శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదునైదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 15)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

పదునైదవ సర్గ

విభీషణుడు పలికిన పలుకులకు ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు. “చిన్నాన్నా! ఏమిటి మీరు మాట్లాడేది? తెలివి ఉండే మాట్లాడుతున్నారా! రాక్షసకులములో పుట్టినవాడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి! ఒక సామాన్య కులంలో పుట్టిన వాడు కూడా ఇంత పిరికి మాటలు మాట్లాడడు. మీకు ఈ పిరికి తనం ఎలా వచ్చింది? ఉన్నతమైన మన రాక్షస కులంలో ఇంత పిరికివాడు, బలహీనుడు, వీరత్వము లేనివాడు, పరాక్రమము, ధైర్యము, శౌర్యము లేని వాడు మీరొక్కరే కనపడుతున్నారు. లేకపోతే మానవాధములకు భయపడతారా!

ఈ రాముడు, లక్ష్మణుడు రాజకుమారులు, మనుష్యులు. లంకలో పుట్టిన ఒక సామాన్య రాక్షసుడు కూడా వారిని చంపగలడు. ఆ సంగతి తెలిసి కూడా మమ్ములను ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు? నా సంగతి మీకు తెలియదా! నేను దేవేంద్రుని జయించిన వీరుడను. నా పరాక్రమానికి జడిసి దేవతలందరూ తలొకదిక్కుకు పారిపోయారు. నేను ఐరావతమును కింద పడదోసి, దాని దంతములు పీకిన వీరుడను. దైత్యులు కూడా నాకు భయపడతారు. అంతటి పరాక్రమవంతుడనైన నేను సామాన్య మానవులను, వారి వెంట వచ్చిన వానరులను ఓడించలేనా! ఇద్దరు రాజ కుమారులకు నేను భయపడాలా! సిగ్గుచేటు." అని కూర్చున్నాడు.

ఇంద్రజిత్తు మాటలు విన్న విభీషణుడు మరలా ఇలా అన్నాడు. “రాకుమారా! నీవు వయసులో చిన్నవాడవు. ఉడుకు రక్తంలో ఉప్పొంగిపోతున్నావు. నీ బుద్ధి ఇంకా వికసించలేదు. నీకు పూర్వాపరాలు తెలియవు. నీకు మంత్రాంగము గురించి తెలియదు. అందుకే ఆవేశంతో వినాశనానికి దారి వెతుకుతున్నావు. అర్ధం లేకుండా మాట్లాడుతున్నావు. నీవు నీ తండ్రి క్షేమం కోరిమాట్లాడటం లేదు. ఆయనకు ఒక శత్రువుగా యుద్ధానికి పురికొల్పుతున్నావు. నీకు ఆవేశము, సాహసము ఎక్కువ. అటువంటివాడిని మంత్రాంగము చేయునపుడు అనుమతించడం తప్పు. నీకు మౌఢ్యము ఎక్కువ. తెలివితో ఆలోచించడం తెలియదు. నీకు ఆవేశం తప్ప ఆలోచన తెలియదు. నీకు రామ బాణముల గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. అవి యమదండములతో సమానమైనవి. ఓ రాక్షసేంద్రా! ఈ బాలుని మాటలు పట్టించుకోకు. నా హితము విను. సీతను రాముని వద్దకు పంపు. భార్యాబిడ్డలతో సుఖంగా జీవించు. " అని అన్నాడు విభీషణుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)