శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదమూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 13)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పదమూడవ సర్గ
కుంభకర్ణుడు మాట్లాడిన తరువాత మహా పార్శ్వుడు లేచాడు. కుంభకర్ణుని మాటలతో రావణునికి కోపంవచ్చినట్టు గ్రహించాడు. రావణునికి ప్రీతి కలిగించేవిధంగా ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజా! ఎంతో కష్టపడి మధువును సేకరించి దానిని త్రాగకుండా ఎదురుగా పెట్టుకొని చూస్తూ ఉండటం అవివేకము. నీవు అందరికీ ప్రభువు. ఇంక నీకు ప్రభువు ఎవరున్నారు? నిన్ను శాసించే వాళ్లు ఎవరున్నారు? నువ్వు ఎవరికి భయపడాలి? కష్టపడి తెచ్చిన సీతను బలవంతంగానైనా తృప్తిగా అనుభవించు. ఆనందించు. తరువాత వచ్చే పరిణామాలను మేము చూసుకుంటాము. సీత నీకు వంటింటి కుందేలు. నీ చెప్పుచేతలలో ఉంది. నీ కోరిక తీర్చుకో. ఆలస్యం చేయకు. నేను, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు యుద్ధరంగంలో నిలబడితే మాకు ఎదురు నిలిచి పోరాడగల యోధుడు ముల్లోకములలో ఎవరున్నారు. కార్యసాధనకు కొంతమంది సామ, దాన, భేదోపాయములను ఉపయోగిస్తారు. కాని వీరులు దండోపాయమునే ఉపయోగిస్తారు. మనము వీరులము. మనకు దండోపాయమే తరుణోపాయము. నీ శత్రువులను అందరినీ మేము యుద్ధములో అంతమొందిస్తాము. నీవు నిశ్చింతగా ఉండు.” అని వీరోచితంగా పలికాడు మహాపార్శ్వుడు.మహాపార్శ్వుని మాటలకు రావణుడు ఎంతగానో సంతోషిం చాడు. అతనితో రావణుడు ఇలా అన్నాడు. “ఓ మహాపార్శ్వా! నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగా ఉంది. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చిపడింది. అది ఒక రహస్యము. చాలా కాలం కిందట నేను పుంజికస్థల అనే అందమైన అప్సరసను చూచాను. ఆ సమయంలో ఆమె బ్రహ్మలోకానికి వెళుతూ ఉంది. ఆమెను వెంబడించాను. ఆమెను పట్టుకున్నాను. బలవంతంగా అనుభవించాను. ఆమె ఏడుస్తూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లింది. బ్రహ్మదేవునికి జరిగిందంతా చెప్పినట్టుంది. బ్రహ్మదేవుడు నన్ను పిలిపించాడు. “ఇంకమీదట నీవు ఏ స్త్రీనైనా ఆమె అనుమతి లేకుండా, బలవంతంగా అనుభవిస్తే. నీ తల వేయి ముక్కలైపోతుంది. ఇదే నా శాపము." అని దారుణంగా శపించాడు. ఆ కారణంచేత నేను సీతను బలవంతంగా అనుభవించడానికి భయపడుతున్నాను. లేకపోతే నేను సీతను లంకకు తీసుకొని వచ్చినరోజే అనుభవించి ఉండేవాడిని. అందుకే సీత నన్ను వరించే వరకూ ఎదురు చూడక తప్పదు.
రాముడికి నా గురించి, నా వేగము గురించి బాగా తెలియదు. అందుకని, పర్వతగుహలో నిద్రపోవుచున్న సింహము జూలుపట్టుకొని లాగినట్టు నాతో యుద్ధమునకు కాలుదువ్వుతున్నాడు. రాముని నా బాణములకు బలి చేయడం సీతను నేను అనుభవించడం నిజం. రాముడు దేవేంద్రుని గానీ, వరుణుని గానీ సాయం తెచ్చుకున్నా నేను రాముని జయించి తీరుతాను. నేను కుబేరుని యుద్ధములో ఓడించి లంకానగరమును ఆక్రమించుకున్నానన్న సంగతి రామునికి తెలియదు." అని గర్వంతో పలికాడు రావణుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment