శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 59)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఏబది తొమ్మిదవ సర్గ

హనుమంతుడు లంకలో తాను చేసిన పనులు జరిగిన విషయములు అన్నీ జాంబవంతునికి, అంగదునకు మిగిలిన వానరశ్రేష్టులకు చెప్పి, ఇంకా ఇలా చెప్పసాగాడు.

"సీతా దేవి మహా పతివ్రత. ఆమె పాతివ్రత్య మహత్తు చేత రాముని ప్రయత్నము సఫలం అవుతుంది అని నా నమ్మకము. కానీ రాక్షస రాజు రావణుడు సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అతడికి కోపం వస్తే ఎవరినీ లెక్క చెయ్యడు. తన తపోబలంతో ముల్లోకములను నాశనం చెయ్యగల సమర్ధుడు. రావణుడు సీతను తీసుకొని వెళ్లేటప్పుడు ఆమె శరీరాన్ని తాకాడు. కానీ రావణుడు భస్మం కాకపోవడానికి కారణం అతడు చేసిన తపస్సు ఫలితమే. మరొకడు అయితే సీత పాతివ్రత్య మహిమకు భస్మంకాక తప్పదు. సీతకు కోపం వస్తే తన పాతివ్రత్య మహిమతో ఏమైనా చెయ్యగలదు. ఇదీ పరిస్థితి. మనము ఇప్పుడు ఏం చెయ్యాలి. మనం అందరం లంకకు పోయి సీతను తీసుకొని వచ్చి రామునికి అప్పగించడమా! ఎందుకంటే రావణుని ససైన్యముగా నాశనం చెయ్యడానికి నేను ఒక్కడినే చాలు. నాకు రావణుని సైన్యము యొక్క ఆనుపానులు బాగా తెలుసు. నాకు తోడు మీరందరూ ఉన్నారు. మీరందరూ బలవంతులు, అస్త్రములను శస్త్రములను
ప్రయోగించడంలో నిపుణులు. మీరందరూ నాతో ఉంటే ఇంక చెప్పేదేముంది. క్షణాల్లో రావణుని, రావణుని సోదరులను, రావణుని పుత్రులను, అతని సమస్త సైన్యమును సంహరించవచ్చును. ఇంద్రజిత్తు చే ప్రయోగింపబడే బ్రహ్మాస్త్రము, ఇంద్రాస్త్రము, రౌద్రాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము ఇంకా రకరకాల అస్త్రములను నేను దూది పింజల మాదిరి ఎగురగొట్టగలను. రాక్షసులందరినీ చంపగలను. నా పరాక్రమంతో రావణుని బంధించగలను. నేను కురిపించే రాళ్ల వర్షానికి దేవతలే భయపడతారు. ఇంక ఈ రాక్షసులు ఒక లెక్కా!

నా దాకా ఎందుకు ఈ జాంబవంతుడు చాలు. రాక్షసులనందరినీ తుదముట్టించడానికి. అంతదాకా ఎందుకు మన యువరాజు అంగదుడు చాలు. సకల రాక్షస నాయకులను సంహరించడానికి. మన పనసుడు, నీలుడు తలచుకుంటే మందరపర్వతమును కూడా బద్దలు కొట్టగలరు. ఇంక ఆ రాక్షసులు వారి ముందు ఎంత! దేవాసురులు కానీ, గంధర్వులు, యక్షులు గానీ, పన్నగులు కానీ మన మైందునకు ద్వివిదునకు ఎదురు నిలిచి పోరాడగలరా! వారే పోరాడలేనపుడు ఈ రాక్షసాధములు ఎంత? ఎందుకంటే ఈ మైందుడు ద్వివిదుడు బ్రహ్మదేవుడు వరము చేత అమృతమును సేవించారు. వీరికి ఎక్కడా అపజయము అనే మాట లేదు. పైగా వీరికి ఎవరి చేతిలోనూ చావు రాదని బ్రహ్మదేవుడు వరం కూడా ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో గర్వించి, వీరు దేవతలను జయించి, వారి వద్ద ఉన్న అమృతమును తాగారు. అందువలన వీరు అజేయులు. కాబట్టి ఈ మైందుడు ద్వివిదుడు కోపిస్తే లంకానగరము సర్వము నాశనమైపోతుంది.

ఇప్పటికే నేను లంకానగరమును అగ్నికి ఆహుతి చేసి మన వానరుల పరాక్రమమును లంకావాసులకు తెలియజేసాను. అంతే కాదు. నేను లంకలో రామలక్ష్మణుల యొక్క, మన రాజు సుగ్రీవుని యొక్క బల పరాక్రమముల గురించి రావణునికి తెలియజేసాను. అశోక వనములో ఉన్న సీత సదా రామనామస్మరణ చేస్తూ ఉందే కానీ, రావణుని పేరు ఒక్కసారి కూడా తలవడం లేదు.
మన రాముని భార్య సీత లంకలో బంధింపబడి ఉంది.

ఆమె ఎప్పుడూ రాముని మనసులో స్మరిస్తూ ఉంది. సీత నిరంతరమూ శోకిస్తూ ఉంది. అటువంటి సీతను రాక్షస స్త్రీలు నిరంతరమూ భయపెడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. రావణుడు ఆమెకు రెండు నెలల గడువు ఇచ్చాడు. వారి బాధలకు తట్టుకోలేక సీత ప్రాణత్యాగమునకు సిద్దం అయింది. అది నేను కళ్లారా చూచాను. ఆమెకు నేను కిష్కింధలో జరిగిన విషయములు అన్నీ విపులంగా చెప్పాను. మేమందరమూ కూడా ఆమె కోసరం నిరంతరమూ బాధపడుతున్నాము అని తెలియజేసాను. నామాటలతో ఆమెకు ఊరట కలుగచేసాను.

అసలు మనమంతా ఎందుకు. సీతకు కోపం వస్తే రావణుని ఈ పాటికి భస్మం చేసి ఉండేది. కానీ అలా చేయలేదు. కారణం ఆమెకు రాముని మీద అచంచల భక్తి, విశ్వాసము. సీతను అపహరించగానే రావణుడు సగం చచ్చాడు. ఇప్పుడు రాముడు రావణుని చంపడం కేవలం నిమిత్తమాత్రమే. కాబట్టి మనం అంతా కలిసి సీతను రావణుని చెరనుండి విడిపించుటకు తగిన ప్రయత్నములు చేయాలి." అని హనుమంతుడు తన సుదీర్ఘమైన ప్రసంగమును ముగించాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)