శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 27)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఇరువది ఏడవ సర్గ

సారణుడు వానర యూధముల గురించి ఇంకా చెప్పసాగాడు. "ఓ రాక్షన రాజా! రాముని కొరకు తమ ప్రాణములను కూడా లెక్కచేయకుండా యుద్ధము చేయడం కోసం ఉరకలు వేస్తున్న వానర నాయకుల గురించి ఇంకా చెబుతాను విను. నున్నటి తోకతో, ఒళ్లంతా ఎర్రటి, పచ్చటి, తెల్లటి రోమములు విస్తారముగా కలిగిన ఆ వానర నాయకుని పేరు హరి. అతని వెంట వందల కొద్దీ వానరులు ఉన్నారు. వారందరూ సుగ్రీవుని నాయకత్వంలో రాక్షసులతో యుద్ధానికి కాలుదువుతున్నారు.

అదుగో అటు చూడు. నల్లని మేఘముల వలె కనపడుచున్నది భల్లూకసేన. సముద్రము నల్లగా ఉంటే ఈ భల్లూక సేనకూడా నల్లగా మరొక సముద్రంలా ఉంది. వీరందరూ పర్వత ప్రాంతముల నుండీ, సమతల భూముల నుండి, మరి కొందరు నదీతీరముల నుండీ వచ్చారు. వీరంతా చాలా భయంకరంగా యుద్ధం చేయడంలో నిపుణులు. ఈ భల్లూకములకు నాయకుడు ధూమ్రుడు. ఇతడు నర్మదా నదీ తీరంలో ఉన్న ఋక్షవంతము అనే పర్వతము మీద ఉంటాడు. ఆ పక్కనే ఉన్న వాడు ధూమ్రుని తమ్ముడు. ఇద్దరూ ఒకే రూపంలో ఉన్నారు కదూ. ఇతడు అన్నకంటే పరాక్రమ వంతుడు. ఇతని వెంట కూడా ఎన్నో భల్లూక సేనలు ఉన్నాయి. భల్లూకములలోకి అంతటికీ వృద్ధుడు జాంబవంతుడు. ఇతని వెంట అపారమైన భల్లూకసేన ఉంది. జాంబవంతునికి పరాక్రమము దానికి తగ్గ వినయము రెండూ ఉన్నాయి. ఈ జాంబవంతుడే దేవాసుర యుద్ధములో దేవేంద్రుని పక్షమున అసురులతో పోరాడి, దేవేంద్రుని వలన వరములను పొందాడు. జాంబవంతుని సేనలో ఉన్న భల్లూకములు పెద్ద పెద్ద పర్వతముల మీద ఉండి, బండరాళ్లను కింద ఉన్న శత్రువుల మీదికి విసిరి చంపడంలో ఆరితేరినవారు. వీరికి చావంటే భయం లేదు.

వానర సేనలో మరొక ముఖ్యుడు దంభుడు అనే వానరసేనా నాయకుడు. దేవేంద్రుడు కూడా అప్పుడప్పుడు ఇతని సాయం తీసుకుంటూ ఉంటాడు. ఇతడు వానరులకు సర్వసేనాని. అందరి కన్నా ఎత్తుగా ఉన్న ఆ వానరనాయకుని చూడండి. అతని పేరు. సంనాదుడు. అతడు వానరుల
కందరికీ పితామహుడి లాంటి వాడు. అతడు ఒక గంధర్వ కన్యకు అగ్నిదేవుని వలన పుట్టినవాడు. అగ్నివలె తేజోవంతుడు. ఇతడు యుద్ధములో దేవేంద్రునితో కూడా యుద్ధం చేసాడు. మరొక వాన సేనాని పేరు క్రథనుడు. ఇతడు కైలాస పర్వతము మీది నుండి వచ్చాడు. కైలాస పర్వతము అతని స్థావరము. ఇతనికి వెయ్యికోట్ల వానరసైన్యము ఉంది. అతడు ఒక్కడు చాలు లంకా నగరమును నాశనం చెయ్యడానికి. పూర్వము వానరములకు ఏనుగులకు వైరం ఉండేదట. ఈ వానర నాయకుడు గంగా నదీ ప్రాంతములో ఉన్న ఉశీరబీజ పర్వతము, మంధర పర్వతము యొక్క గుహలలో నివసిస్తూ ఏనుగులను భయపెట్టేవాడట. దొరికిన ఏనుగును దొరికినట్టు చంపే వాడట. వాడు కూడా తన వేయి లక్షల వానరములతో ఈ యుద్దములో పాల్గొనడానికి వచ్చాడు. ఏనుగులను చంపేవాడికి మన రాక్షసులు ఒక లెక్కా! ఇంతకూ ఇతని పేరు చెప్పలేదు కదూ! ఇతని పేరు ప్రమాథి. అదుగో అక్కడ మేఘము మాదిరి ఎగురుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. అతని చుట్టు ఉన్నదే అతని సైన్యము.

రాక్షసరాజా! మరొక జాతి వానరములు కనపడుతున్నాయి చూడండి. నల్లని ముఖములతో భయంకరంగా ఉన్నాయి. వాటి పేరు గోలాంగూలులు. వాటికి నాయకుడు గవాక్షుడు. అతని సేన వంద లక్షలు ఉంటుంది. లంకను ఎప్పుడెప్పుడు నంచుకు తిందామా అని గర్జిస్తున్నారు
ఆ వానరులు.

ఓ రాక్షసేంద్రా! వానర నాయకులలో ముఖ్యుడు కేసరి. మీరు ఎవడి తోకకు నిప్పంటిస్తే, అతడు మన లంకనే తగలబెట్టాడే ఆ ఘనుడు, హనుమంతుని తండ్రి ఈ కేసరి. ఇతడు మేరుపర్వతము మీద నివసిస్తూ ఉంటాడు. మేరు పర్వతము ప్రాంతములో ఉన్న అరవైవేల బంగారు పర్వతములలో ఆఖరి పర్వతము మీద కొన్ని వానరములు నివసిస్తూ ఉంటాయి. ఆ వానరములు నల్లగానూ తెల్లగానూ,ఎర్రటి ముఖములతో, పెద్ద ఆకారాలతో ఉంటాయి. వీరు అత్యంత వేగంగా పరుగెత్తగలరు. వీళ్లకు తమ గోళ్లు, కోరలే ఆయుధములు. వీరు పెద్ద పులుల మాదిరి భయంకరులు.
మరొక వానర నాయకుని పేరు శతబలి. ఇతడు సూర్యదేవుని ఉపాసకుడు. ఇతని వెంట కూడా అపారమైన వానర సేన ఉంది. రాముని కొరకు తన ప్రాణములను కూడా లెక్కచెయ్యని వీరుడు శతబలి. వీరు కాక, గజుడు, గవయుడు, నలుడు, నీలుడు, ఒక్కొక్కరు కోట్లకొలది వానరులతో వచ్చి ఉన్నారు. ఇంకా వింధ్యపర్వత ప్రాంతములనుండి లెక్కకు మిక్కిలి వానరములు వచ్చి ఉన్నవి. వీరిని లెక్కించడం మాకు శక్యం కాలేదు. వీరిలో ఎవరూ సామాన్యులుకారు. అందరూ మహాపరాక్రమవంతులు. వీరిని గెలవడం అంత సులభం కాదు.” అని చెప్పి ఊరుకున్నాడు సారణుడు.

తరువాత శుకుడు తన అభిప్రాయము కూడా చెప్ప నారంభించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)