శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పన్నెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 12)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

పన్నెండవ సర్గ

రాబోవు యుద్ధములో సదా విజయమును కాంక్షించు రావణుడు ప్రహస్తుని చూచి ఇలా అన్నాడు. "ప్రహస్తా! ప్రస్తుతము మనం యుద్ధవాతావరణంలో ఉన్నాము. నగరంలో కాపలా కట్టుదిట్టం చేయండి. సైనికులను సర్వసన్నద్ధంచేయండి." అని ఆదేశించాడు. ప్రహస్తుడు రావణుని ఆజ్ఞను అమలుపరిచాడు. తరువాత రావణుడు మంత్రులను సేనాపతులను చూచి ఇలా అన్నాడు.

"ధర్మము, అర్ధము, కామము వీటి గురించి సంఘర్షణ తలెత్తినపుడు, మనకు ఏది మంచిదో, ఏది చెడో, ఏది ప్రియమో, ఏది అప్రియమో, ఏది లాభమో, ఏది నష్టమో, నిర్ణయించడంలో మీరందరూ సమర్ధులు. మీరు మంత్రాంగము చేసి చెప్పిన ఆలోచనలు ఏనాడూ వృధాకాలేదు. నాకు విజయాన్ని సంపాదించి పెట్టాయి. రాముడు లంకను ముట్టడించడానికి వస్తున్న విషయము కుంభకర్ణునికి ఇంతవరకూ తెలియపరచలేదు. కుంభకర్ణుడు నిద్రలో ఉండటం వలన ఈ విషయాలు ఏమీ అతనికి తెలియవు. ఆరుమాసముల నిద్ర తరువాత కుంభకర్ణుడు నిద్రలేచే సమయము ఆసన్నమయింది.

నేను, రాముని భార్య సీతను మన రాక్షసుల స్థావరమైన దండకారణ్యములోని జనస్థానము నుండి తీసుకొని వచ్చాను. సీత వంటి సౌందర్యవతి మూడులోకములలోనూ లేదు అన్నది నిర్వివాదాంశము. కాని సీత నాకు లొంగలేదు. నాతో పక్కను పంచుకొనడానికి అంగీకరించడం లేదు. సీత ప్రతి అంగమూ అందంగా, శోభాయమానంగా ఉంటుంది. అందుకే ఆమె అంటే నాకు మక్కువ. నాకు ఆమె మృదువైన పాదాలు చూచినా కామం చెలరేగుతుంది. ఇంక సీత ముఖారవిందము చూస్తే చెప్పేదేముంది. నాలో కామం అగ్ని వలె ప్రజ్వరిల్లుతుంది. నాకు కోపం వచ్చినా, శాంతంగా ఉన్నా, సర్వకాల సర్వావస్థలయందూ సీత మీద మోహము నన్ను నిలువనీయడం లేదు. దాదాపు సంవత్సరకాలము నుండి సీత నన్ను వరిస్తుందేమో అని ఎదురుచూచాను. రాముడు యుద్ధానికి వచ్చాడు కానీ సీతలో మార్పు రాలేదు.

రాముడు సముద్రము ఆవల ఉన్నాడు. భయంకరమైన సముద్రమును దాటడం రామునికి సాధ్యం కాదు. కాకపోతే ఒక వానరుని వలన లంక చాలా నష్టపోయింది. ఆ వానరుని రాక గురించి మనకు ముందుగా తెలియక పోవడం వలన ఇంత నష్టం జరిగింది. ఇంకనైనా జాగ్రత్తగా ఉండండి. మీ మీ బుద్ధికి తోచిన సలహాలు ఇవ్వండి. నాకు నరుల వలన వానరుల వలనా ఎలాంటి భయం లేదు. కానీ వారి గురించి కూడా ఆలోచించవలసిన సమయం వచ్చింది. సుగ్రీవుడు రాముని కొరకు తన సేనలతో సముద్రము ఆవలకు వచ్చి ఉన్నాడు. సీతను రామునికి అప్పగించకుండా, రాముని చంపే ఉపాయము గురించి ఆలోచించండి.

ఈ మహాసముద్రమును దాటడానికి కేవలం రాక్షసులకే సాధ్యం అవుతుంది కానీ వానరులకు సాధ్యం కాదు. కాబట్టి జయం మనదే!" అని అన్నాడు రావణుడు.

అప్పుడు ఆ సభలో కూర్చుని ఉన్న కుంభకర్ణుడు లేచి రావణునితో ఇలా అన్నాడు. " ఓ రాక్షసరాజా! నీవు ఇప్పుడు చేస్తున్న మంత్రాంగము, ఆలోచన సీతను అపహరించక ముందు చేసి ఉండవలసినది. అప్పుడు ముందూ వెనుకా ఆలోచించకుండా, నిప్పును తెచ్చి మూటగట్టుకున్నట్టు, సీతను తెచ్చి లంకలో పెట్టి ఇప్పుడు విచారించి ప్రయోజనము ఏమి? నీవు సీతను రాముని వద్దనుండి అపపహరించక ముందు ఈ ఆలోచన చేసి ఉండిన బాగుండేది. ఏ రాజు అయిన న్యాయబద్దంగా ప్రవర్తిస్తే, తరువాత చింతించవలసిన పని ఉండదు. అనాలోచితంగా చేసిన పనులు విపరీత ఫలితాలను ఇస్తాయి. నీతికి అవినీతికి తారతమ్యము తెలియని వాడే ముందు చేయాల్సిన పని వెనుకా, వెనుక చేయాల్సిన పని ముందూ చేసి కష్టాలపాలవుతాడు. మనకే కదా బలం, పరాక్రమము ఉంది కదా అని కాని పనులు చేస్తే సర్వనాశనం తప్పదు.

ప్రస్తుతము నీవు చేయకూడని కార్యము చేసావు. నీ అదృష్టం కొద్దీ నిన్ను రాముడు ఇంకా చంపలేదు. సరే అయినది ఏదో అయింది. మంచో చెడో చేసావు. దానిని గురించి విచారించి ప్రయోజనములేదు. నేను నీ శత్రువులను చంపి నీకు వచ్చిన ఆపదను పోగొడతాను. నిశ్చింతగా ఉండు. మన శత్రువు రాముడే కాదు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యుడు, అగ్ని, కుబేరుడు, వాయువు అయినా సరే నేను వారిని జయిస్తాను.

రాముడు ఒక బాణం వేసి రెండో బాణము తీసేలోపల నేను రాముడి రక్తం తాగుతాను. ముందు రామలక్ష్మణులను చంపుతాను. తరువాత వానరసేనను భక్షిస్తాను. రాముని వలన భయం విడిచిపెట్టు. హాయిగా తిని, తాగి, మదనసుఖములు అనుభవించు. రాముడి చావు వార్త వినగానే సీత నీకు వశమవుతుంది." అని పలికాడు కుంభకర్ణుడు.

( పాఠకులకు ఒక్క మనవి. ఇంతకు ముందే రావణుడు “కుంభకర్ణుని ఆరునెలల నిద్ర అయిపోయినది. అతనిని నిద్రలేపండి." అని ఆదేశించాడు. 60వ సర్గలో రాక్షసులు నానాపాట్లు పడి కుంభకర్ణుని నిద్రలేపినట్టు ఉంది. మరి ఈ కుంభకర్ణుడు ఎవరు? రావణుని తమ్ముడు కుంభకర్ణుడు కాడా! కాకపోతే మరెవరు? మరొకడైతే రావణుని ముందు అంత ధైర్యంగా మాట్లాడగలడా! కుంభకర్ణుని మాటలు విని రావణుడు ఊరుకుంటాడా! ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. కాబట్టి కుంభకర్ణుని గురించిన ఈ సర్గ తరువాత చేర్చబడినది అని పెద్దల అభిప్రాయము.)

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)