శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 25)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఇరువది ఐదవ సర్గ
తరువాత రావణుడు ఇద్దరు గూఢచారులను పిలిపించాడు. రావణుడు పిలిపించిన గూఢచారుల పేర్లు శుకుడు, సారణుడు. రావణుడు వారితో ఇలా అన్నాడు. “రాముడు వానర సైన్యముతో సముద్రము దాటినాడు అని వార్త వచ్చింది. ఇదివరలో ఎవరూ చేయజాలని సేతువును రాముడు నిర్మింపజేసాడు.రాముడు వానరులతో నూరుయోజనముల దూరము సేతువును నిర్మించాడు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంతకూ వానరుల బలము ఎంత అని మనం ముందు తెలుసుకోవాలి. వారి యుద్ధ వ్యూహములను తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఇద్దరూ కోటదాటి వెళ్లండి. వానర రూపములతో వానరసేనలలో కలిసిపోండి. వానర సేన ఎంత ఉంది. వారి నాయకులు ఎవరు. ఎవరి దగ్గర ఎంతెంతమంది వానర సేన ఉంది. సముద్రము మీద సేతువును నిర్మించిన వారు ఎవరు. ఎవరి సాయంతో నిర్మించారు. సుగ్రీవునితో ఉన్న మంత్రులు ఎవరు. ఎంత మంది. వానర సేనలకు ముఖ్య సేనాని ఎవరు? వానర సేనలో ముందు నిలిచి యుద్ధం చేసే వారు ఎవరు. వానర సేన ఉపయోగించే ప్రధాన ఆయుధములు ఏవి? నాకు ఈ సమాచారమును వెంటనే సేకరించి తెలియపరచండి." అని ఆదేశించాడు.
రావణుని ఆదేశము ప్రకారము శుకుడు, సారణుడు వానర రూపములను ధరించి వానర సేనలలో ప్రవేశించారు. వారు వానర సేనలను లెక్కబెట్టడానికి ప్రయత్నం చేసారు కానీ వారి వల్ల కాలేదు. వారు ఎక్కడకు పోయినా వానర సైన్యము కనపడుతున్నారు. కొండలు గుట్టలు,పర్వతములు, అడవులు, చెట్లు ఒకటేమిటి నేల ఈనినట్టు ఎక్కడ చూచినా వానర సైన్యము కనపడుతున్నారు. సముద్రము మాదిరి కనపడుతున్న వానర సేనను చూచి శుకసారణులు ఆశ్చర్యపోయారు. వానరులు వీరిని కనిపెట్టలేకపోయారు.
కానీ రాక్షస మాయలు తెలిసిన విభీషణుడు వానర వేషములలో ఉన్న శుకసారణులను సులభంగా కనిపెట్టాడు, వారిని పట్టుకొని రాముని వద్దకు తీసుకొని వచ్చాడు. “రామా! వీరు ఇద్దరూ
రావణుని గూఢచారులు. రావణుడు పంపగా వచ్చారు. వీరి పేరు శుకుడు, సారణుడు. వీరిని వెంటనే చంపమని ఆజ్ఞాపించు." అని అన్నాడు.
అప్పటికే శుకుడు సారణుడు ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. చేతులు జోడించి రామునితో ఇలా అన్నారు. "మేము రావణుని గూఢచారులము. వానర సైన్య రహస్యములను తెలుసుకోడానికి మేము రావణుడు పంపగా ఇక్కడకు వచ్చాము.” అని వారి తప్పు ఒప్పుకున్నారు.
వారిని చూచి రాముడు నవ్వాడు. "మీరు వచ్చిన పని పూర్తి అయిందా. వానర సేనలను అంతా చూచారా. నన్ను కూడా చూచారా. ఇంక వెళ్లండి. మీ రాజుకు మా గురించి మా సేన గురించి చెప్పండి. మీరు ఇంకా చూడవలసినది ఏమన్నా ఉంటే చూడండి. మీకు తెలియక పోతే మీ రాజు విభీషణుడు మీకు అన్నీ చూపిస్తాడు. హాయిగా చూడండి. మీ ప్రాణములకు వచ్చిన భయం ఏమీ లేదు. మీరు మాకు దూతలుగా వచ్చారు. దూతలను మేము ఎప్పుడూ చంపము. విభీషణా! మనము మన శత్రువులను చంపాలి కానీ మారువేషములలో వచ్చిన గూఢచారులను చంపకూడదు. వీరు వారి రాజు ఆజ్ఞపాలించారు. ఇందులో వీరితప్పు ఏమీ లేదు కదా! కాబట్టి వీరిద్దరినీ విడిచిపెట్టండి.
ఓ శుకసారణులారా! మీరు ఇద్దరూ లంకకు పోయి మీ రాజు రావణునితో నా మాటలుగా ఇలా చెప్పండి. “ఓ రావణా! మేము నీ మీదికి యుద్ధానికి వచ్చాము. నువ్వు ఏ బలం చూచుకొని నా భార్య సీతను అపహరించావో, ఆ బలాన్ని ఇప్పుడు నా ముందు చూపించు. యుద్ధమునకు రేపు ఉదయము ముహూర్తము నిశ్చయించాము. రేపు ఉదయముననే మేము నీ లంకా నగరమును ముట్టడించి, నువ్వు చూస్తూ ఉండగానే, నీ సైన్యములను నా బాణములతో చించి చెండాడతాను.”
ఇవి నా మాటలుగా రావణునితో చెప్పండి. ఇంక వెళ్లండి.” అన్నాడు రాముడు.
ఇవి నా మాటలుగా రావణునితో చెప్పండి. ఇంక వెళ్లండి.” అన్నాడు రాముడు.
శుక సారణులు విడిచిపెట్టిందే చాలని లంకకు పారిపోయారు. రావణుని ముందు నిలిచి “ఓ రాక్షసేంద్రా! మీరు ఆదేశించినట్టు మేము మారువేషములలో వానర సైన్యములో చేరాము. కానీ విభీషణుడు మా మారువేషములను కనిపెట్టి, మమ్ములను చంపబోగా, రాముడు మాకు ప్రాణభిక్ష పెట్టాడు. రాక్షస రాజా! వానర సేన సముద్రము అంత ఉంది. అది అటుండనిమ్ము. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు, ఈ నలుగురూ చాలు మన లంకానగరమును నాశనం చెయ్యడానికి. ఇంక వానర వీరులు కూడా విజృంభిస్తే లంక వల్లకాడు అవుతుంది. రాముడు ఒక్కడే చాలు నిన్ను నీ లంకను మట్టుపెట్టడానికి. సుగ్రీవుని ఆధ్వర్యములో ఉన్న వానర సేనను జయించడం ఎవరి వల్లా కాదు. కాబట్టి మా విన్నపము ఏమిటంటే తమరు వెంటనే సీతను రామునికి ఇచ్చి వేసి, రామునితో సంధి చేసుకోవలెను. లంకను రక్షించవలెను." అని పలికి ఊరుకున్నారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment