శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 26)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఇరువది ఆరవ సర్గ
ఇంత మంది ఇన్ని సార్లు ఇన్ని మాటలు చెప్పినా రావణుడు తన మూర్ఖపు పట్టుదల విడువ లేదు.“ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. దేవ, దానవ, గంధర్వ, యక్షులు ఒక్కుమ్మడిగా నా మీదికి వచ్చినా, నేను సీతను విడువను. మీరు ఇద్దరూ వానరుల చేతిలో దెబ్బలు తిని బాగా భయపడినట్టున్నారు. అందుకే భయంతో ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఎవరిని చూచినా భయం లేదు. నన్ను ఎవరూ ఓడించలేరు. ఇంతకూ రాముని సైన్యము పరిమాణము ఎంత? వారు ఎక్కడ ఉన్నారు. నాకు చూపించండి." అని అన్నాడు రావణుడు.
శుకుడు, సారణుడు రావణుని ఒక ఎత్తైన ప్రాసాదము మీదికి తీసుకొని వెళ్లారు. అక్కడ ముగ్గురు నిలబడ్డారు. అక్కడి నుండి వానర సైన్యము సుస్పష్టంగా కనపడుతూ ఉంది. వానర సేన భూమి అంతా కప్పినట్టు ఉంది. అసలు భూమి కనిపించడం లేదు. పూర్తిగా వానరులతో నిండిపోయినట్టు ఉంది. రావణునికి వానర సేన మరొక సముద్రం లాగా కనిపిస్తూ ఉంది.
రావణుడు సారణుని చూచి ఇలా అన్నాడు. "ఆ కనిపిస్తున్న వానర సేనలో ముఖ్యమైన వారు ఎవరు? బలవంతులు, శూరులు, పరాక్రమ వంతులు ఎవరు? ముందు నిలిచి యుద్ధము చేసే వాళ్లు ఎవరు? సుగ్రీవుడు ఎవరి మాట వింటాడు? సేనానాయకులు ఎవరు? వీళ్లు సాధారణ వానరులా! వీరి ప్రభావము ఎంత? ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పు.” అని అడిగాడు రావణుడు.
సారణుడు ఇలా చెప్పసాగాడు. “రాక్షస రాజా! అటు చూడండి. లక్ష మంది వానర నాయకులు చుట్టు ఉండగా లంక వంక చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడో, వాడి పేరు నీలుడు. వానర సేనానాయకుడు. అతడే సుగ్రీవుని ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అదుగో అక్కడ ఒక వానరుడు చేతులు పైకెత్తి లంక వంక చూస్తూ మాటి మాటి కీ తోకను విదిలిస్తూ కోపంతో మాట్లాడుతున్నాడో వాడి పేరు అంగదుడు. వాలి కుమారుడు. కిష్కింధకు యువరాజు. రాముడి కోసరం ఏమి చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడు. సీతాన్వేషణ కొరకు దక్షిణదిక్కుగా
పంపబడిన వానర సమూహమునకు నాయకుడు ఈ అంగదుడు.
అంగదుని వెనక నిలబడి ఉన్న వాడు నలుడు. అతని ఆధ్యర్యములో అపారమైన సైన్యము నిలిచి ఉంది. నూరుయోజనముల దూరము గల సముద్రమునకు సేతువు ఇతని ఆధ్యర్యములోనే నిర్మింపబడింది. ఈ నలుడు చందన వనములో ఉంటాడు. ఇతని కింద వెయ్యికోట్ల ఎనిమిది లక్షల వానములు ఉన్నాయి. వారంతా భయంకరమైన వానరములు. ఈ సేనలతో లంకను నాశనం చెయ్యడానికి నలుడు అభిలషిస్తున్నాడు. వెండి మాదిరి తెల్లని శరీరంతో మెరిసిపోతున్నవాడు, మహాపరాక్రమ వంతుడు శ్వేతుడు అనే వానరుడు సుగ్రీవునితో మాట్లాడి మరలా వెళుతున్నాడు. గోమతీ నదీ ప్రాంతంలో రమ్య అనే పర్వతము ఉంది. ఆ ప్రాంతములో ఉండే వానరములకు అధిపతి కుముదుడు. అతడు లక్షలకొలదీ వానరములకు నాయకుడు. తానొక్కడే తన సేనలతో లంకను ముట్టడిద్దామని ఉత్సాహపడుతున్నాడు.
ఓ రాక్షస రాజా! ఎరుపు తెలుపు కల శరీర ఛాయతో, ముఖమంతా జూలుతో, సింహము వలె కనపడుతున్న వాడు రంభుడు. అతడు లక్ష వానరములతో వింధ్యపర్వతము, కృష్ణగిరి, సహ్యాద్రి, సుదర్శనము మొదలగు పర్వతముల మీద నివసిస్తూ ఉంటాడు. వీరు భయంకరమైన వానరులు. ఆ పక్కన ఉన్న వాడు శరభుడు. వీడికి ఎవరన్నా లెక్కలేదు. చివరకు మృత్యువుకుకూడా భయపడడు. ఇతడు సాల్వేయ పర్వతము మీద నివసిస్తూ ఉంటాడు. ఇతని కింద విహారులు అనే పేరు గల లక్ష వానరములు ఉన్నాయి. వీరు చాలా బలవంతులు. పారి యాత్ర అనే పర్వతము మీద నివసించే వానరుడు పనసుడు యాభై లక్షల మంది వానరములకు ఇతడు నాయకుడు. ఆ యాభై లక్షల మందిని ఇతడు వివిధ యూధములుగా విభజించి వాటికి ప్రత్యేకంగా సేనానాయకులను నియమించాడు. వారందరూ ఈ పనసుని ఆజ్ఞలను జవదాటరు.
ఆ సముద్రము పక్కన రెండవ సముద్రము మాదిరి కదులుతున్న సేనలకు నాయకుడు వినతుడు. ఇతడు వేణీ నదీ తీరంనుండి వచ్చాడు.(వేణీ అంటే క్రిష్ణవేణి అనగా క్రిష్ణానది అని
అభిప్రాయము) ఇతడు అరువది లక్ష్లల మంది వానరులకు నాయకుడు. తరువాత క్రధనుడు అనే వానర నాయకుడు తన సైన్యమును వివిధ వ్యూహములుగా విభజించాడు. వారందరూ యుద్ధోన్మాదంతో ఊగి పోతున్నారు. గవయుడు అనే వానరుడు బలగర్వితుడు. ఇతని కింద డెబ్బది లక్షల వానరములు ఉన్నాయి. వీరంతా తమ తమ సైనిక సమూహములతో నీ మీద యుద్ధానికి ఉవ్విళ్లూరుతున్నారు." అని పలికాడు సారణుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment