శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 30)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ముప్పదవ సర్గ

“ఓ రాక్షసేంద్రా! రాముడు తన అపార మైన సేనలతో సువేల పర్వతము మీద ఉన్నాడు." అని శార్దూలుడు రావణునితో చెప్పాడు. ఈ సారి రావణుడు కొంచెం కంగారు పడ్డాడు. కాస్త భయపడ్డాడు. కాని ఆ భయాన్ని బయటకు కనపడనీయలేదు. శార్దూలుడి మొహంలోకి చూచాడు. వాళ్ల మొహంలో సంతోషము ఉత్సాహము లేదు. వీళ్లు కూడా వానరుల చేతిలో తన్నులు తిని వచ్చిఉంటారు అని అనుకున్నాడు. అంత భయంలో కూడా రావణునికి నవ్వు వచ్చింది.

"ఏంటీ! మీ మొహాలు వాడిపోయి ఉన్నాయి. చాలా దీనంగా ఉన్నారు. మీరు కూడా శత్రువులకు పట్టుబడ్డారా!" అని నర్మగర్భంగా అడిగాడు. ఆ మాటలకు శార్దూలుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.

"ఓ రాక్షస రాజా! మన గూఢచర్యము వానర సేన ముందు ఫలించడం లేదు. వారందరూ రాముని అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. కనీసము మాకు రామునితో మాట్లాడటం కూడా కుదర లేదు. వానరుల వలయాన్ని ఛేధించుకొని పోవడం ఎవరికీ సాధ్యం కాదు. మేము వానర సైన్యములో ప్రవేశించగానే విభీషణుడు మమ్ములను గుర్తించాడు. వానరులు మా అందరినీ పట్టుకున్నారు. మమ్ములను కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. మా శరీరాలు రక్తసిక్తం అయ్యాయి. మమ్ములను రాముని ముందు నిలబెట్టారు. మేము రాముని కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాము. రాముడు మాకు క్షమాభిక్ష పెట్టాడు. ఆ కారణం చేత మేము బతికి బయటపడ్డాము.

రాముడు లంక ద్వారమును సమీపించాడు. రాముడు తన సేనలను గరుడవ్యూహాకారంలో నిలిపాడు. వానరులు లంకను నలువైపుల నుండీ చుట్టుముడుతున్నారు. రాముడు లంక ప్రాకారమును దాటి లంకలో ప్రవేశించక ముందే ఏదో ఒకటి చేయండి మహారాజా! సీతను రామునికి అప్పగించండి. లేకపోతే యుద్ధము చేయండి." అని చెప్పి ఊరుకున్నాడు శార్దూలుడు.

"సీతను రామునికి అప్పగించే మాట అటుంచు. మీరు వానరసైన్యములోకి ప్రవేశించారు కదా! ఆ సైన్యములో శూరులు ఎవరు! ఎంత మంది ఉన్నారు? ఏ యే వానరుడు ఎలాంటి ప్రతిభ కలిగి ఉన్నాడు? వారు ఎవరి కుమారులు? వారి పూర్వీకులు ఎవరు? ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు. శత్రువుల బలాబలాలను పరిశీలించిన తరువాత తగు నిర్ణయం తీసుకుంటాను." అని అన్నాడు రావణుడు.

శార్దూలుడు రావణునితో ఇలా చెప్పసాగాడు. “ఓ రాక్షసేంద్రా! వానర సేనలో జాంబవంతుడు అనే భల్లూకరాజు ప్రసిద్ధుడు. ఆయన గద్గదుని కుమారుడు. తరువాత సుగ్రీవుడు కిష్కింధ దేశాధి పతి. ఆయన ఋక్షరజస్సు కుమారుడు. వీరిని జయించడం చాలా కష్టము. గద్గదుని మరొక కుమారుడు ధూముడు అనే వాడు ఉన్నాడు. ఇతడు బృహస్పతి కుమారుడు. ఇతనిని కేసరి అని కూడా అంటారు. ఈ కేసరి కుమారుడే హనుమంతుడు. ఈ హనుమంతుడే నూరుయోజనముల సముద్రము దాటి లంకలో ప్రవేశించి, వేలకొలది రాక్షసులను చంపి, లంకను
దహించిన వాడు.

తరువాత యమధర్మరాజు కుమారుడు సుషేణుడు, చంద్రుని కుమారుడు దధిముఖుడు కూడా ఉన్నారు. సాక్షాత్తు మృత్యుదేవతలను బ్రహ్మ సృష్టించాడా అన్నట్టు సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి వానరసేనలో ఉన్నారు. యుద్ధంలో వారికి ఎదురుపడితే నేరుగా మృత్యు సదనానికి పోవలసిందే! అగ్నిదేవుని కుమారుడు నీలుడు. ఇతను వానర సేనలకు సైన్యాధిపతి. అలాగే వాయుదేవుని కుమారుడు హనుమంతుడు. వాలి గురించి తమకు తెలుసు. వాలి దేవేంద్రుని కుమారుడు. ఆ వాలి కుమారుడు అంగదుడు. మహావీరుడు. బలవంతుడు.

అశ్వినీదేవతల పుత్రులు మైందుడు, ద్వివిదుడు. యముని కుమారులు గజుడు, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గంధమాధనుడు. వారి ఆధ్వర్యంలో కోట్లకొలదీ వానరులు. ఇంక రాముడు వారి మధ్యలో ఉన్నాడు. ఆ రాముడు ఎవరో కాదు. జనస్థానంలో ఖర, దూషణులను, త్రిశిరుడిని చంపిన వాడు. వాళ్లనే కాదు విరాధుడినీ, కబంధుడినీ కూడా చంపాడు ఆ రాముడు. రాముని వంటి వీరుడు పరాక్రమవంతుడు ముల్లోకములలో లేడు. జనస్థానములో ఉన్న 14 వేల మంది రాక్షసులను చంపిన రాముని గురించి మేము తమరికి వేరుగా మీకు చెప్పపనిలేదు. ఎవని బాణములకు పొరపాటున దేవేంద్రుడు అడ్డం వస్తే, ఆ దేవేంద్రుడు కూడా భస్మమైపోతాడో, ఆ మహావీరుడు, లక్షణుడు, రాముడి పక్కనే ఉ న్నాడు.

వారే కాకుండా సూర్యుని కుమారులైన శ్వేతుడు, జ్యోతిర్ముఖుడు, వరుణుని కుమారుడైన హేమకూటుడు, విశ్వకర్మ కుమారుడు నీలుడు, వసువుల కుమారుడు దుర్ధరుడు కూడా వానర సేనలో ఉన్నారు. వీరందరికీ ప్రధాన సలహాదారుగా తమరి తమ్ముడు విభీషణుడు రాముని పక్కనే ఉన్నాడు. రాక్షసేంద్రా! సువేల పర్వతము మీద ఉన్న వానర సేన గురించి, వానర నాయకుల గురించి, రామలక్ష్మణుల గురించి మీకు వివరంగా చెప్పాను. తరువాత ఏ నిర్ణయం తీసుకుంటారో తమరి ఇష్టం.” అని చెప్పి ఊరుకున్నాడు శార్దూలుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)