శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదకొండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 11)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పదకొండవ సర్గ
సీత మీద రావణుడు పెంచుకున్న వల్లమాలిన కామము విభీషణుడు చెప్పిన మంచి మాటలను తలకు ఎక్కనీయలేదు. రాముడితో యుద్ధము సంభవిస్తే ఎలాంటి వ్యూహములు పన్నాలి అని మంత్రులతోనూ, మిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఉదయము ఆచరించవలసిన విధులు నిర్వర్తించి రావణుడు సభకు వెళ్లాడు. రావణుడు రాజమార్గములో వందిమాగధులు వెంటరాగా వెళుతుంటే మార్గమునకు ఇరుపక్కలా జనం నిలబడి జయజయధ్వానాలు చేస్తున్నారు. రావణుడు సభాస్థలిని ప్రవేశించాడు. జయజయధ్వానముల మధ్య సింహాసనము మీద ఆశీనుడయ్యాడు.యుద్ధము నిశ్చయము అయినది. రాక్షసవీరులను అందరినీ సమావేశపరచమని ఆదేశాలు ఇచ్చాడు. రాక్షస వీరులందరూ రావణుని సభాభవనమునకు వచ్చి రావణునికి పాదాభివందనము చేసి తమకు కేటాయించిన ఆసనముల మీద తివాచీల మీద కూర్చున్నారు. రావణుని మంత్రులందరూ వారి వారి ఆసనముల మీద కూర్చున్నారు. రావణుని తమ్ముడు విభీషణుడు, మంత్రి ప్రహస్తుడు, శుకుడు రావణుని సభకు వెళ్ళారు. రావణునికి నమస్కరించి ఉచితాసనము మీద కూర్చున్నారు అందరూ రావణుని వంక చూస్తూ రావణుడు ఏమి చెబుతాడా అని ఎదురుచూస్తున్నారు.
రాక్షస సభలో ఉన్న రావణుడు ఇంద్రసభలో ఉన్న దేవేంద్రుని మాదిరి ప్రకాశించాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment