శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 31)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది ఒకటవ సర్గ
రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు కోట్లకొలదీ వానరసైన్యములతో వచ్చి లంకను ముట్టడించారు అన్న విషయం గూఢచారుల వలన తెలుసుకున్నాడు రావణుడు. రావణుని మనసులో భయం ప్రవేశించింది. తన ముందు ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి సీతను రామునికి అప్పగించడం. అది తనకు ఇష్టం లేదు. రెండవది రామునితో యుద్ధము చేయడం. తన మంత్రులు తనకు ఈ విషమ సమయంలో ఏదైనా సలహా చెప్పకపోతారా అని ఆశపడ్డాడు. వెంటనే మంత్రులను అందరినీ సభకు రావలసినదిగా ఆదేశాలు పంపాడు. రావణుని మంత్రులందరూ సభకు వచ్చారు. రావణుడు వారితో మంత్రాంగము సాగిస్తున్నాడు.మంత్రులు తమకు తోచిన ఉపాయములను వారు చెప్పారు. అవి ఏవీ రావణునికి రుచించలేదు. సభచాలించి అంత:పురమునకు వెళ్లాడు. రావణునికి ఒక విషయం స్ఫురించింది. సీతను తను
జనస్థానమునుండి అపహరించుకు రావడమే వంచనతో మొదలయింది. ఇప్పుడు కూడా ఆ వంచనాశిల్పాన్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ఇటువంటి మాయలకు పెట్టింది పేరు అయిన విద్యుజ్జిహ్వుని పిలిపించాడు. వానితో ఇలా అన్నాడు. “జనకుని కుమార్తె సీత మన దగ్గర ఉంది. ఆమెను మాయతో భ్రమింపచేయాలి. సీత భర్త రాముడు. రాముని తలను పోలిన తలను, రాముని ధనుర్బాణములను తయారు చేయించి తీరుకొనిరా." అని చెప్పాడు.
విద్యుజ్జిహ్వుడు రావణుని ఆజ్ఞమేరకు రాముని తలను పోలిన తలను, రాముడు ధరించే ధనుర్బాణములను, తయారు చేసి తీసుకొని వచ్చాడు. ఆ తలను విద్యుజ్జిహ్వుని ద్వారా మోయించుకొని రావణుడు అశోకవనమునకు వచ్చాడు. విద్యుజ్జిహ్యుని దూరంగా నిలబెట్టాడు. రావణుడు సీత వద్దకు వెళ్లాడు. సీత దీనంగా శింశుపా వృక్షము కింద కూర్చుని ఉంది. సీత మనసులో రాముని ధ్యానిస్తూ ఉంది. సీత చుట్టు రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు. వారందరూ రావణుని చూచి లేచి నిలబడ్డారు.
రావణుడు సీతను చూచి ఇలా అన్నాడు. “ఓ సీతా! ఇప్పటి దాకా నీవు ఎవరి అండచూచుకొని నన్ను ఎదిరిస్తున్నావో, ఎవరున్నారనే ధైర్యంతో నా పక్కలోకి రావడానికి ఇష్టపడటం లేదో, ఆ రాముడు యుద్ధంలో నా చేతిలో మరణించాడు. నేను చెబితే నువ్వు నమ్మవు కాబట్టి రాముని తలను తీసుకొని వచ్చాను. ఖండింపబడ్డ రాముని శిరస్సు నుండి వెచ్చటి రక్తం ఇంకా కారుతూ ఉంది. ఇంక నైనా నీ మొండి పట్టుదల మానుకో. నాకు భార్యగా ఉండు. సకల సుఖాలు అనుభవించు. రాముడు రణ రంగంలో ఎలా మరణించాడో సావధానంగా విను.
రాముడు సుగ్రీవునితో కలిసి వానర సేనతో సముద్రమువద్దకు వచ్చాడట. రాముడు తన సైన్యముతో సముద్ర తీరంలో నిలిచి ఉన్నాడు. నేను నా గూఢచారులను పంపాను. వారు వానర సేనలతో కలిసిపోయి, వానర సేనలను బాగా పరిశీలించారు. వెంటనే నా సేనాని ప్రహస్తుడు తన సేనలతో రాత్రి పూట వానరులు నిద్రించువేళ హటాత్తుగా దాడి చేసి వానరసేనలను తునుమాడాడు. వానరులందరినీ సమూలంగా చంపివేసాడు. ఆ సమయంలో ప్రహస్తుడు రాముని శిబిరంలోకి ప్రవేశించాడు. తన ఖడ్గంతో నిద్రిస్తున్న రాముని శిరస్సును ఖండించాడు. విభీషణుని బంధించాడు. లక్ష్మణుడు, వానర నాయకులు తలొకదిక్కుగా పారిపోయారు.
మా రాక్షస వీరులు సుగ్రీవుని పట్టుకొని అతని కంఠమును విరిచారు. హనుమంతుని పట్టుకొని పరిమార్చారు. వృద్ధుడైన జాంబవంతుని ఒక్కవేటుతో నరికారు. మైందుడు, ద్వివిదుడు, మొదలగు వానర వీరులు పారిపోతుంటే మా రాక్షస వీరులు వారిని పట్టుకొని నడుములు విరగగొట్టి చంపారు. పనజుడు, దధీముఖుడు, కుముదుడు నా బాణములకు బలి అయ్యారు. అంగదుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు. ఇతర వానరులు మా గజబలము చేత మర్దింపబడ్డారు. మరికొందరు వానరులు పారిపోయారు. కొంత మంది సముద్రములో పడిపోయారు. మరి కొందరు చెట్లమీద తలదాచుకున్నారు. కాని మా రాక్షసులు ఆ వానరులను వెతికి వెతికి చంపారు. మా సేనానాయకుడు రాముని శిరస్సును నాకు కానుకగా పంపాడు. నేను నీకు చూపించడానికి ఆ శిరస్సును తీసుకొని వచ్చాను.” అని సీతతో చెప్పి వెంటనే పక్కనే ఉన్న రాక్షసిని చూచి, “నీవు పోయి ఈ శిరస్సును యుద్ధరంగము నుండి నా వద్దకు తీసుకొని వచ్చిన విద్యుజ్జిహ్వుడు అనే సైనికుడిని తీసుకొనిరా" అని అన్నాడు. రాక్షసి పోయి పక్కనే ఉన్న విద్యుజ్జిహ్వుని తీసుకొని వచ్చింది. విద్యుజ్జిహ్వుడు ఖండింప బడ్డ రాముని తలను, రాముని ధనుర్బాణములను తీసుకొని వచ్చాడు. రావణునికి నమస్కరించి నిలబడ్డాడు.
“విద్యుజ్జిహ్వా! నీవు కదా రాముని తలను యుద్ధరంగము నుండి తీసుకొని వచ్చినది. ఆ తలను సీతకు చూపించు. తన భర్తకు కలిగిన దురవస్థను సీత కళ్లారా చూస్తుంది." అని అన్నాడు. విద్యుజ్జిహ్వుడు రాముని తలను రాముని ధనుర్బాణములను సీత దగ్గరగా పెట్టాడు. "సీతా! చూడు. నీ భర్త రాముడు ఇంక ఈ భూమి మీద లేడు. నేను నీకు భర్తను, నాధుడను. ఇంకనైనా నువ్వు నన్ను భర్తగా స్వీకరించక తప్పదు." అని అన్నాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment