ్ఞ ఇచ్చాడు.

వెంటనే రాక్షసులు నా తోకకు పాత వస్త్రములు చుట్టి, నూనె పోసి నిప్పంటించారు. తరువాత రాక్షసులు నన్ను చేతులతోనూ కాళ్లతోనూ కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొట్టడం, మోదడం చేసారు. నన్ను నగర వీధులలో తిప్పారు. నా గురించి పెద్దగా అరిచి అందరికీ చెప్పారు. నాకు కోపం వచ్చింది. నేను ఆ కట్లను విడిపించుకున్నాను. ఒక పరిఘను తీసుకొని ఆ రాక్షసులను అందరినీ చంపాను. తరువాత నేను మండుతున్న తోకతో నగర ద్వారము మీదికి ఎక్కాను. ఒక గృహము మీది నుండి మరొక గృహము మీదికి దుముకుతూ అన్ని గృహములకు, భవనములకు, ప్రాసాదములకు నిప్పుపెట్టాను. లంక అంతా కాల్చాను.

అప్పుడు నాకు ఒక సందేహము వచ్చింది. లంక అంతా కాల్చాను కదా అందులో సీత కూడా కాలి పోయి ఉంటుంది కదా అని విచారించాను. రామకార్యమును నాశనం చేసాను కదా అని శోకించాను. ఇంతలో ఆకాశంలో వెళుతున్న చారణుల మాటలు నాకు వినబడ్డాయి. “హనుమంతుడు లంకాదహనం చేసాడు. కానీ మహాసాధ్వి సీత మరణించలేదు" అని వారు మాట్లాడుకోవడం నేను విన్నాను. అప్పుడు నాకు అనిపించింది. “నా తోకకు నిప్పంటించినపుడే అగ్ని నా నా తోకను కాల్చలేదు. ఇంక రాముని భార్య సీతను అగ్ని ఎలా దహిస్తాడు.” అని అనుకున్నాను. అదీ కాకుండా సీతకు శుభశకునములు కనపడినప్పుడు సీతకు కీడు ఎలా కలుగుతుంది అని కూడా అనుకున్నాను.

నేను వెంటనే శింశుపా వృక్షము కింద ఉన్న సీత వద్దకు వెళ్లాను ఆమె క్షేమంగా ఉందని తెలుసుకున్నాను. ఆమె అనుజ్ఞను పొంది తిరిగి సముద్రమును లంఘించి మీ వద్దకు వచ్చి వాలాను. రాముని ప్రభావంతో, మీ అందరి ఆశీస్సులతో, సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును నిర్విఘ్నముగా నెరవేర్చాను. ఇంక మీరు ఎలా చెబితే అలా చేస్తాను." అని వినయంగా జరిగింది జరిగినట్టు చెప్పాడు. హనుమంతుడు.

(హనుమంతుడు చెప్పడంలో కొన్ని విషయాలు, కొన్ని పేర్లు అటు ఇటు అవడం మీరు గమనించే ఉంటారు. ఒక విషయాన్ని తిరిగి చెబుతున్నప్పుడు కొంత వైవిధ్యం కనపడటం మానవ సహజం. ఇంక వానరుల సంగతి చెప్పేదేముంది.)

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)