శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 5)
శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఐదవ సర్గ విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము." అని అన్నాడు. లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు. తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రా...