శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 29)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఇరువది తొమ్మిదవ సర్గ
రావణుడు శుకుడు సారణుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు. కాని తన ముందు తన శత్రువులను, శత్రుసేనలను పొగడడం సహించలేకపోయాడు. కోపంతో ఉగ్రడయ్యాడు. వారితో ఇలా అన్నాడు.“మీరు నా కింద బతుకుతున్నారు. నా ముందు నాకు అప్రియమైన మాటలు పలకడానికి మీకు నోరు ఎలా వచ్చింది. రాజు ఎదుట రాజుకు ఇష్టము లేని మాటలను పలకడం యుక్తము కాదు అని తెలియదా! శత్రువులు బలవంతులే అయి ఉండవచ్చు అంతమాత్రాన శత్రువును రాజు ముందు పొగుడుతారా! శత్రువును నా ముందు స్తుతిస్తారా! మీరు రాజనీతి నేర్చుకోలేదా! మీ గురువులు రాజనీతి మీకు నేర్పలేదా! లేదా నేర్చుకొని కూడా మీకు అర్థం కాలేదా! లేదా అజ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నారా! మీ లాంటి మూర్ఖులను నా మంత్రులుగా, గూఢచారులుగా పెట్టుకొని ఇంకా నేను బతికి ఉన్నాను అంటే అది నా అదృష్టము కాని వేరు కాదు. నా ఎదుట ఇలా శత్రువును పొగిడినందుకు మీకు మరణ దండన విధించబడును అన్న విషయం మీకు తెలియదా! ఒకసారి నా ఆగ్రహానికి గురి అయిన వాళ్లు ఈలోకంలో బతకడం కల్ల అన్న విషయం కూడా తెలియదా! కాని ఒకే ఒక కారణం చేత మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. మీరు ఇంతవరకూ నాకు, లంకకు చేసిన సేవలను గుర్తు పెట్టుకొని మీ ఇద్దరినీ క్షమించి వదిలిపెడుతున్నాను. జీవితంలో మీ ముఖాలు నాకు చూపించకండి. నా దృష్టిలో మీ ఇద్దరూ చచ్చినట్టే. వెళ్లండి." అని పరుషంగా దూషించాడు రావణుడు. ఆ శుక సారణులు, రావణుని ఆగ్రహానికి గురి అయి కూడా, ప్రాణాలతో బయటపడ్డందుకు సంతోషిస్తూ, రావణునికి జయం పలుకుతూ అక్కడినుండి వెళ్లిపోయారు.
రావణుడు పక్కనే ఉన్న మహోదరుని చూచి “సమర్ధులైన గూఢచారులను పిలిపించు" అని ఆజ్ఞాపించాడు. వెంటనే శార్దూలుడు అనే రాక్షసుడి నాయకత్వంలో కొంతమంది గూఢచారులు వచ్చి రావణుని ముందు తలవంచుకొని నిలబడ్డారు.
“రాముడు అనే నరుడు వానర సేనలతో వచ్చి లంకను ముట్టడించి ఉన్నాడు. మీరు గుప్తంగా ఆ వానర సేనలలో ప్రవేశించి రాముని యుద్ధప్రయత్నములు గురించి తెలుసుకోండి. అతనికి ఎవరు దగ్గరవారు, ఎవరి మాట రాముడు వింటాడు, అతని ఆంతరంగికులు ఎవరు అనే విషయాలు ఆరా తీయండి. రాముని దినచర్య నాకు కావాలి. ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు నిద్రిస్తాడు, దినములో ఎప్పుడు ఏ పని చేస్తాడు. రాముని అలవాట్లు ఏమిటి? ఈ విషయాలన్నీ నాకు కావాలి. మీ లాంటి సమర్ధులైన గూఢచారులు సేకరించిన సమాచారము వలననే రాజులు శత్రువులను సులభంగా జయించగలరు. వెళ్లండి. మీకు అప్పగించిన పని జయప్రదంగా పూర్తిచేసుకొని రండి. " అని ఆజ్ఞాపించాడు రావణుడు.
వెంటనే వాళ్లు కార్యరంగంలోకి దూకారు. వానర సేనలో ప్రవేశించారు. నేరుగా రాముడు ఉన్న ప్రదేశానికి వచ్చారు. సువేల పర్వతము మీద ఉన్న రామలక్ష్మణులను పక్కనే ఉన్న విభీషణ సుగ్రీవులను చూచారు. రామ లక్ష్మణులను, వానర సైన్యమును చూడగానే వాళ్లకు ముచ్చెమటలు పట్టాయి. కాళ్లు తడబడ్డాయి. ఆ తడబాటులో వాళ్లు విభీషణుని కంట బడ్డారు. విభీషణుడు ఆ ఇద్దరినీ రాక్షస గూఢచారులుగా గుర్తుపట్టాడు. వాళ్లను పట్టుకొని రాముని వద్దకు తీసుకొని వచ్చాడు.
వెంటనే వాళ్లు కార్యరంగంలోకి దూకారు. వానర సేనలో ప్రవేశించారు. నేరుగా రాముడు ఉన్న ప్రదేశానికి వచ్చారు. సువేల పర్వతము మీద ఉన్న రామలక్ష్మణులను పక్కనే ఉన్న విభీషణ సుగ్రీవులను చూచారు. రామ లక్ష్మణులను, వానర సైన్యమును చూడగానే వాళ్లకు ముచ్చెమటలు పట్టాయి. కాళ్లు తడబడ్డాయి. ఆ తడబాటులో వాళ్లు విభీషణుని కంట బడ్డారు. విభీషణుడు ఆ ఇద్దరినీ రాక్షస గూఢచారులుగా గుర్తుపట్టాడు. వాళ్లను పట్టుకొని రాముని వద్దకు తీసుకొని వచ్చాడు.
“వీడి పేరు శార్దూలుడు. గూఢచారులకు అధిపతి. వీడు రాక్షసుడు. మారువేషంలో ఉన్నాడు." అని చెప్పాడు విభీషణుడు. ఆ మాటలు విన్న వానరులు, వాడి మీద పడి వాడిని చంపడానికి ప్రయత్నిస్తుంటే రాముడు వారిని వారించాడు. వాడితో పాటు వచ్చిన ఇతర రాక్షస గూఢచారులను కూడా విడిపించాడు రాముడు. శార్దూలుడు కూడా బయటపడిందే చాలు అనుకొని తన అనుచరులతో సహా లంకకు పారిపోయాడు. వెంటనే వారు రావణుని వద్దకు పోయి రాముని సైన్యము సువేల పర్వతము దగ్గర ఉంది అని మాత్రము చెప్పారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment