శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 10)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పదవ సర్గ
తాను ఎన్ని హితమైన వాక్యములు చెప్పినా ఏమీ మాట్లాడ కుండా వెళ్లిపోయిన రావణుని ప్రవర్తన చూచి కూడా తన పట్టు వీడలేదు విభీషణుడు. వ్యక్తిగత శ్రేయస్సుకన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని నమ్మిన విభీషణుడు మరలా తన ప్రయత్నాలను కొనసాగించాడు. మరునాడు ప్రాతః కాలమునందే లేచి రావణుని గృహమునకు వెళ్లాడు.రావణుని గృహములో వేదఘోషలు మిన్నుముడుతున్నాయి. రావణుని విజయాన్ని ఆకాంక్షిస్తూ పండితులు వేదములు పఠిస్తున్నారు. మరి కొందరు పుణ్యాహవచనములు చదువుతున్నారు. రాక్షసులతో పూజింపబడుతున్న రావణుని చూచి విభీషణుడు భక్తితో నమస్కరించాడు. రావణుడు విభీషణుని పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోమని సంజ్ఞచేసాడు. విభీషణుడు రావణుడు చూపిన ఆసనము మీద కూర్చున్నాడు. రావణుడు విభీషణుని చూచి ఎందుకు వచ్చావు అన్నట్టు చూచాడు. అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు.
"ఓ రాక్షసరాజా! నీకు జయము కలుగుగాక! సీత లంకలో అడుగు పెట్టినది మొదలు అశుభశకునములు కనపడుతున్నాయి. తరచుగా పాలు విరిగిపోతున్నాయి. హోమాగ్ని ప్రకాశవంతంగా వెలగడం లేదు. గుర్రములు గాడిదలు ఏదో తెలియని రోగాలతో బాధపడుతున్నాయి. కాకులు గుంపులు గుంపులుగా ఇండ్ల మీద కూర్చుని దీనంగా అరుస్తున్నాయి. అకారణంగా గద్దలు జనావాసాల మీద తిరుగుతున్నాయి. సాయంత్రము వేళలో నక్కలు కూస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే లంకకు ఏదో చేటు కలుగుతుందని అనిపిస్తూ ఉంది. దీనికి ఒకటే పరిష్కారము. సీతను తిరిగి రాముని వద్దకు పంపివేయడమే.
ఓ రాజా! నేను ఈ మాటలు నా స్వార్ధము కొద్దీ అజ్ఞానంతో పలుకుతున్నాను అని అనుకొన్నా బాధలేదు. లంక క్షేమము నాకు ముఖ్యము. నేను చెప్పిన దుశ్శకునములు నా కు ఒక్కడికే కాదు. ఇక్కడ అందరికీ కనపడుతున్నాయి. కాని వారంతా నీ మీద భయంతో చెప్పడం లేదు. మంత్రులు నీతో ఈ విషయాలు చెప్పడానికి సందేహిస్తున్నారు. కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది. తరువాత నీకు ఏది న్యాయము, ధర్మము అని తోస్తే అది చెయ్యి." అని పలికి ఊరుకున్నాడు విభీషణుడు.
రావణునికి విభీషణుడు చెప్పిన మాటలు రుచించలేదు. పైగా కోపం వచ్చింది. విభీషణుని చూచి ఇలా అన్నాడు. "ఓ విభీషణా! ఈ దుశ్శకునములు చూచి భయపడవలసిన కారణము ఏదీ నాకు కనిపించడం లేదు. రాముడు లంకకు రాలేడు. సీతను చూడలేడు. రాముడు ఒక్కడే కాదు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ కలిసి వచ్చినా నన్ను యుద్ధములో గెలువలేరు. ఇది నిశ్చయము. ఇంక నీవు వెళ్లవచ్చు." అని అన్నాడు రావణుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment