శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 40)
శ్రీమద్రామాయణము యుద్ధకాండము నలుబదవ సర్గ (ఈ సర్గ వాల్మీకి రామాయణంలోనిది కాదని, తరువాతి కాలంలో ఎవరో ఉత్సాహవంతుడైన కవి కల్పించి చేర్చినది అనీ, ఈ సర్గ ప్రాచ్చపాఠంలో లేదని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ రామాయణ మహా కావ్యము బాలనందినీ వ్యాఖ్యలో అభిప్రాయ పడ్డారు.) రాముడు, సుగ్రీవునితోనూ, వానర సేనాధిపతులతోనూ సువేల పర్వతము మీద ఎక్కాడు. అక్కడి నుండి అన్ని దిక్కుల వంక చూచాడు. విశాలమైన త్రికూట పర్వత శిఖరము మీద నిర్మింపబడిన లంకా నగరాన్ని చూచాడు. దూరంగా కనిపిస్తున్న లంకా నగరంలో రావణుడు, ఎత్తైన తన మందిరం పైన కూర్చుని ఉండటం రాముడు చూచాడు. రావణుని ఇరు పక్కల సుందరీమణులు నిలబడి వింజామరలు వీస్తున్నారు. రావణుని తల మీద విజయ ఛత్రము శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. రావణుడు ఎర్రని చందనము పూసుకొని ఉన్నాడు. ఐరావతము పొడిచిన దంతపు పోట్లు రావణుని వక్షస్థలము మీద కనిపిస్తున్నాయి. అటువంటి రావణుని సుగ్రీవుడు చూచాడు. సుగ్రీవుని కోపం తారస్థాయికి చేరుకుంది. దిగ్గున పైకి లేచాడు. సువేల పర్వతము మీది నుండి రావణుని మందిరము మీదికి దూకాడు. రావణుని ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు. “ఓరి రాక్షసాధమా! నేను ముల్లోకములకు ప్రభువైన రాముని ...