శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 28)
శ్రీమద్రామాయణము
యుద్ధ కాండము
ఇరువది ఎనిమిదవ సర్గ
సారణుడు చెప్పడం పూర్తిచేసిన తరువాత శుకుడు తాను తెలుసుకున్న విషయాలు చెప్పనారంభించాడు."ఓ రాక్షసరాజా! సారణుడు చెప్పినది అక్షర సత్యము ఈ వానరులు మహాబలవంతులు. ఎవరిచేతా జయింప శక్యము కాని వారు. మన మాదిరే కామరూపులు. వారి ఇష్టం వచ్చిన రూపం ధరించగలరు. ఇందులో దేవతలకు, గంధర్వులకు పుట్టిన వానరులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ సుగ్రీవునితో పాటు కిష్కింధలో నివసిస్తూ ఉంటారు. అందులో అచ్చము దేవతల వలె పోలికలు ఉన్న వానరులు ఇద్దరు ఉన్నారు. వారి పేర్లు మైందుడు, ద్వివిదుడు. వారు ఇద్దరూ అన్నదమ్ములు. యుద్ధములో వారిని ఎదిరించి నిలిచే వారు లేరు. బ్రహ్మదేవుని కృపచేత వారు అమృతము తాగారు. అందుకే అజేయులు అయ్యారు.
ఓ లంకేశ్వరా! ఇదివరకు లంకకు వచ్చి సీతను చూచి లంకా దహనము చేసిన వాడు మరలా వచ్చాడు. వాడి పేరు హనుమంతుడు. కేసరి పుత్రుడు. వాయుదేవునికి ఔరస పుత్రుడు. నూరుయోజనముల దూరము కల సముద్రమును దాటగలిగాడు. అతడు కామ రూపుడు. అత్యంత వేగము కలవాడు. ఈ హనుమంతుడు బాలుని గా ఉన్నప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూచి అది ఫలము అని భ్రమించి దానిని తినుటకు సూర్యమండలము వైపునకు ఎగిరిపోయిన మహాబలవంతుడు. అది చూచి ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టగా ఉదయ పర్వతము మీద పడ్డాడు. అప్పుడు అతని గడ్డమునకు చిన్న దెబ్బ తగిలింది. అందుకే అతనికి హనుమంతుడు అనే పేరు సార్ధకమయింది. ఈ విషయములన్నీ నా ఆప్తుల నుండి సేకరించాను. అతని బల పరాక్రమముల గురించి చెప్పనలవి కాదు. ఈ హనుమంతుడు అంటించిన అగ్ని ఇంకా లంకలో
మండుతూనే ఉంది. అతనిని మనము అంత తొందరగా ఎలా మరిచి పోగలము?
మహారాజా! హనుమంతుని పక్కన ఉన్న నీలమేఘచ్ఛాయ కలవాడు రాముడు. అతడే అయోధ్య రాకుమారుడు. అతడు యోధులలో అతిరథుడు. ఇక్ష్వాకు వంశపు మహారాజు. అతడు ఎల్లప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉంటాడు. అతడికి బ్రహ్మాస్త్రము ప్రయోగము తెలుసు. రాముడు తన బాణములతో ఆకాశమును, భూమిని ఏకం చేయగలడు. వాటి రెండింటినీ చీల్చివేయగలడు. ఆ రాముని భార్యనే నీవు జనస్థానము నుండి అపహరించుకొని వచ్చావు. ఎప్పుడెప్పుడు లంకమీద దండెత్తి, నిన్ను సంహరించి, సీతను దక్కించుకుందామా అని ఉరకలు వేస్తున్నాడు ఆ రాముడు.
ఆ రాముని పక్కనే నిలబడి ఉన్న వాడు లక్ష్మణుడు. అతడు రామునికి తమ్ముడు. మహా పరాక్రమవంతుడు. ఈ లక్ష్మణునికి కోపం ఎక్కువ. కాని బుద్ధిమంతుడు. ఎల్లప్పుడూ జయాభిలాష కలవాడు. రాముని క్షేమం కోరేవాడు. రాముని కోసరం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతడొక్కడే రాక్షసులనందరినీ చంపవలెనని ఎదురు చూస్తున్నాడు.
ఆ రామునికి ఆవల పక్క నిలబడి ఉన్నవాడు తమరి తమ్ముడు విభీషణుడు. అతని చుట్టు వలయంగా నిలబడి ఉన్న నలుగురూ విభీషణుని అనుచరులు అయిన రాక్షసులు. తమరు ఉండగానే, రాముడు తమరి తమ్ముడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసాడు. వారి దృష్టిలో ఇప్పుడు లంకేశ్వరుడు విభీషణుడే! ఆ విభీషణుడు కూడా లంక మీద యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు.
ఇంక ఈ వానర వీరులందరికీ నాయకుడు, కిష్కింధకు రాజు, సుగ్రీవుడు. ఇతడు మహాతేజస్సు కలవాడు. తెలివిగలవాడు. నిరంకుశు డు. అతని మెడలో ఉన్నది దేవతలు వాలికి ఇచ్చిన బంగారు మాల. వాలి మరణించేటప్పుడు ఆ మాలను సుగ్రీవునికి ఇచ్చాడు.
ఓ రాజా! ఇంక వానర వీరుల లెక్కలను చెబుతాను వినండి. వందలక్షలు ఒక కోటి అని అంటారు. అటువంటి కోట్లు లక్ష అయితే శంకువు. అటువంటి శంకువులు వేయి అయితే మహాశంకువు. వెయ్యి మహాశంకువులు ఒక వృందము. అటువంటి వేయి వృందములు ఒక మహావృందము. వెయ్యి మహావృందములు ఒక పద్మము. వెయ్యి మహాపద్మములు ఒక ఖర్వము. వెయ్యి ఖర్వములు మహా ఖర్వము. వెయ్యి మహాఖర్వములు ఒక సముద్రము. వెయ్యి సముద్రములు ఒక ఓఘము. వెయ్యి ఓఘములు ఒక మహౌఘము. ఇదీ పెద్దలు చెప్పిన లెక్క.
ఇప్పుడు వానర సేన ఎంత ఉందంటే వెయ్యి కోట్లు, నూరు శంకువులు, వెయ్యి మహాశంకువులు, నూరు వృందములు, వెయ్యి మహావృందములు, నూరు పద్మములు, వెయ్యి పద్మములు, నూరు ఖర్వములు, నూరు సముద్రములు, ఒక మహౌఘము, కోటి మహౌఘములు సంఖ్యగల వానర సైన్యము నీ మీదికి యుద్ధమునకు వస్తున్నారు. కాబట్టి తమరు మనకు జయము కలిగేట్టు చేయండి." అని వినయంగా చెప్పాడు శుకుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment