శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదునాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 14)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పదునాలుగవ సర్గ
వీళ్ల మాటలన్నీ ఓపిగ్గా వింటున్నాడు విభీషణుడు. తరువాత విభీషణుడు లేచి ఇలా అన్నాడు."రాక్షసరాజా! వీళ్లంతా కలిసి సీత అనే మహాసర్పమును నీ మెడకు చుడుతున్నారు. వానరులు సముద్రమును దాటి లంకను ముట్టడించక ముందే సీతను రాముని వద్దకు పంపించు. రాముడి వింటి నుండి వెలువడ్డ బాణములు రాక్షసుల కంఠములు ఉత్తరించకముందే సీతను రాముని వద్దకు పంపించు. నీవు ఎవరి అండచూచుకొని ఈ యుద్ధానికి దిగుతున్నావో ఆ కుంభకర్ణుడు, మహాపార్శ్వుడు, ఇంద్రజిత్తు, మహోదరుడు, నికుంభుడు, కుంభుడు, అతికాయుడు వీరెవ్వరూ యుద్ధములో రాముని ముందు నిలువలేరు. నిన్ను రాముని బాణము తరుముతుంటే అప్పుడు ఇంద్రుడు, సూర్యుడు, మరుత్తులు, యముడు వీరెవ్వరూ నీ మొర ఆలకింపరు. కాబట్టి సీతను రాముని వద్దకు పంపు. రామునితో యుద్ధము నివారించు." అని పలికాడు విభీషణుడు.
వెంటనే ప్రహస్తుడు లేచాడు. "రాక్షసరాజా! మాకు ఇప్పటి వరకూ భయము అనే మాటకు అర్ధము తెలియదు. దేవ, దానవ, గంధర్వులు, నాగులు ఎవరి వల్ల కానీ మాకు ఎలాంటి భయమూ లేదు. అటువంటిది ఒక నరుని వలన, వానరుల వలన మాకు భయం ఎందుకుంటుంది." అని అన్నాడు.
ఆ మాటలకు విభీషణుడు దీటుగా జవాబు ఇచ్చాడు.
“ఓ ప్రహస్తా! నీవు చెప్పినట్టు చేస్తే, మనకు యమలోక ప్రయాణము తప్పదు. రాముడు ధర్మము తప్పని వాడు. మీరు ధర్మము తెలియని వారు. ధర్మము తప్పని రాముని ముందు దేవతలు కూడా తలెత్తి నిలబడలేరు. దేవతలు మనకు భయపడతారు. రాముని గౌరవిస్తారు.
ఓ ప్రహస్తా! నీకు రామ బాణముల రుచి తెలియదు. అందుకని ఇటువంటి ప్రగల్భములు పలుకుతున్నావు. రాముడు రణరంగములో నిలిస్తే నీవూ, ఇంద్రజిత్తూ, నికుంభుడు, త్రిశీర్షుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, అకంపనుడు ఎవరూ ఎదిరించి నిలువలేరు. ఇంక ఈ వ్యసనపరుడైన రావణుడు ఎంత?
వ్యసనలోలుడు, ఆలోచనా రహితంగా పనులు చేసేవాడు అయిన ఈ రావణుడు చేసే ప్రతి పనీ మీరు పొగుడుతూ తలలు ఊపుతున్నారు. రావణుని వినాశనానికి పునాది వేస్తున్నారు. మీకు రాజుకు హితము చెప్పడం, మంచి చేయడం చేతకాదు. ఇప్పటికైనా మించి పోలేదు. మీ రాజును మంచి దారిలో, సరి అయిన దారిలో నడిపించండి. లంకను రక్షించండి. ఇప్పటి దాకా మీరందరూ రావణుడు చేసే అకృత్యము లను పొగిడి లబ్ధిపొందారు. ఇప్పటికైనా రావణునికి హితబోధచేయండి. యుద్ధము నివారించండి. మరి కొంతకాలము రావణుని వలన లబ్ధిపొందండి. సుఖాలు, భోగాలు అనుభవించండి.
నేను నా స్వార్ధము కొరకు ఇలా చెప్పడం లేదు. లంక క్షేమము కోరి, రావణుని క్షేమం కోరి, లంకలోని రాక్షసుల క్షేమంకోరి, మీ అందరి సుఖసంతోషాలు కాపాడటానికి ఈ హితబోధ చేస్తున్నాను. సీతను రాముని వద్దకు పంపండి, యుద్ధము నివారించండి. లంకను కాపాడండి. మరొక్క మాట. తన బలమును, ఎదుటి వారి బలమును ఎరింగి, మనకు ఉన్న కష్ట నష్టములను పరిశీలించి, రాజుకు తగిన హితమును చెప్పువాడే ఉత్తముడు అయిన మంత్రి. మీరు ఉత్తములైన మంత్రులో కాదో మీరే తేల్చుకోండి. ” అని చెప్పి కూర్చున్నాడు విభీషణుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదునాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment