శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 24)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఇరువది నాలుగవ సర్గ

రాముని వెంట వెడుతున్న వానర సేన పాదఘట్టనలకు భూమి అదురుతూ ఉంది. లంక బయట ఇలా ఉంటే, లంకా నగరంలో కూడా రాక్షస సేనలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. రాక్షస సేనలు చేసే సింహనాదాలు, భేరీమృదంగ ధ్వనులు లంక బయట ఉన్న వానర సేనలకు వినబడుతున్నాయి. వానర సేనలు కూడా వాటికి మించిన ధ్వనులు చేస్తున్నారు. దూరం నుండి లంకా పట్టణమును చూచిన రామునికి సీత గుర్తుకు వచ్చింది.

“ఆహా! నా సీత ఈ లంకా నగరంలోనే కదా బంధింపబడి ఉంది!" అని మనసులో అనుకున్నాడు.  పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. "లక్ష్మణా! ఆ పర్వత శిఖరము మీద విశ్వకర్మచేత నిర్మింపబడిన ఆ కాంచన లంకను చూచావా! ఆ లంకా నగరము ఆకాశాన్ని తాకుతూ ఉన్నదా అన్నట్టు లేదూ! ఎంతో కాలము కిందట నిర్మింపబడిన ఈ లంకా నగరము ఎత్తైన భవనములతో అత్యంత శోభాయమానముగా ఉంది." అని అన్నాడు.

తరువాత రాముడు వానర సేనలను వ్యూహములుగా విభజించాడు. గరుడ వ్యూహాకారంరలో సేనలను నిలబెట్టాడు. సేనలకు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చాడు. "అంగదుడు తన సేనలతో, ఈ గరుడవ్యూహమునకు వక్షస్థల భాగమున నిలువ వలెను. ఋషభుడు తన సేనలతో ఈ గరుడ వ్యూహమునకు కుడి వైపున ఉన్న రెక్క భాగములో నిలువ వలెను. గంధమాధనుడు తనసైన్యములతో గరుడవ్యూహమునకు ఎడమ వైపున ఉన్న రెక్క భాగములో నిలువవలెను. నేను లక్ష్మణుడు గరుడవ్యూహమునకు శిరస్సుస్థానములో నిలుస్తాము. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి ఈ ముగ్గురూ గరుడవ్యూహమునకు పొట్ట భాగములో నిలుస్తారు. సుగ్రీవుడు తన సేనలతో గరుడ వ్యూహమునకు తోక భాగమును రక్షిస్తూ ఉంటాడు.” అని సమస్త వానర సేనను గరుడవ్యూహంగా రచన చేసాడు రాముడు. వానరు లందరూ ఆ గరుడా కారంలో పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షములు ఆయుధములు ధరించి లంక వైపుకు కదిలారు.

అప్పుడు రాముడు సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు. “సుగ్రీవా! మనము లంకకు చేరుకున్నాము. గరుడ వ్యూహరచన పూర్తి అయింది. ఇంక నీ అధీనములలో ఉన్న శుకుడు అనే రాక్షన దూతను విడిపించు.” అని అన్నాడు. 

రాముని ఆదేశానుసారము సుగ్రీవుడు శుకుడిని విడిపించమని వానరులకు చెప్పాడు. బతుకు జీవుడా అనుకుంటూ శుకుడు రావణుని వద్దకు వెళ్లాడు. దీనంగా ఉన్న శుకుని చూచి రావణుడు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఏంటీ! అలా ఉన్నావు. నీ రెక్కలు విరిగిపోయినట్టున్నాయి. నీవు శత్రువుల చేతికి చిక్కావా!" అని అడిగాడు. అప్పుడు శుకుడు రావణునితో ఇలా అన్నాడు. 

“రాక్షసేంద్రా! నీకు జయమగుగాక! నేను తమరి ఆజ్ఞానుసారము సుగ్రీవుని వద్దకు పోయి తమరు చెప్పమన్న మాటలు యధాతథంగా సౌమ్యంగా చెప్పాను. నన్ను చూడగానే ఆ వానరులు పైకి ఎగిరి నన్ను పట్టుకున్నారు. నన్ను కొడుతూ, గుద్దుతూ కిందికి తీసుకు పోయారు. నారెక్కలు పీకారు. అమ్మో ఆ వానరులు చాలా కోపం కలవారు. వారితో మాట్లాడటం మనకు శక్యంకాదు. కోపం వస్తే వారు ఏమైనా చేస్తారు.

ప్రస్తుతము రాముడు, సుగ్రీవుడు వానరసేనలతో కలిసి, సముద్రము మీద సేతువును నిర్మించి, సముద్రమును దాటి లంకను చేరుకున్నారు. లంకను ముట్టడించారు. భయంకరమైన వానర సేనలు భూమి కనపడకుండా నిలిచి ఉన్నాయి. రాక్షసులకు, వానరులకు దేవ దానవుల మాదిరి యుద్ధము తప్పేట్టు లేదు. వానరులు లంకా నగర ప్రాకారము దగ్గరకు చేరుకుంటున్నారు.

ఓ రాక్షసేంద్రా! ప్రస్తుతము నీకు మిగిలి ఉన్నవి రెండే మార్గములు. ఒకటి సీతను రామునికి ఇచ్చి సంధిచేసుకోవడము. లేకపోతే రామునితో వానర సేనలతో యుద్ధము చేయడం. మొదటిది లంకను రక్షిస్తుంది. రెండవది, లంకను నాశనం చేస్తుంది. నీకు తోచినది చెయ్యి." అని చెప్పి ఊరుకున్నాడు శుకుడు.

శుకుని మాటలు విన్న రావణుడు కోపంతో మండిపడ్డాడు. శుకునితో ఇలా అన్నాడు. “దేవతలు, దానవులు, గంధర్వులు వచ్చి వేడినను నేను సీతను ఇవ్వను. రామునితో యుద్ధము చేస్తాను. నా శరపరంపరతో రాముని గెలుస్తాను. నా విల్లు నుండి వెలువడ్డ బాణములతో రాముని శరీరం ఎప్పుడు రక్తసిక్తము అవుతుందో కదా! నేను అజేయుడను. వానర సైన్యమును క్షణంలో నిర్మూలిస్తాను. నాకు వాయువు అంత బలము, సముద్రము అంత వేగము ఉన్నాయి. పాపం రాముడు నా గురించి పూర్తిగా తెలియక నాతో యుద్ధానికి వస్తున్నాడు. శలభంలా నా కోపాగ్నికి మాడి పోతాడు. రాముడికి నా వద్ద ఉన్న అస్త్రముల గురించి శస్త్రముల గురించి తెలియదు. అందుకే నాతో యుద్ధానికి వస్తున్నాడు. ఇంతకు ముందు రాముడు ఏ యుద్ధములో పాల్గొనలేదు. నేను ఎన్నో యుద్ధములు చేసి రాటు తేలి ఉన్నాను. రాముడు ఎన్నడూ నాతో యుద్ధము చేయలేదు.
అందుకే నా బాణముల రుచి రామునికి తెలియదు. దేవేంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు యుద్ధములో నా ముందు నిలువలేరు. ఇంక ఈ రాముడు ఎంత?” అని గర్వంగా పలికాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)